సాగుతున్న ఆధిపత్య పోరు

23 Jul, 2016 19:23 IST|Sakshi
సాగుతున్న ఆధిపత్య పోరు
మాచర్ల మున్సిపాల్టీలో తెలుగు తమ్ముళ్ల ఘర్షణ 
మాచర్ల : ఆధిపత్య పోరులో మున్సిపల్‌ చైర్మన్‌ గోపవరపు శ్రీదేవి భర్త మల్లికార్జునరావు మృతి చెంది వారం రోజులు కాకముందే మరోసారి పురపాలక సంఘంలో తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు. ఎవరు బలైనా మాకెందుకు మా తీరు మాదే అంటూ ఆధిపత్యం కోసం తన్నులాడుకుంటూనే ఉన్నారు. తమకు చెందిన వార్డులో ఇతర ప్రాంతాలకు చెందిన కౌన్సిలర్లు పెత్తనం చేస్తున్నారని ఆరోపించుకుంటూ 7వ వార్డుకు చెందిన మార్కెట్‌ యార్డు చైర్మన్‌ యాగంటి మల్లికార్జునరావు అనుచరుడు వి.కోటేశ్వరరావు.. 9వ వార్డుకు చెందిన అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్‌ అంకాళమ్మ భర్త చెన్నయ్య తాజాగా శుక్రవారం పురపాలక సంఘంలో ఘర్షణ పడ్డారు. నువ్వెంతంటే.. నువ్వెంతంటూ... అంతు చూస్తాన ని ఒకరు... బయటకు రా (రా) ... అని మరొకరు మార్కెట్‌ చైర్మన్‌ మల్లికార్జునరావు, మున్సిపల్‌ ఉద్యోగులు, పలు వార్డుల నుంచి నీటి కోసం వచ్చిన జనం ముందే ఘర్షణ పడ్డారు. మున్సిపల్‌ పాలక వర్గం రెండేళ్ల కిందట అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆధిపత్య రాజకీయాలతో అభివృద్ధిని విస్మరించారు. ప్రజల సమస్యలను పరిష్కరించలేదు. ఇంత జరుగుతున్నా అధికార పార్టీ నాయకులెవరూ పట్టించుకోవడం లేదు. స్వార్థం, ఆధిపత్యం, రాజకీయాలే వేదికగా మున్సిపాలిటీ తయారైంది. అధికారులకు సైతం అయోమయంలో పడ్డారు. ఆధిపత్యంలో బలైపోయిన మున్సిపల్‌ చైర్మన్‌ కుటుంబాన్ని చూసినా మార్పురాని అధికార పార్టీ నాయకుల తీరుపైనే పట్టణంలో చర్చ సాగుతోంది.
మరిన్ని వార్తలు