పస్తులకు ‘హామీ’

30 Apr, 2017 23:28 IST|Sakshi
పస్తులకు ‘హామీ’

– ఉపాధి పనులకు ‘ఎన్‌పీసీఐ’ దెబ్బ
– సర్వర్‌తో అనుసంధానం కాక బిల్లులు రాని వైనం
– జిల్లా వ్యాప్తంగా రూ.7.42 కోట్లు తిరస్కరణ
– కూలీల ఆవేదనను పట్టించుకోని బ్యాంకర్లు, అధికారులు


6,54,133
జిల్లా వ్యాప్తంగా ఉపాధి కూలీలు


4,59,281
ఆధార్‌తో ఎన్‌పీసీఐతో అనుసంధానం చేసుకున్న వారు


1,94,852
ఇంకా అనుసంధానం చేసుకోనివారు


ఉపాధి హామీ పథకం శ్రమజీవుల బతుకులకు హామీ ఇవ్వలేకపోతోంది. పనులు చేసినా నెలల కావస్తూ కూలి సొమ్ము జమ కాకపోవడంతో పస్తులుండేలా చేస్తోంది.

అనంతపురం టౌన్‌ : వలసలను నివారించి ఉన్న ఊరిలోనే పని కల్పించేందుకు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చారు. గత ఏడాది డిసెంబర్‌ వరకు బ్యాంక్, తపాలాశాఖ కార్యాలయాల్లోని కూలీల ఖాతాలకు నగదు జమ చేసేవారు. జనవరి నుంచి నేరుగా కూలీల బ్యాంక్‌ ఖాతాలో మాత్రమే జమ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి గత ఏడాది ఏప్రిల్‌ నాటికే ఉపాధి కూలీలందరికీ బ్యాంక్‌ ఖాతాలు తెరిపించి అందులోనే కూలి సొమ్ము జమ చేసేలా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహించారు. ఈ క్రమంలో ప్రస్తుతం బ్యాంక్‌ ద్వారానే కూలి చెల్లింపులు ప్రారంభం కాగా నిధులు బ్యాంకర్లకు చేరినా కూలీలు అందుకోలేని దయనీయ పరిస్థితి నెలకొంది. నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) సర్వర్‌కు కూలీల బ్యాంక్‌ ఖాతా, ఆధార్‌ నంబర్‌ అనుసంధానం కాకపోవడమే దీనికి కారణం. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 6,54,133 మంది ఉపాధి కూలీలు ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు 4,59,281 మంది కూలీల ఆధార్‌ నంబర్లు మాత్రమే ఎన్‌పీసీఐ సర్వర్‌కు అనుసంధానం అయ్యాయి. ఇంకా 1,94,852 మంది ఖాతాలు కావాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయితేనే కూలీలకు సొమ్ము జమ అవుతుంది. లేకుంటే పనులు చేసినా డబ్బు రాదు.

ఆందోళన బాటలో ఉపాధి కూలీలు :
ఉపాధి కూలీల ఖాతాల్లోకి సొమ్ము జమ చేశామని అధికారులు చెబుతున్నా బ్యాంకుల్లో సమస్య కారణంగా చేతికి అందడం లేదు. దీంతో కూలీలు ఎంసీసీ (మండల కంప్యూటర్‌ సెంటర్‌), బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆధార్‌ తీసుకెళ్లి ఇస్తున్నా అనుసంధాన ప్రక్రియలో జాప్యం కారణంగా కూలీలకు పస్తులు తప్పడం లేదు. కొన్ని చోట్ల బ్యాంకర్ల నుంచి ఛీత్కారాలు ఎదురవుతున్నాయి. ఎన్‌పీసీఐ సర్వర్‌కు అనుసంధానం కాని కూలీలు పనులకు వెళ్లినా, వారికి సంబంధించి నగదు తిరస్కరణ జాబితాలో చేరుతోంది. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా అటు అధికారులు గానీ, బ్యాంకర్లు గానీ స్పందించడం లేదు. ఇటీవల రొద్దం, లేపాక్షిలో కూలీలు  ఆందోళనలు చేశారు. నాలుగురోజుల క్రితం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో డ్వామా కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ఇలా జిల్లాలో రోజూ ఏదో ఒక ప్రాంతంలో కూలి చెల్లించాలంటూ కూలీలు ఆందోళనలు చేస్తున్నారు.

రూ.7.42 కోట్లు తిరస్కరణ :
చేసిన పనులకు సంబంధించి కూలీలకు చెల్లించాల్సిన వేతనాలు బ్యాంకులకు వెళ్లినా కూలీల ఖాతాలకు ఆధార్‌ అనుసంధానం కాక జిల్లా వ్యాప్తంగా రూ.7,42,90,648 తిరస్కరణ జాబితాలో చేరాయి. ఎన్‌పీసీఐ సర్వర్‌తో అనుసంధానం కాని వారు, బ్యాంక్‌ ఖాతాలు, ఆధార్‌ వివరాల్లో చిన్నపాటి తప్పదాల కారణంగానే ఈ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కూలీల ఖాతాలకు, ఆధార్‌ అనుసంధానం చేయించడంలో ఉపాధి హామీ అధికారులకు, బ్యాంక్‌ అధికారులకు మధ్య పూర్తిగా సమన్వయం లోపించింది. ఫలితంగా కూలీలు ఇబ్బందులు పడుతున్నారు.  

బ్యాంకర్లు పట్టించుకోవడం లేదు
నాకు తొమ్మిది వారాల బిల్లు రావాలి. ఆఫీసర్లకు అడిగితే సిండికేట్‌ బ్యాంకుకు వెళ్లమన్నారు. ఇప్పటికి నాలుగు సార్లు వెళ్లొచ్చినా. ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ పుస్తకం ఇచ్చినా. అయినా బ్యాంకోళ్లు అస్సలు పట్టించుకోవడం లేదు. ఎట్లంటే అట్ల మాట్లాడతాన్నారు. ఆధార్‌ లింకు అయితేనే బిల్లులొస్తాయని సార్లు చెప్పినారు. నెలల తరబడి డబ్బుల్లేకుంటే కష్టంగా ఉంది.  
– ప్రభాకర్, ఉపాధి కూలీ, శింగనమల

బిల్లులు రాక వేరే పనికి వెళ్తున్నా
ఉపాధి బిల్లులు ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. నాకు ఆరు వారాల బిల్లు రావాలి. మా ఆయన (లక్ష్మీనారాయణ)కు పది వారాలది రావళ్ల. అధికారులను అడిగితే బ్యాంకుకు వెళ్లమన్నారు. బ్యాంక్‌కు పోతే ఆధార్‌ కార్డు లింక్‌ లేదన్నారు. ఎన్ని సార్లు వెళ్తున్నా పట్టించుకోవడం లేదు. అందుకే నేను ఉపాధి పని వదిలేసి వేరే పనికి వెళ్తాన్నా. వారాలకు వారాలు బిల్లులు రాకుంటే ఇల్లు ఎలా గడుస్తుంది.
– వరలక్ష్మి, నిదనవాడ, శింగనమల మండలం

ఆందోళన చెందొద్దు
కేంద్రం ఆదేశాల మేరకు అందరికీ బ్యాంక్‌ ఖాతాల ద్వారానే కూలి డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకున్నాం. ఈ క్రమంలో కొన్ని సాంకేతిక ఇబ్బందులు వస్తున్నాయి. కొందరు కూలీలకు రెండు ఖాతాలు ఉండడం వల్ల కూడా కాస్త గందరగోళం ఉంది. సమస్యను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే బిల్లుల చెల్లింపులు పూర్తవుతాయి. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
– నాగభూషణం, డ్వామా పీడీ

>
మరిన్ని వార్తలు