బీసీ వసతి గృహాల్లో బయోమెట్రిక్‌

11 Jul, 2017 00:48 IST|Sakshi
బీసీ వసతి గృహాల్లో బయోమెట్రిక్‌

► బాలికల వసతి గృహాల్లో సీసీ కెమెరాలు కూడా..
► అక్రమాలకు అడ్డుకట్ట ∙సులువుగా అధికారుల పర్యవేక్షణ
►  పెరగనున్న విద్యార్థుల హాజరు శాతం

కరీంనగర్‌ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ ఎస్సీ వసతి గృహాల్లో రెండేళ్ల క్రితం నుంచే బయోమెట్రిక్‌ విధానం అమలు చేయడంతో విద్యార్థుల హాజరు శాతంతోపాటు, అక్రమాలకు అడ్డుకట్ట పడింది. ఫలితంగా బీసీ వసతి గృ హాల్లోనూ ఈ విధానం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయించింది. దీంతో వసతి గృహాల్లో చోటు చేసుకుంటున్న అక్రమాలకు కళ్లెం పడనుంది. ప్రస్తుతం వసతి గృహాల నిర్వాహకులు సమయపాలన పాటించకపోవడంతోపాటు స్థానికంగా ఉండడం లేదు. అధికా రులు పర్యవేక్షణ కొరవడడంతో ఇష్టం వచ్చినప్పుడు వస్తూ వెళ్తున్నారు.

ఈ క్రమంలో ఆయా వసతి గృహాల్లో బయోమెట్రిక్‌ అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోం ది. ఎస్సీ వసతి గృహాల్లో రెండేళ్లుగా అమలులో ఉంది. సత్ఫలితాలు రావడంతో, ఈ విద్యా సంవత్సరం నుంచే బీసీ వసతి గృహాల్లో అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఆగస్టు మొదటి వారం నుంచి బయోమెట్రిక్‌ ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం అవసరమున్న కంప్యూటర్లు, ప్రింటర్లు, బయోమెట్రిక్‌ యంత్రాలు జిల్లాకు చేరుకున్నాయి. వసతి గృహాల్లో విద్యార్థులు తక్కువగా ఉన్నా, హాజరు శాతం ఎక్కువగా చూపించి కాస్మోటిక్‌ చార్జీలు, దుప్పట్ల నిధులు కాజేసేవారు. ఉద్యోగులు సక్రమంగా విధులకు హాజరుకాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించేవారు. బయోమెట్రిక్‌ విధానంతో వసతి గృహాల్లో ఇలాంటి అక్రమాలకు తెరపడనుంది.

జిల్లాలో 1,740 మంది విద్యార్థులు..
జిల్లాలో 5 ప్రీమెట్రిక్, 2 పోస్ట్‌మెట్రిక్‌ వసతి గృహాలుండగా, గతేడాది 1600 మంది విద్యార్థులు వసతి పొందారు. వీటిలో పోస్ట్‌మెట్రిక్‌ వసతి గృహాల్లో 740 మంది, ప్రీమెట్రిక్‌ వసతి గృహంలో 860 మంది ఉండేందుకు అవకాశం కల్పించారు. ఈ ఏడాది ఇప్పటివరకు 180 మంది విద్యార్థులు చేరారు. ఇప్పుడిప్పుడే ప్రవేశాలు జరుగుతున్నాయి. వీటిపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వసతి గృహాల వార్డెన్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతోపాటు చాలా చోట్ల మెనూ ప్రకారం భోజనం అందించడం లేదు.

ప్రవేశం పొందిన విద్యార్థులు రోజుల తరబడి వసతి గృహాలకు హాజరుకాకున్నా, నిర్వాహకులు పూర్తి స్థాయిలో హాజరు శాతం నమోదు చేస్తూ నిధులు కాజేస్తున్నారు. కాస్మోటిక్‌ చార్జీలు, దుప్పట్లతోపాటు తప్పుడు లెక్కలు చూపుతూ అక్రమాలకు పాల్పడుతున్నారు. వసతి గృహాలు పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు‘మామూలు’గా వ్యవహరించడంతో అక్రమాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. పలువురు వార్డెన్లు విధులకు హాజరు కాకుండా, అటెండర్లు, కుక్‌లే వసతి గృహాలను నిర్వహిస్తున్నారు. ఇలాంటి  పరిస్థితులకు అడ్డుకట్ట వేసేందుకు వసతి గృహాల్లో బయోమెట్రిక్‌తో పాటు కంప్యూటర్, ప్రింటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అక్రమాలకు తెర..
వసతి గృహాల్లో బయోమెట్రిక్‌ విధానం అమలుతో అక్రమాలకు తెరపడనుంది. బయోమెట్రిక్‌ విధానంలో వేలిముద్రతో యంత్రాన్ని ఓపెన్‌ చేస్తారు. విద్యార్థులు ప్రతిరోజూ ఉదయం అల్పాహారం చేసే ముందు, మధ్యాహ్న భోజనానికి ముందు రెండుసార్లు బయోమెట్రిక్‌ యంత్రంపై వేలిముద్రలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో హాజరుశాతం నమోదవుతుంది. మండలస్థాయి నుంచి రాష్ట్రస్థాయి అధికారులకు ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీంతో వసతి గృహాల నిర్వాహకులు సమయపాలన పాటించడంతోపాటు విద్యార్థుల హాజరు శాతం పెరగనుంది. విద్యార్థులకు అందించే భోజనం, ఇతర సామగ్రి లెక్కలు పక్కాగా ఉంటాయి.

త్వరలోనే అమలు చేస్తాం..
జిల్లాలోని బీసీ వసతి గృహాల్లో బయోమెట్రిక్‌ విధానం అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే బయోమెట్రిక్‌ మిషన్లు, సీసీ కెమెరాలు జిల్లాకు చేరుకున్నాయి. జిల్లాలోని వసతి గృహాల్లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ విధానం అమలైతే వసతి గృహ నిర్వాహకుల్లో జవాబుదారీతనం పెరగడంతోపాటు విద్యార్థుల హాజరు శాతం పెరుగుతుంది. ఉన్నతాధికారులకు రోజూవారీ విద్యార్థుల హాజరుశాతం అందుబాటులో ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా బీసీ వసతి గృహాల్లో ఆర్‌వో ప్లాంట్లు, ఇన్వ్‌ర్టర్‌లు అమలు చేసేందుకు నిధులు వచ్చాయి. ట్రంకు పెట్టేలు సైతం కొత్తగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి.
– బి.సరోజ, జిల్లా బీసీ వెల్ఫేర్‌ అధికారి

మరిన్ని వార్తలు