బ్లాక్‌ బాక్స్‌ కోసం శోధన

3 Aug, 2016 13:06 IST|Sakshi
బ్లాక్‌ బాక్స్‌ కోసం శోధన
  • విశాఖ నుంచి అండమాన్‌ వైపు వెళ్లొస్తున్న నేవీ విమానాలు
  • అంతుచిక్కని జాడ... ఇంకా కొనసాగుతున్న సెర్చింగ్‌ 
  • దిక్కుతోచని స్థితిలో ఎన్‌ఏడీ ఉద్యోగుల కుటుంబాలు
  • గోపాలపట్నం : ఎయిర్‌ఫోర్స్‌ విమానం ఏఎన్‌–32తో గల్లంతైన ఎన్‌ఏడీ ఉద్యోగుల క్షేమ సమాచారం ఇంకా తెలియడం లేదు. ఆ విమానానికి మూలాధారమైన బ్లాక్‌బాక్స్‌ ఎక్కడుందో తెలుసుకునేందుకు నేవీ, ఎయిర్‌ఫోర్సు, కోస్టుగార్డు సంస్థలు విశ్వప్రయాత్నాలు చేస్తున్నాయి. గత పది రోజులుగా అండమాన్‌ తీరం వైపు వాతావరణం మబ్బులు, భారీ వర్షంతో అనుకూలించకపోవడంతో శోధనకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. 29మంది ఎయిర్‌ఫోర్సు, నేవీ, కోస్టుగార్డు ఉద్యోగులు ఈ నెల 22న ఉదయం ఎయిర్‌ఫోర్సు విమానంతో గల్లంతైన సంగతి తెలిసిందే. నేటికి ఈ సంఘటన జరిగి పదమూడు రోజులైపోయాయి. అయినా గల్లంతైన వారి జాడ తెలియకపోవడంతో వారి కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. 
     
    ప్రతిష్టాత్మకంగా అన్వేషణ 
    విమానం గల్లంతు సంఘటనను కేంద్ర రక్షణ శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా శోధించడానికి విశ్వప్రయత్నాలూ సాగిస్తోంది. ప్రధానంగా అండమాన్‌ సంద్రంపై నుంచి వెళ్తున్న ఎయిర్‌ఫోర్సు విమానానికి ఎక్కడ సిగ్నల్‌ తప్పింది... తప్పితే ఏ దిశగా వెళ్లి ఉండొచ్చు... విమానం సంద్రంలో మునిగిపోతే ఎక్కడ పడి ఉంటుందన్న కోణాల్లో గాలిస్తున్నారు. ప్రధానంగా గల్లంతైన విమానంలో అత్యంత కీలకమైన బ్లాక్‌బాక్స్‌ను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. వాయిస్‌ రికార్డర్, పైలెట్‌ సంభాషణలు, రాడార్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థతో సంబంధాలుండడం బ్లాక్‌బాక్స్‌ ప్రత్యేకత. దీనికి దాదాపు నాలుగు వేల కిలోమీటర్ల లోతున రేడియేషన్‌ సిగ్నల్‌ ఉంటుంది. ఈ తరుణంలో విమానం సంద్రంలో గల్లంతైనా ఎక్కడుండి ఉంటుందనే దిశగా శోధిస్తున్నారు. ఇప్పటికే దేశ నలుమూలల నుంచీ పలు రకాల షిప్‌లు, సబ్‌మెరైన్లు సంద్రంలో గాలిస్తుండగా, విశాఖ ఐఎన్‌ఎస్‌ డేగా నుంచి రెండు హెలికాఫ్టర్లు, మరో విమానం గాలింపునకు వెళ్లొస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా విమానాలు, సబ్‌మెరైన్ల ద్వారా సోనోబోయ్‌ అనే పరికరాన్ని నీటిలో వదలడం ద్వారా కూడా బ్లాక్‌ బాక్సుని శోధించేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ నాలుగు వేల కిలోమీటర్ల వరకూ అందుకునే వీలుండడం, బ్లాక్‌బాక్స్‌కి బ్యాటరీ శక్తి నెల రోజుల వరకూ ఉండడం వంటి పరిణామాలపై ఆశతో త్వరగా ఛేదించాలని నేవీ, కోస్టుగార్డు, ఎయిర్‌ఫోర్సు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఇస్రో పరిశోధనా సంస్థలో కీలకంగా ఉన్న నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ నిపుణులు కూడా బ్లాక్‌బాక్స్‌ కోసం జలాంతర్గాములకు  శాటిలైట్‌ సంకేతాలిస్తూ తమ వంతు సహకరిస్తున్నట్లు సమాచారం. సంద్రంలో కోటానుకోట్ల రాళ్లురప్పల మధ్య బ్లాక్‌ బాక్స్‌ని పట్టుకోవడం అంత సులువుగా జరిగే పనికాదని కొందరు భావిస్తున్నారు. 
     
    ఎన్‌ఏడీ చరిత్రలో తొలిసారి 
    ఎన్‌ఏడీ నుంచి అండమాన్‌కు షిప్‌లలో ఆయుధాల మరమ్మతులు, నిర్వహణ కోసం ఏటా సిబ్బంది నాలుగైదు సార్లు వెళ్లొస్తుంటారు. అత్యధికంగా షిప్‌లలోనే వెళ్తుంటారు. వీలు దొరికినపుడు విమానాల్లో వెళ్తుండడం అరుదుగా జరిగింది. అయితే గతంలో ఎప్పుడూ ఏ రకమైన ప్రమాదమూ జరగలేదు. ఈ సారి విమానం గల్లంతవడంతో వారి కుటుంబీకుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రస్తుతం అధికారులూ స్పందించక... అయిన వారి జాడ తెలియక క్షనమొక యుగంలా గడుపుతున్నారు. 
>
మరిన్ని వార్తలు