కొల్లేరుకు కొండంత కష్టం!

22 Apr, 2016 12:49 IST|Sakshi
అడుగంటిన కొల్లేరులో ఆహారం కోసం పక్షుల వెదుకులాట

ఎండల ధాటికి ఎడారిలా మారిన సరస్సు
మృత్యువాత పడుతున్న అరుదైన పక్షిజాతులు


సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రకృతి సౌందర్యానికి నెలవు.. వేలాది పక్షి జాతుల ఆవాసం.. అత్యంత అరుదైన విదేశీ విహంగాల విడిది కేంద్రమైన కొల్లేరు సరస్సు నేడు ఎడారిలా మారిపోయింది. పక్షుల కళేబరాలతో మరుభూమిని తలపిస్తోంది. స్వచ్ఛమైన నీరు.. కలువ పూల సోయగం.. పక్షుల కిలకిలారావాలు.. ఆకాశాన్ని కప్పినట్టుండే  పిట్టల గుంపులతో అద్భుత లోకంలా అలరారే కొల్లేరు ఇప్పుడు చుక్క నీరు లేకుండా బీటలు వారింది. వేలాది ఎకరాలు ఎండిపోయి పది అడుగులకో పక్షి కళేబరం కనిపిస్తూ కొల్లేటి చరిత్రలోనే ఎప్పుడూ లేని దారుణ పరిస్థితి దాపురించింది.
 
పక్షులు విలవిల
ఏడాది పొడవునా విభిన్నమైన స్వదేశీ పక్షి జాతులకు ఆవాసంగా, విదేశీ పక్షులకు విడిది కేంద్రంగా చరిత్రకెక్కిన ఈ సరస్సు నేడు విహంగాల సందడి లేక మూగబోతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 200 ఎకరాల్లో నెలకొల్పిన పక్షుల విడిది కేంద్రం ప్రస్తుతం చుక్కనీరు కూడా లేక బీడువారిపోయింది. పక్షులకు నీడనిచ్చే పచ్చని చెట్లు, గుడ్లు పొదిగేందుకు అనువుగా ఉండే కిక్కిస సైతం ఎండిపోయాయి. దీంతో తలదాచుకునేందుకు నీడ దొరక్క పక్షులు వలసపోతున్నాయి. అక్కడే ఉండిపోతున్న పక్షులు నీటికోసం అల్లాడుతూ మృత్యువాత పడుతున్నాయి.
 
 పశువుల పరిస్థితి దయనీయం
చేపల వేట, పశుపోషణపై ఆధారపడిన దాదాపు రెండు లక్షల కుటుంబాల జీవితాలు కొల్లేరుతో ముడిపడి ఉన్నాయి. వేలాది గేదెలు, ఆవులు, గొర్రెలు వేసవిలో కొల్లేరులోని పచ్చటి గడ్డితో ఆకలి తీర్చుకునేవి. ఎండాకాలంలో పొరుగు జిల్లాల నుంచి సైతం పశువుల మందలను ఇక్కడకు తీసుకొచ్చి మేపేవారు. కానీ, ఇప్పుడు పచ్చిగడ్డి కాదు కదా కనీసం ఎండుగడ్డి కూడా దొరకని దుర్భర పరిస్థితి నెలకొంది. దీంతో కోల్లేరు ప్రాంతంలో పశు పోషణ ప్రశ్నార్థకంగా మారింది.

మరిన్ని వార్తలు