పెద్దలప్లాన్‌..పేదల విలవిల

29 Apr, 2017 23:41 IST|Sakshi
 • ఇందిరా సత్యనగర్‌ పుంత
 • పేదల ఇళ్లకు ఎసరు 
 • 80 అడుగుల రోడ్డు విస్తరణకు అధికారుల ప్రయత్నాలు 
 • సర్వే లేకుండానే పనులు చేసేందుకు యత్నం 
 • ఆక్రమణదారులెవరు?
 • ఎందరో తేల్చాలని స్థానికుల డిమాండ్‌ 
 • నీటి సరఫరా నిలిపివేత, వైఎస్సార్‌సీపీ జోక్యంతో పునరుద్ధరణ 
 • చర్యల వెనుక అధికార పార్టీ నేతల హస్తం
 • 200 కుటుంబాల్లో అలజడి ...
 • సాక్షి, రాజమహేంద్రవరం :
  ఉండటానికి గూడు లేకపోవడంతో 44 ఏళ్ల క్రితం ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి వెనుక ఉన్న ఇందిరానగర్‌ రెవెన్యూ సర్వే నంబర్‌ 89లోని పుంతను చదును చేసుకుని చిన్నపాటి ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేదలకు ప్రస్తుతం గూడును కోల్పో యే పరిస్థితి ఏర్పడింది. 1975 మాస్టర్‌ప్లా¯ŒS ప్రకారం 
  కోరుకొండ రోడ్డు నుంచి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి వెనుక అన్నయాచారి రోడ్డును కలుపుతూ 80 అడుగుల రోడ్డును నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే దాన్ని 1989లో స్థానికులు విజ్ఞప్తి మేరకు అప్పటి నగరపాలక మండలి 40 అడుగులకు కుదిస్తూ అక్కడున్న వారికి పట్టాలు మంజూరు చేసేవిధంగా తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. అయితే ఈ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించ లేదు. అయితే తర్వాత 1998లో ఆ రోడ్డును 80 అడుగుల నుంచి 40 అడుగులకు కుదించారు. ఇంత వరకూ బాగానే ఉన్నా ప్రస్తుతం నగరపాలక సంస్థ యంత్రాంగం పుంతలో ఉన్న పేదలను ఖాళీ చేయించి 80 అడుగుల రోడ్డును నిర్మించాలని ప్రయత్నిస్తోంది. 1973 నుంచి  ఆ పుంతలో పేదలు నివాసాలు ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు. 1989లో నగరపాలక మండలి తీర్మానం మేరకు అక్కడ 76 మంది ఉన్నారు. ప్రస్తుతం దాదాపు 200 కుటుంబాలు ఉన్నాయి. పేదల ఇళ్లను ఆనుకుని, ముఖ్యంగా ధనవంతుల ఇళ్లకు ముందు రోడ్డువైపున పేదల ఇళ్లున్నాయి. ప్రస్తుతం అక్కడ కొంత మంది రాజకీయ నాయకులు, పీఅండ్‌టీ కాలనీ వాసులు పేదలను ఖాళీ చేయించేందుకు యత్నిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. 
  సర్వే లేకుండానే పనులు ఎలా? 
  గత చరిత్రను పక్కన పెట్టిన ప్రస్తుత పాలకవర్గం, యంత్రాంగం పుంతలోని ఆక్రమణదారులను ఖాళీ చేయించి 80 అడుగుల రోడ్డు వేయాలని ప్రయత్నిస్తోంది. నగరాన్ని అభివృద్ధి చేయాలన్న యంత్రాంగం చర్యలు తమ బతుకులను ఛిద్రం చేయరాదన్నది అక్కడి పేదల విన్నపం. పుంత ఆక్రమణలో పేదలతోపాటు, ఆ తర్వాత అక్కడ ప్రైవేటు స్థలాలు కొన్నవారు కూడా కొంత ప్రాంతాన్ని తమ స్థలంలో కలుపుకున్నారు. ఆ అనవాళ్లు ఆక్కడ స్పష్టంగా కనపడుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రి వెనుక వైపున అన్నయాచారి రోడ్డు నుంచి కోరుకొండ రోడ్డులోని క్వారీ సెంటర్‌ వరకు దాదాపు రెండు కిలోమీటర్ల పొడవు ఉంది. మధ్య మధ్యలో రోడ్డు వెడల్పు ప్రస్తుతం పలు రకాలుగా ఉంది. నగరపాలక మండలి 1998 తీర్మానం ప్రకారం 40 అడుగులు కాకుండా 80 అడుగుల మేర రోడ్డును వేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు అక్కడ ఉన్న పేదలు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా అసలు పుంత ఎంత స్థలం? ఎక్కడ వరకు ఉంది? ఆక్రమణ ఎంత మేర గురైంది? ఆక్రమణదారులు ఎవరు? ఎంత ఆక్రమించారు? అన్న విషయాలు తేల్చేందుకు సర్వే చేయకుండా పేదల ఇళ్లను మాత్రమే తొలగించాలని నిర్ణయించడంపై విమర్శలు వస్తున్నాయి.   కోరుకొండ రోడ్డు 80 అడుగులు ... అదే విధంగా అన్నయాచారి రోడ్డు కనీసం 30 అడుగులు కూడా లేదు. అలాంటిది ఈ రెండు రహదారులను కలుపుతూ వేసే లింకు రోడ్డు 80 అడుగులు ఉండడం, పీఅండ్‌టీ కాలనీ సంఘానికి, అక్కడ పేదలకు గత కొన్నేళ్లుగా వివాదాలు ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. 
  ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణలు...
  యంత్రాంగం తాను అనుకున్న పనిని వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా పదిహేను రోజుల క్రితం పుంతలోని అన్నయాచారి రోడ్డువైపు ప్రారంభంలోని నీటి కుళాయిని తొలగించింది. అయితే పేదల విషయం ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఫ్లోర్‌లీడర్‌ మేడపాటి షర్మిలా రెడ్డి అధికారుల దృష్టికి తీసుకురావడంతో కుళాయిని పునరుద్ధరించారు. ఘటనా స్థలానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ నేతలు వారికి భరోసా ఇచ్చారు. అయితే మరుసటి రోజు నుంచి కూడా యంత్రాంగం తమ ప్రయత్నాలను ఆపలేదు. దీంతో స్థానికులు నగరపాలక సంస్థ ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎప్పడు ఎవరొస్తారు? ఏమి చేస్తారోనన్న ఆందోళనలో కాలనీ వాసులున్నారు.
   
మరిన్ని వార్తలు