బీఆర్‌ఎస్‌ దరఖాస్తులపై కదలిక

22 Nov, 2016 23:20 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: బిల్డింగ్‌ రెగ్యులరైజేషన్ స్కీమ్‌(బీఆర్‌ఎస్‌)కింద జీహెచ్‌ఎంసీకి అందిన దాదాపు 1.39 లక్షల దరఖాస్తుల్లో తిరస్కరణకు గురైన వారికి  సమాచారం అందించనున్నారు. వచ్చే వారం నుంచి ఈ ఫైళ్ల పరిశీలనను చేపట్టి, ప్రాథమిక స్థాయిలోనే  నిర్ద్వంద్వంగా తిరస్కరించే వాటిని సంబంధిత దరఖాస్తుదారులకు సమాచారం ఇవ్వనున్నారు. హైకోర్టు ఆదేశాల కనుగుణంగా ఎలాంటి అక్రమాలను బీఆర్‌ఎస్‌ ద్వారా అనుమతించేది.. ఎలాంటి నిర్మాణాలను నిర్ద్వంద్వంగా తిరస్కరించేది తదితర వివరాలతో అఫిడవిట్‌ను జీహెచ్‌ఎంసీ అధికారులు హైకోర్టుకు అందజేశారు. వారి సమాచారం మేరకు ఎంత పెద్ద భవనమైనా, ఎన్ని అంతస్తుల్లోదైనా నాలాను ఆక్రమించి కట్టినదైతే ఎట్టి పరిస్థితిలోనూ బీఆర్‌ఎస్‌ ద్వారా క్రమబద్ధీకరించరు.

సదరు ఫైలును రిజెక్ట్‌ చేసిన కారణాన్ని తెలియజేస్తూ సమాచారమిస్తారు. అనంతరం నిబంధనల కనుగుణంగా కూల్చివేత చర్యలు చేపడతారు. బీఆర్‌ఎస్‌ దరఖాస్తుల్లో తిరస్కరించిన వారికి ఆ మేరకు సమాచారమివ్వాల్సిందిగా కూడా హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో సదరు కార్యాచరణకు జీహెచ్‌ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. టౌన్ ప్లానింగ్‌ అధికారుల సమాచారం మేరకు దిగువ భవనాలను బీఆర్‌ఎస్‌ ద్వారా క్రమబద్ధీకరించరు.

►   నాలాలు, చెరువులను  ఆక్రమంచిన భూముల్లోని నిర్మాణాలు
►   ప్రభుత్వ స్థలాలు, యూఎల్‌సీ భూముల్లోవి
►   మాస్టర్‌ప్లా¯ŒSలోని రహదారులు, ఓపె¯ŒS ప్లేసెస్‌ లోవి
►    కోర్టు కేసులున్నవి
►    ఫిర్యాదులున్నవి
►    సుమోటాగా జీహెచ్‌ఎంసీ అక్రమమని  గుర్తించినవి
►   పార్కింగ్‌  ఉల్లంఘనలున్నవి  
►    ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు లేని 18 మీటర్లకన్నా ఎత్తయిన భవనాలు.
►  బీఆర్‌ఎస్‌ గడువు (28–10–2015 )తర్వాత నిర్మించినవి.
మరోవైపు,   బీఆర్‌ఎస్‌ కోసం అందిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించి, ఉల్లంఘనలను బట్టి వర్గీకరించి సదరు జాబితాను తమకు సమర్పించాల్సిందిగా  జీహెచ్‌ఎంసీని ఆదేశించిన హైకోర్టు దాన్ని తాము పరిశీలించాక తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని  పేర్కొనడం తెలిసిందే. అంతిమంగా  హైకోర్టు సూచనల మేరకు బీఆర్‌ఎస్‌  ఫైళ్లను పరిష్కరించనున్నారు.
 

మరిన్ని వార్తలు