ఢిల్లీలో పొగడ్తలు.. రాష్ట్రంలో విమర్శలా?

20 Aug, 2016 01:38 IST|Sakshi
ఢిల్లీలో పొగడ్తలు.. రాష్ట్రంలో విమర్శలా?

టీడీపీపై బీజేపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి ధ్వజం

సాక్షి, అమరావతి: బీజేపీతో పాటు ప్రధాని నరేంద్ర మోదీని అస్థిర పరిచేందుకు కాంగ్రెస్ పార్టీతో టీడీపీ చేతులు కలిపిందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి ఆరోపించారు. దేశంలో నీతివంతమైన పాలన నడుపుతున్న మోదీ ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి రానివ్వకుండా ఏపీలో కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో సురేష్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి రూ. 1.45 లక్షల కోట్లు ఇచ్చామని కేంద్రమంత్రులు చెప్పినప్పుడు, అమరావతి రింగ్ రోడ్డు నిర్మాణానికి అనుమతులతో పాటు  20 వేల కోట్ల నిధులు ఇచ్చామన్నప్పుడు చప్పట్లు కొట్టమని చెప్పిన సీఎం చంద్రబాబు..

స్వాతంత్య్ర దినోత్సవంతో పాటు పుష్కరాల సమయంలో కేంద్రం సహకరించటం లేదంటూ మాటమార్చడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిం చారు. ఢిల్లీలో బీజేపీని పొగుడుతూ ఇక్కడ ఎందుకు విమర్శలు చేస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్‌తో అంటకాగి ఆ పార్టీ భావజాలంతో ముందుకు రావటం బీజేపీ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకేనన్న విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు.

 బాబు పర్యటనలతో దుబారా..
పోలవరం విషయంలో కేంద్రాన్ని విమర్శిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతికి పాల్పడుతున్న ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీపై ఏం చర్య తీసుకున్నారో చెప్పాలన్నారు. కేంద్రం ఇప్పటి వరకూ రాష్ట్రానికి ఎంతో సాయం చేసిందని, వాటికి నీతి ఆయోగ్‌కు ఎందుకు లెక్కలు చెప్పటం లేదన్నారు. చంద్రబాబుతో పాటు మంత్రులు విదేశాల్లో పర్యటిం చటం వల్ల దుబారా పెరిగింది తప్ప.. పెట్టుబడులు రాలేదన్నారు. రైతు, డ్వాక్రా రుణాల మాఫీ, కాపులను బీసీల్లో చేరుస్తామని మీన మేషాలు లెక్కిస్తున్నా, నిరుద్యోగం వికటాట్టహాసం చేస్తున్నా, ఇసుకను దోచుకుంటున్నా పరిస్థితులు సరిది ద్దుకుంటాయని తాము మౌనంగా ఉంటున్నామని విషయాన్ని ఏపీ ప్రభుత్వం గుర్తుంచుకోవాలని సూచించారు. ఏపీలో పెట్టుబడులకు అనుకూలమైన పరిస్థితులు లేవని ఓ సంస్థ వెల్లడించిన నేపథ్యంలో వాటిని చక్కదిద్దుకోకుండా తమను విమర్శించటం సరికాదన్నారు.

మరిన్ని వార్తలు