అంతా కలిసి రూ.కోటి నొక్కేశారు!

10 Nov, 2015 08:55 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, విజయవాడ: కృష్ణా జిల్లా ట్రెజరీ కార్యాలయంలో ఏడాదిగా జరుగుతున్న జీతాల కుంభకోణాన్ని అధికారులు గుర్తించారు. జిల్లా ట్రెజరీ అధికారి నందిపాటి నాగేశ్వరరావు ఈ నెల 7న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జిల్లా ట్రెజరీలో కొందరు సిబ్బంది, పదో జిల్లా కోర్టు గుమస్తా శర్మ కలసి పలువురు ఉద్యోగుల పేర్లతో అదనంగా రూ.కోటి వరకు డ్రా చేసి, స్వాహా చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. గుమస్తా శర్మను అరెస్టు చేసి సోమవారం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.

 అంతా కలసి దోచేశారు: కృష్ణా జిల్లా పదో నంబరు కోర్టు, అవనిగడ్డ కోర్టుల్లో పనిచేస్తున్న పలువురు ఉద్యోగుల పేర్లతో సొమ్మును ట్రెజరీ అధికారులు, గుమస్తా శర్మ కలిసి స్వాహా చేశారు. జీతాల బిల్లులను జిల్లా ట్రెజరీ ఆఫీసుకు సమర్పించే సమయంలో ఒక్కో ఉద్యోగి పేరుతో రెండుసార్లు ఒకే నెల జీతాల బిల్లులను గుమస్తా శర్మ ట్రెజరీ కార్యాలయానికి ఇచ్చేవాడు. ఆయనతో కుమ్మక్కైన కొందరు ట్రెజరీ ఉద్యోగులు ఒకే వ్యక్తి పేరుతో ఒకే నెలలో రెండో జీతం కూడా డ్రా చేసేవారు. ఒక జీతం మాత్రమే ఉద్యోగికి వెళ్లేది. రెండోసారి డ్రా చేసిన జీతాన్ని ట్రెజరీ అధికారుల సహకారంతో శర్మ, ఇతర ట్రెజరీ ఉద్యోగులు కలసి స్వాహా చేశారు. ఇలా దోచేసిన సొమ్ము రూ.కోటికిపైగానే ఉంటుందని అంచనా.

 బయటపడిందిలా..: జిల్లా ట్రెజరీ కార్యాలయంలో కోర్టు గుమస్తా శర్మ కోర్టు ఉద్యోగుల బిల్లులు ఆన్‌లైన్‌లో నమోదు చేసేవాడు. దీనిని పలువురు ట్రె జరీ ఉద్యోగులు వ్యతిరేకించేవారు. దీనికితోడు జిల్లా ట్రెజరీ అధికారి ఒక్కోసారి ఉద్యోగుల వద్దకు వచ్చి శర్మను చూసి నేర్చుకోవాలని, మన డిపార్ట్‌మెంట్ కాకపోయినా జీతాల బిల్లులను ఆన్‌లైన్‌లో ఎలా నమోదు చేశారో చూడండంటూ కొందరిని చులకన చేసి మాట్లాడేవారు. తతంగాన్ని ఉద్యోగులే బయటపెట్టారు.

మరిన్ని వార్తలు