భెల్.. గోల్ మాల్!

11 Mar, 2016 02:10 IST|Sakshi
భెల్.. గోల్ మాల్!

నాసిరకం షూస్ ఇచ్చారని కార్మికుల ఆగ్రహం
సుమారు రూ.40 లక్షలు చేతులు మారినట్టు
ఆరోపణలు సీబీఐకి ఫిర్యాదు చేస్తామన్న కార్మికులు
కరపత్రాలు విడుదల చేసిన నేతలు

 భెల్: కార్మికుల భద్రతే లక్ష్యం... వారి శ్రేయస్సే ముఖ్యం అంటూ ప్రకటనలు గుప్పించే భెల్ పరిశ్రమ కమీషన్లకు కక్కుర్తి పడింది. కార్మికుల భద్రత కోసం ఇచ్చే షూస్ కొనుగోళ్లలోనూ అధికారులు కమీషన్లకు ఆశపడి నాసిరకం సరఫరా చేశారు. ప్రస్తుతం పరిశ్రమకు ఆర్డర్లు లేకపోవడంతో ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ప్రతి అంశంలోనూ కోతలు  విధిస్తూ డబ్బు ఆదాకు ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలోనూ కొందరు అధికారులు అందినకాడికి దండుకునే పనిచేయడంపై కార్మిక సంఘాల నాయకులు గుర్రుమంటున్నారు.

 రామచంద్రాపురంలోని భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (భెల్) కార్మికులకు అందించే షూస్ నాసిరకం కొనుగోలు చేయడంపై కార్మిక సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. సంస్థలో పనిచేస్తున్న 4,961 మంది కార్మికులకు గాను రూ.1,195 చొప్పున షూస్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. యాజమాన్యం కొనుగోలు చేసిన షూస్ కనీసం రూ.250 విలువ కూడా ఉండదని, వాటికి అంత మొత్తంలో బిల్లులు చెల్లించడం ఏమిటని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. షూస్ కొనుగోళ్లలో సుమారు రూ.40 లక్షలకుపైగా చేతులు మారిన ట్టు ఆ సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో భెల్ సంస్థ ప్రతిష్ట దిగజారే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సేఫ్టీ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భెల్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేయగా అదే బాటలో మరికొన్ని యూనియన్లు కూడా ఆందోళన వ్యక్తం చేసినట్టు కార్మికుల ద్వారా తెలుస్తోంది. ఈ విషయంలో  భెల్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ బులిటెన్ కూడా జారీ చేసినా యాజమాన్యం వైపు నుంచి స్పందన లేకపోవడంపై ఆయా సంఘాలు మండిపడుతున్నాయి. ఈ విషయమై సీబీఐకి ఫిర్యాదు చేసే విషయాన్ని పరిశీలిస్తామని పలువురు పేర్కొంటున్నారు. ఈ కొనుగోళ్ల విషయంలో అధికార యూనియన్ మాట్లాడ క పోవడంపై యాజమాన్యంతో కుమ్మక్కైనట్టు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ విషయంలో విచారణ జరిపి బాధ్యులుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కార్మికులకు నగదు చెల్లిస్తే వారే నాణ్యమైన షూ కొనుగోలు చేస్తారని పలువురు చెబుతున్నారు. ఈ విషయంలో యాజమాన్యం స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు