హుజూరాబాద్‌ను పీవీ జిల్లాగా ఏర్పాటు చేయాలి

27 Aug, 2016 19:12 IST|Sakshi
హుజూరాబాద్‌ : హుజూరాబాద్‌ను పీవీ జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్‌ జగత్‌సింగ్‌కు శనివారం వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఈ నెల 22న వెల్లడించిన ముసాయిదా నోటిఫికేషన్‌లో హుజూరాబాద్‌ సబ్‌డివిజన్‌ ప్రాంతాన్ని హన్మకొండ, కరీంనగర్, సిద్దిపేట జిల్లాలకు కలుపుతూ ఎన్నో ఏళ్లుగా ఉన్న అనుబంధాన్ని విడగొట్టి మూడు ముక్కలుగా చేయడం జరిగిందన్నారు. ముసాయిదాలో ప్రకటించిన అనేక జిల్లాలతో పోల్చితే హుజూరాబాద్‌ కేంద్రంగా మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరిట ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేసేందుకు అన్ని అర్హతలున్నాయన్నారు. అంతే కాకుండా ఎస్‌డీపీవో, సబ్‌కోర్టు పరిధిలో భౌగోళికంగా 13 మండలాలు హుజూరాబాద్‌ పరిధిలోకి వస్తాయని, జనాభా ప్రాతిపదికన తెలంగాణలో వరంగల్‌ తర్వాత అతిపెద్ద వ్యవసాయ మార్కెట్‌ జమ్మికుంట ఉందని, రహదారి అనుసంధానం దేశంలోనే అతి ముఖ్యమైన రైల్వేలైన్‌ అనుసంధానం ఉన్నట్లు వివరించారు. కలెక్టరేట్‌కు కావాల్సిన ప్రభుత్వ భూమి సైతం అందుబాటులో ఉందన్నారు. బలవంతంగా చారిత్రక నగరాన్ని ముక్కలు చేసి హన్మకొండను జిల్లాగా ఏర్పాటు చేసే బదులు, హుజూరాబాద్, హుస్నాబాద్‌ రెవెన్యూ కేంద్రాలుగా హుజూరాబాద్‌ను పీవీ జిల్లాగా ఏర్పాటు చేస్తే అన్ని మండలాలకు అనువుగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, పట్టణ అధ్యక్షుడు జెల్ల సుధాకర్, మండలశాఖ అధ్యక్షుడు నర్ర శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు ప్రవీణ్, మోటపోతుల పద్మ, రావుల వేణు, ప్రభాకర శ్రీకాంత్, సబ్బని రమేష్, రాజు, ఉమాశంకర్, కేశవ్, నాగరాజు, నగేష్,దేశి కాశయ్య, వినయ్‌కు, శశిధర్‌ తదితరులు పాల్గొన్నారు. 

whatsapp channel

మరిన్ని వార్తలు