పేదల గూడుపై ప్రభుత్వం దాదాగిరి : భట్టి

3 Jun, 2016 16:39 IST|Sakshi

- దొరల పాలన మళ్లీ కొనసాగుతోంది
- హక్కుల కోసం ఆమరణదీక్ష చేసినా పట్టించుకోరా అంటూ ఆగ్రహం


జవహర్‌నగర్ (రంగారెడ్డి) : తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలపై నిరంకుశంగా వ్యవహరిస్తుందని తెలంగాణ పీసీసీ వర్కింగ్ అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండల పరిధిలోని జవహర్‌నగర్ గ్రామంలో వార్డు సభ్యులు, ప్రజలు నివసించే కాలనీలన్నింటిని గ్రామకంఠంగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ 3 రోజులుగా చేపట్టిన ఆమరణ దీక్షా శిబిరానికి సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ.. పేదల ఇళ్లు కూల్చి కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే పేదల బతుకులు మారుతాయని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రెండు సంవత్సరాల క్రితం ప్రత్యేక రాష్టాన్ని ప్రకటించారని.. కానీ అందుకు భిన్నంగా టీఆర్‌ఎస్ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి కుటుంబపాలన కొనసాగిస్తూ పేదలపై జులుం చేస్తూ దొరలపాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు.

పెద్దలను వదిలి పేదలపై ప్రతాపం చూపుతున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజలు కలిసికట్టుగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. నిరుపేదల ఉసురు పోసుకుంటున్న ప్రభుత్వంపై ప్రజలు తిరగబడాల్సిందేనని.. ప్రస్తుతం తండ్రి, కుమరుడు,కుమార్తె, అల్లుడు రాష్ట్రాన్ని ఏలుతున్నారన్నారు. పల్లెల్లో పనులు లేక బతుకుదెరువు కోసం పట్నానికి వచ్చిన పేద ప్రజలు కాయాకష్టం చేసుకొని నిర్మించుకున్న ఇండ్లను కూల్చివేస్తే కట్టుబట్టలతో వారు ఎక్కడికి పోవాలో ముఖ్యమంత్రి కేసీఆరే వివరించాలని మండిపడ్డారు.మాజీ ప్రధాని జవహర్‌లాల్ పేరుతో వెలసిన జవహర్‌నగర్ గ్రామంలో పేదలే నివసించాలన్నారు.

మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్ మాట్లాడుతూ.. పేదలకు అన్యాయం జరిగితే సహించేదిలేదని, వారందరికీ ఇండ్ల పట్టాలు మంజూరు చేసి సకల సౌకర్యాలు కల్పించే వరకు తమ పోరాటాలను ఆపేది లేదని స్పష్టం చేశారు. జవహర్‌నగర్ భూములు ప్రభుత్వానివి కావని.. మాజీ సైనికుల భూములని అన్నారు. జవహర్‌నగర్ ప్రభుత్వ భూములే అయితే జీవో 58,59 ప్రకారం క్రమబద్ధీకరించపోవడంపై మండిపడ్డారు. జవహర్‌నగర్ ప్రజలకు అన్యాయం జరిగితే రెండు లక్షల మందితో కేసీఆర్ ఫాంహౌస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. జవహర్‌నగర్‌లోని అన్ని ఇళ్లను క్రమబద్ధీకరించి గ్రామకంఠంగా గుర్తించేవరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి పోరాడుతుందన్నారు.

అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, టీ పీసీసీ ఉపాధ్యక్షుడు గడ్డం ప్రసాద్‌ కుమార్, బాల్కొండ మాజీ ఎమ్మెల్యే అనిల్, కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేష్, జిల్లా మైనార్టీ సెల్ కన్వీనర్ కాలేషా, మాజీ సర్పంచ్ శంకర్‌ గౌడ్, శామీర్‌పేట మండల అధ్యక్షుడు వి.సుదర్శన్, ప్రధాన కార్యదర్శి గోనె మహీందర్‌ రెడ్డి, జవహర్‌నగర్ అధ్యక్షుడు బల్లి శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు మంజుల, ఎంపీటీసీ సభ్యుడు జైపాల్‌రెడ్డిలతో పాటు స్ధానిక నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు