ఉపాధి.. హతవిధీ

11 Apr, 2017 07:05 IST|Sakshi
ఉపాధి.. హతవిధీ

► పేరుకుపోతున్న ఉపాధి బకాయిలు
► అల్లాడిపోతున్న కూలీలు
► చెల్లించేదే తక్కువ మొత్తం
► దెబ్బతింటున్న పథకం లక్ష్యం
► కుప్పంలో పరిస్థితి మరీ ఘోరం


గ్రామీణ పేదలకు, దినసరి కూలీలకు వరప్రసాదం ఉపాధి హామీ. వలసలకు అడ్డుకట్టవేసి.. గ్రామీణ భారతాన్నిఆర్థికంగా శక్తిమంతం చేయడం దీని ఉద్దేశం. సొంత ఊళ్లలోనే పని అడిగిన ప్రతి ఒక్కరికీ సంవత్సరంలో కనీసం 100 రోజులు పని కల్పించాలి. పని అయితే కల్పిస్తున్నారు కానీ కూలి చెల్లించడంలో మాత్రం ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. పథక ఉద్దేశం దెబ్బతింటోంది.  జనవరి 15 నుంచి ఉపాధి కూలీలకు వేతనాలు ఇవ్వడంలేదు.  నిరుపేదలు ఆకలితో అలమటిస్తున్నారు. జిల్లాలో వలసలు రోజురోజుకూ  పెరుగుతున్నాయి. కేంద్రం తన వాటాగా ఇచ్చిన నిధులను ప్రభుత్వ అవసరాలకు ఖర్చు చేయడంతో ఉపాధి కూలీలకు మూడు నెలలుగా వేతనాలు లేక అల్లాడుతున్నారు.

చిత్తూరు,సాక్షి: జిల్లాలో ఉపాధి పథకంలో పని చేసే వారికి జనవరి 15 నుంచి కూలి నిలిచియిపోయింది. ఈ మూడునెలల్లో రూ.18 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను ఇతర అవసరాలకు వాడుకుంటుండటంతోనే ఉపాధి వేతనాలు నిలిచి పోయాయని తెలుస్తోంది. అయితే ఉపాధి హామీ పథకానికి మెటీరియల్‌ పనులు చేసే కాంట్రాక్టర్లకు మాత్రం ఎప్పటికప్పుడు సొమ్ములు చెల్లిస్తోంది. కూలీలకు మాత్రం మొండిచేయి చూపిస్తోంది. ఫిబ్రవరిలో కలెక్టర్‌ సిద్ధార్థజైన్‌ ఉపాధి పనులకోసం రూ.13 కోట్లు విడుదల చేశారు. ఈ మొత్తాన్ని కాంట్రాక్టర్ల చెల్లింపులకే కేటాయించారు. పెద్ద నోట్ల ప్రభావంతో చెల్లింపులు నిలిచిపోవడంతో కూలీలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం.. వేతనాలు చెల్లించాలని ఇండియన్‌ బ్యాంకును ఆదేశించింది.దీంతో ఆ బ్యాంకు రూ.6కోట్లు వేతనాలుచెల్లించింది. వీటిని కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు చెల్లించలేదు.

పని కల్పన అంతంత మాత్రమే..: జిల్లా నుంచి పక్క రాష్ట్రాలకు వలసలు ఎక్కువగా ఉండటంతో ప్రతి రోజూ లక్ష మందికి ఉపాధి కల్పించాలని ప్రభుత్వం లక్ష్యం నిర్ణయించుకుంది. కేవలం 30 వేల మందికి మాత్రమే పనులు కల్పిస్తున్నారు. ప్రతి కూలీకి రూ.194 కనీసవేతనం నిర్ణయించగా.. కేవలం రూ.168 లు మాత్రమే చెల్లిస్తున్నారు. గిట్టుబాటు ధర కల్పిండంలో కూడా ప్రభుత్వం విఫలమైంది. దీంతో ఉపాధి పనులపై కూలీలు ఆసక్తి చూపించడంలేదు.  మొత్తం 6.58,914 మంది కూలీలుండగా 2016–17 ఏడాదికి గాను 2,27,206 మందికి మాత్రమే పని కల్పించారు.

కుప్పంలో మరీ ఘోరం..: జిల్లాలోనే అధికంగా వలసలున్న ప్రాంతం కుప్పం. వలసల్ని కట్టడి చేయడంలో ప్రభుత్వ పూర్తిగా విఫలం అయింది. నియోజకవర్గంలో 18606 మందికి జాబ్‌కార్డులుండగా కేవలం 9226 మందికి మాత్రమే పని కల్పిస్తున్నారు. కూలి కూడా రూ.167లు మాత్రమే చెల్లించారు. ఈ ధర గిట్టుబాటు కాకపోవడంతో వలసలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. వలసలన్న చోట పని దినాలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినా ఇక్కడ అమలు కావడం లేదు.

బిల్లులు మంజూరు కాలేదు...: గత 6 నెలలుగా ఉపాధిహామి బిల్లులు మంజూరు కాలేదు. ఇంకుడు గుంతలు తవ్వ మన్నా రు. తవ్విన తరువాత బిల్లులు మంజూరు చేయలేదు. అంతే కాకుండా మామిడి చెట్ల బిల్లులు కూడా చాలావరకు మంజూరు కాలేదు. టీడీపీ ప్ర భుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉపాధి హామి బిల్లులు చాలావరకు సమయానికి రావడం లే దు. ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా ఉపాధిహామి బిల్లులు మంజూరు చేయాలని కోరుతున్నాం. ---పి.రాజారెడ్డి, లింగనపల్లి

పస్తులు గడుపుతున్నాం: గ్రామీణ ఉపాధిహామీ పనులు చేసి రెండు నెలలు గడుస్తున్నా కూలీ డబ్బులను చెల్లించలేదు. దీంతో రెక్కాడితే కాని డొక్క నిండని బతుకులు గడుపుతు న్న మాకు చేతిలో చిల్లిగవ్వ లే కుండా పస్తులు గడుపుతున్నాము. దీనికితోడు ఉపాధిహామీ నిధులు సీసీ రోడ్లకు మళ్లించడంతో మాకు ఉపాధిహామీ పనులు సక్రమంగా కల్పించడం లేదు. దీంతో పొట్టకూటి కోసం పిల్లపాపలతో కలసి వలసలు వెళ్లాల్సిన పరిస్థితి మళ్లీ ఎదురవుతోంది.   –పోలమ్మ, గురవరాజుపల్లి ఎస్టీ కాలనీ, రేణిగుంట

మరిన్ని వార్తలు