మిల్లర్లకు బ్లాక్‌ స్పాట్‌

15 Sep, 2016 00:31 IST|Sakshi
మిల్లర్లకు బ్లాక్‌ స్పాట్‌
-ఎఫ్‌సీఐకి తరలిస్తున్న బియ్యంపై నల్లచుక్కలు
-40 వేల టన్నులు తిరస్కరణ 
-ఘొల్లుమంటున్న రైస్‌ మిల్లర్లు
తాడేపల్లిగూడెం : రైస్‌ మిల్లర్లకు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ‘బ్లాక్‌ స్పాట్‌’ పేరిట కొర్రీ వేస్తోంది. బియ్యం గింజల మధ్యలో నల్లటి మచ్చ ల్లాంటివి ఉన్నాయంటూ గడచిన 20 రోజుల్లో సుమారు 40 వేల టన్నుల బియ్యాన్ని వెనక్కి పంపించింది. ఈ పరిస్థితితో మిల్లర్లు ఘొల్లుమంటున్నారు. వివరాల్లోకి వెళితే.. రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్‌ మిల్లర్లకు ఇచ్చి కస్టమ్‌ మిల్లింగ్‌ పేరిట బియ్యం ఆడించింది. ధాన్యాన్ని మరాడించినందుకు క్వింటాల్‌కు రూ.15 చొప్పున మిల్లర్లకు ప్రభుత్వం చెల్లిస్తోంది. ధాన్యాన్ని ఆడగా వచ్చే ఊక, చిట్టు, తవుడు తదితరాలను మిల్లర్లకే ఇస్తోంది. క్వింటాల్‌ ధాన్యానికి బదులుగా 67 కిలోల చొప్పున బియ్యాన్ని మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. ఆ బియ్యాన్ని నేరుగా ఎఫ్‌సీఐకి అప్పగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఆ బియ్యాన్ని జిల్లాలోని మిల్లర్లంతా ఎఫ్‌సీఐ డిపోలకు తరలించడం మొదలుపెట్టారు.
టిప్‌ డ్యామేజీ ఉందంటూ..
మిల్లర్లు తీసుకొచ్చిన బియ్యాన్ని దిగుమతి చేసుకునే ముందు వాటి నాణ్యతను ఎఫ్‌సీఐ క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు తనిఖీ 
చేస్తుంటారు. అయితే, ఇటీవల మిల్లర్లు తీసుకొస్తున్న బియ్యంపై నల్లటి మచ్చలు (టిప్‌ డ్యామేజీ) ఉందని క్వాలిటీ కంట్రోల్‌ గుర్తించింది. అలాంటి బియ్యాన్ని దిగుమతి చేసుకునేది లేదంటూ 
ఎఫ్‌సీఐ అధికారులు వెనక్కి పంపిస్తున్నారు. గడచిన 20 రోజుల్లో సుమారు 60 వేల టన్నుల బియ్యాన్ని జిల్లాలోని మిల్లర్లు ఎఫ్‌సీఐ డిపోలకు తరలించగా, టిప్‌ డ్యామేజీ పేరిట అందులో సుమారు 40 వేల టన్నుల బియ్యాన్ని అధికారులు తిరస్కరించారు. దీంతో ఏం చేయాలో తెలియక రైస్‌మిల్లర్లు బేలచూపులు చూస్తున్నారు.
1.85 లక్షల టన్నుల బియ్యం ఇవ్వాలి 
ఐకేపీ కేంద్రాలు, సహకార సంఘాల ద్వారా జిల్లావ్యాప్తంగా 10,65,436 టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. ఈ ధాన్యాన్ని మరాడించి 6,63,842 టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐకి మిల్లర్లు ఇవ్వాల్సి ఉంది. ఇందులో 50 వేల టన్నులను రేషన్‌ బియ్యం నిమిత్తం ఇప్పటికే పౌర సరఫరాల శాఖకు ఇచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఎఫ్‌సీఐకి బియ్యం తరలింపు ప్రారంభమైంది. ఈనెల 12వ తేదీ వరకు 4,79,137 టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐ డిపోలకు చేరవేశారు. ఇంకా 1,84,709 టన్నుల బియ్యాన్ని జిల్లాలోని మిల్లర్లు ఇవ్వాల్సి ఉంది. గత నెల వరకూ రోజుకు 3 వేల నుంచి 4 వేల టన్నుల బియ్యాన్ని మిల్లర్లు ఎఫ్‌సీఐకి చేరవేసేవారు. గడచిన 20 రోజులుగా రోజుకు కనీసం వెయ్యి టన్నులు కూడా ఎఫ్‌సీఐ స్వీకరించడం లేదు. టిప్‌ డ్యామేజీ పేరిట బియ్యాన్ని తిప్పిపంపుతున్నారని మిల్లర్లు చెబుతున్నారు. 
నాణ్యత గుర్తించేదిలా
ఎఫ్‌సీఐకి తరలించే బియ్యంలో ఒక బస్తా నుంచి 10 గ్రాముల్ని క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు బయటకు తీస్తారు. రంగు, పాలిష్, నూకల శాతం ఎలా ఉన్నాయనేది పరిశీలిస్తారు. 10 గ్రాముల్లో 0.03 గ్రాములకు మించి దెబ్బతిన్న (డ్యామేజీ) బియ్యం ఉండకూడదు. అందులో నూకల శాతం 25 వరకు ఉండవచ్చు. అంతకుమించితే చెల్లించే సొమ్ములో కోత విధించడం లేదా వెనక్కి పంపించడం చేస్తారు. ప్రస్తుతం ఇలాంటి కారణాలేమీ లేకపోయినా బియ్యంపై నల్లమచ్చలు ఉన్నాయంటూ బియ్యాన్ని వెనక్కి పంపిస్తున్నారు. 20 ఏళ్ల కాలంలో ఎప్పుడూ ఇలాంటి సమస్య రాలేదని మిల్లర్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సిన 1.85 లక్షల టన్నుల బియ్యాన్ని తీసుకుంటారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లారీ బియ్యాన్ని వెనక్కి తీసుకు రావాలంటే రూ.10 వేల వరకు ఖర్చవుతోందని మిల్లర్లు పేర్కొంటున్నారు. ఈ నష్టాన్ని ఎలా భరించాలని ప్రశ్నిస్తున్నారు. 
 
మరిన్ని వార్తలు