రాయలసీమలోనే అతి పెద్ద ఆంజనేయుడు

14 May, 2017 23:31 IST|Sakshi
రాయలసీమలోనే అతి పెద్ద ఆంజనేయుడు

హాయ్‌ పిల్లలూ.. 22 అడుగుల ఎత్తు ఉన్న  భక్తాంజనేయస్వామి ఏకశిలా విగ్రహాన్ని మీరెప్పుడైనా చూశారా? అనంతపురంలో కొలువైన ఈ భారీ భక్తాంజనేయుడు ఎవరినైనా సూదంటు రాయిలా ఆకర్షిస్తాడు. దాదాపు రూ.4 కోట్ల వ్యయంతో హౌసింగు బోర్డులోని సమర్థసద్గురు సాయిసేవాశ్రమం ప్రాంగణంలో నిర్మాణమైన నిలువెత్తు ఆంజనేయ  విగ్రహానికి అనేక ప్రత్యేకతలున్నాయి. భూమి నుంచి 46 అడుగుల ఎత్తులో రెండు అంతస్తులుగా నిర్మించబడిన  ఇలాంటి ఆలయం రాయలసీమలోనే మొదటిది కావడం విశేషం. తొలిసారిగా దివ్యమంగళ స్వరూపమైన ఆంజేయుడి భారీ విగ్రహానికి అభిషేకం చేయడానికి ప్రత్యేకంగా లిఫ్ట్‌ ఏర్పాటు చేశారు.

కంచి వాస్తవ్యులు పద్మశ్రీ గణపతి స్థపతి పర్యవేక్షణలో ఈ ఆలయ నిర్మాణం ఆద్యంతం రాజుల కాలాన్ని తలపించింది. భారతీయ శిల్పశైలికి అనుగుణంగా, చూడముచ్చటగా ఆలయ గోపురంతోపాటు ఇతర నిర్మాణాలు ఒక్కసారి చూడగానే ఆధ్యాత్మిక భావాలను పెంపొందిస్తాయి. భారతీయ వాస్తు శిల్పాన్ని ప్రతిబింబిస్తూ ఆలయ ప్రాంగణంలో సాగిన నిర్మాణాలు కూడా అందరినీ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతాయి.  భక్తిభావం నింపే షిరిడి సాయినాథుడు, భారీ అశ్వంపై మరాఠ వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్‌ విగ్రహాలను చూసి తీరాల్సిందే. దీనికి తోడు ఈనెల 21న రానున్న హనుమజ్జయంతిని పురస్కరించుకుని ఇప్పటికే ఆలయంలో సందడి నెలకొంది. ఇంకెందుకు ఆలశ్యం ఇంకా చూడనివారెవరైనా ఉంటే వెంటనే చూసొద్దాం రండి.
- అనంతపురం కల్చరల్‌

మరిన్ని వార్తలు