దొంగల దండుకు సంకెళ్లు

12 Jul, 2016 04:26 IST|Sakshi
దొంగల దండుకు సంకెళ్లు

41 దొంగతనాలు చేసిన తొమ్మిది మంది అరెస్టు
అద్దంకి, ఒంగోలు, కనిగిరి పోలీసు సర్కిళ్ల పరిధిలో చోరీలు
17 మోటారు సైకి ళ్లు, రెండు ఆటోల స్వాధీనం
330 కిలోల కాపర్, అల్యూమినియం కూడా..
చోరీ సొత్తు విలువ అక్షరాలా రూ.14.50 లక్షలు
వివరాలు వెల్లడించిన ఎస్పీ 

ఒంగోలు క్రైం : జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగిన 41 దొంగతనాలకు సంబంధించి 9 మంది నిందితులను సోమవారం అరె స్టు చేసినట్లు ఎస్పీ డాక్టర్ సీఎం త్రివిక్రమ్‌వర్మ తెలిపారు. స్థానిక ఒంగోలు ఒన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, సీసీఎస్ డీఎస్పీ కేశన వెంకటేశ్వరరావు, కందుకూరు డీఎస్పీ కె.ఎస్.ప్రకాశరావు, దర్శి డీఎస్పీ వి.రాంబాబులతో కలిసి సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను ఆయన వెల్లడించారు.

ఒంగోలు, అద్దంకి, కనిగిరి పోలీసు సర్కిళ్ల పరిధిలో 9 మంది చోరీలకు పాల్పడినట్లు ఎస్పీ వివరించారు. నేరాలకు పాల్పడిన వారిలో అంతర్ జిల్లాల దొంగలు ఐదుగురు ఉన్నారని, వారు కృష్ణా జిల్లా నందిగామకు చెందిన ముక్కు గోపి, కురిచేడు మండలం బోదనంపాడుకు చెందిన నంబూరి మరియదాసు, బల్లికురవ మండలం కొత్తూరుకు చెందిన తన్నీరు నరసింహారావు, అద్దంకి నంబూరివారిపాలేనికి చెందిన కరసాల నాగేశ్వరరావు, కనిగిరి మండలం కొత్తపల్లికి చెందిన అల్లు బాలయ్యలతో పాటు మరో నలుగురిని అరెస్టు చేశామని ఎస్పీ వెల్లడిం చారు. మిగిలిన వివరాలు ఆయన మాటల్లోనే..

 కెమెరాలనూ వదలని దొంగలు
అంతర్ జిల్లా దొంగ నంబూరి మరియదాస్ ఒంటరిగా వెళ్లి కెమెరాలు అపహరిస్తుంటాడు. తన మోటారు సైకిల్‌పై చిన్న లగేజీ వేసుకొని ఫొటో స్టూడియోలకు వెళ్లి అర్జంటుగా పెళ్లి ఫొటోలు తీయాలని, ఫొటోగ్రాఫర్‌ను పంపాలని కోరతాడు. తనతో ఫొటోగ్రాఫర్‌ను తీసుకెళ్తాడు. ఏదో ఒక గ్రామానికి తీసుకెళ్లి  బైకుపై ఉన్న లగేజీని ఒక ఇంట్లో పెట్టమని చెబుతాడు. లగేజీ తీసుకెళ్లేటప్పుడు ఫొటోగ్రాఫర్ వద్ద ఉన్న కెమెరాను ఇతనికి ఇచ్చి వెళ్తాడు. అంతే ఆ లగేజీ లోపల పెట్టి వచ్చేలోపు కెమెరాతో బైకుపై ఉడాయిస్తాడు. ఈ విధంగా 2014 జూలై, సెప్టెంబర్, అక్టోబర్, 2016 ఏప్రిల్, జూలై మాసాల్లో అద్దంకిలో రెండు, జె.పంగులూరు, సంతనూతలపాడులో, బేస్తవారిపేట, నర్సరావుపేటల్లో ఒక్కొక్కటి చొప్పున కెమెరాలు మాయం చేశాడు.

మరియదాస్ మరో ముగ్గురు తన్నీరు నరిసింహారావు, కరసాల నాగేశ్వరరావు, అల్లు బాలయ్యలను కలుపుకొని దొంగతనాలు, దోపిడీలు చేయటం ప్రారంభించాడు. అద్దంకి పట్టణంలో గతేడాది, ఈ ఏడాదిలో మూడిళ్లల్లో పగలు, రాత్రి అనే తేడా లేకుండా దొంగతనాలు చేశారు. ఆ ఇళ్లలో 9 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.30 వేల నగదు కాజేశారు. అదే విధంగా గతేడాది అక్టోబర్‌లో అద్దంకిలోని ఒక ఇంట్లోకి చొరబడి దొంగతనానికి పాల్పడగా ఇంట్లోని మహిళ ప్రతిఘటించింది. ఆమెను కత్తితో పొడిచి పారిపోయారు.

 ఒక్కరే 11 సెల్‌ఫోన్ల అపహరణ
కృష్ణా జిల్లా నందిగామ మండలం మాగల్లుకు చెందిన అంతర్ జిల్లా దొంగ అద్దంకి, మేదరమిట్ల ప్రాంతాల్లో 11 సెల్‌ఫోన్లు అపహరించాడు. వాటిలో మేదరమెట్లలోని సెల్‌ఫోన్ షాపునకు చెందిన షట్టర్‌ను పగులగొట్టి 10 సెల్‌ఫోన్లు, అద్దంకిలో ఒక సెల్‌ఫోన్‌ను దొంగిలించాడు. అద్దంకి, జె.పంగులూరు ప్రాంతాల్లో మూడు బైకులు కాజేశాడు. సెల్‌ఫోన్ల, మోటారు సైకిళ్లతో పాటు ఇతని వద్ద నుంచి 9 సవర్ల బంగారు ఆభరణాలు, 6 కెమెరాలు స్వాధీనం చేసుకున్నారు. చోరీ సొత్తు విలువ రూ.5 లక్షలు ఉంటుంది.

 ట్రాన్స్‌ఫార్మర్ల దొంగలు కూడా..
పొలాల్లో ఉన్న వ్యవసాయ విద్యుత్ ట్రాన్ ్సఫార్మర్లే లక్ష్యంగా జిల్లాలోని ముగ్గురు దొంగతనాలకు పాల్పడుతున్నారు. పెద్దారవీడు మండలం శివాపురానికి చెందిన బోగుల వెంకటేశ్వర్లు, కనిగిరి ఎన్‌జీఓ కాలనీకి చెందిన పడిదపు కొండలు, దర్శి మండలం రాజపల్లికి చెందిన బచ్చలకూరపాటి రత్తయ్యలు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను పగులగొట్టి కాపర్, అల్యూమినియాన్ని విక్రయించారు. వీళ్ల ముగ్గురూ ఈ ఏడాదిలోనే 20 ట్రాన్స్‌ఫార్మర్లను పగులగొట్టారు. కనిగిరి, వెలిగండ్ల, హనుమంతునిపాడు, పీసీపల్లి, పొదిలి, కొనకనమిట్ల, దొనకొండ పోలీసుస్టేషన్ల పరిధిలో ఇలాంటి దొంగతనాలకు పాల్పడ్డారు. వీరి నుంచి 330 కిలోల కాపర్, అల్యూమినియం వైర్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం వాటి విలువ రూ.3.30 లక్షలు. నిందితులను పట్టుకుని అత్యంత చాకచక్యంగా కేసులను ఛేదించిన ఒంగోలు, దర్శి, కందుకూరు, సీసీఎస్ డీఎస్పీలను ఎస్పీ త్రివిక్రమ్‌వర్మ ప్రత్యేకంగా అభినందించారు. 

ఒక్కడే 14 బైకులు, రెండు ఆటోలు అపహరణ
ఒంగోలు నగరాన్ని లక్ష్యంగా చేసుకుని గోగు శివశంకర్ అనే దొంగ మొత్తం 14 మోటారు సైకిళ్లు, రెండు ఆటోలను రెండే ళ్లలో అపహరించాడు. చీమకుర్తి మండలం నాయుడుపాలేనికి చెందిన గోగు శివశంకర్ కేవలం పగటి పూట మాత్రమే దొంగతనాలకు పాల్పడుతుంటాడు. షాపింగ్ మాల్స్, రోడ్లు, ఇంటి ముందు తాళం వేసి ఉన్న మోటారు సైకిళ్లను మారు తాళాలతో లేదా తాళాలు పగులగొట్టి బైకులు మాయం చేస్తుంటాడు. ఒంగోలు ఒన్‌టౌన్, టూటౌన్, తాలూకా పోలీసుస్టేషన్ల పరిధిలో 2015, 2016 సంవత్సరాల్లో కేవలం మే, జూన్ మాసాల్లో మాత్రమే 14 మోటారు సైకిళ్లను అపహరించాడు. అదేవిధంగా ఒంగోలు టూటౌన్, తాలూకా పోలీసుస్టేషన్ల పరిధిలో రెండు ఆటోలను కూడా దొంగిలించినట్లు తేలింది. వీటి మొత్తం విలువ దాదాపు రూ.6.20 లక్షలు ఉంటుంది.

>
మరిన్ని వార్తలు