సినిమా చూపిస్త మామ...!

15 Jun, 2016 08:34 IST|Sakshi
సినిమా చూపిస్త మామ...!
  • ఒంగోలులోని సినిమా థియేటర్ల వద్ద జోరుగా బ్లాక్ టికెట్ల విక్రయం
  • సినిమాను బట్టి రూ.50 నుంచి రూ.100 వరకు అదనపు బాదుడు
  • హాలు నిండకపోయినా హౌస్‌ఫుల్ బోర్డులు
  • థియేటర్ ఆవరణలోనే బహిరంగ విక్రయాలు
  • ఏసీలు, మరుగుదొడ్లు, అధ్వానం
  • మామూళ్ల మత్తులో పోలీస్, రెవెన్యూ అధికారులు
  •  
     సాక్షి ప్రతినిధి, ఒంగోలు : జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలో సినిమా థియేటర్ల వద్ద టికెట్లను మొత్తంగా బ్లాక్‌లో విక్రయిస్తూ ప్రేక్షకులను నిలువు దోపిడీ చేస్తున్నారు. కొత్త సినిమా వచ్చిందంటే చాలు.. ఒక్క టికెట్ కూడా కౌంటర్లో దొరకదు. కానీ, అక్కడే బహిరంగంగా బ్లాక్‌లో విక్రయిస్తుంటారు. ఒక్కో టికెట్‌ను రూ.200కు తగ్గకుండా అమ్ముతుంటారు. సినిమా బాగుందని టాక్ వస్తే చాలు.. ఇక ఆ సినిమా ఆడినన్నాళ్లు రూ.70 నుంచి రూ.120 వరకు ధర ఉన్న టికెట్లను రూ.200కు, రూ.50 ధర ఉన్న టికెట్లను రూ.100కు విక్రయిస్తున్నారు. ప్రేక్షకులు సినిమా థియేటర్‌కు వచ్చే సమయానికి హౌస్‌ఫుల్ బోర్డు పెట్టి కౌంటర్లలో ఒక్క టికెట్ కూడా ఇవ్వకుండా అన్ని టికెట్లనూ హాలు బయటే బహిరంగంగా బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. అంతేగాకుండా సీట్ల నంబర్‌తో పనిలేకుండా అధికంగా టికెట్లు విక్రయిస్తుండటంతో టికెట్ కొనుక్కుని తీరా థియేటర్‌లోకి వెళ్లిన ప్రేక్షకులు సీట్ల కోసం తరచూ గొడవలు పడుతున్నారు. దీంతో సినిమా చూడాలనుకునే సామాన్య, మధ్యతరగతి వారు బ్లాక్‌లో టికెట్లు కొనలేక, సీట్ల కోసం గొడవలు పడలేక థియేటర్లకు రావడమే మానేస్తున్నారు.
     ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం...
     ప్రతి థియేటర్‌కు బి-ఫారం లెసైన్సులు తప్పనిసరిగా ఉండాలి. గతంలో ప్రతి ఏడాదీ దీనిని రెన్యువల్ చేసుకోవాల్సి ఉన్నా.. ఇటీవల రెన్యువల్ సమయాన్ని 5 సంవత్సరాలకు పెంచారు. బి.ఫారం లెసైన్సులను జాయింట్ కలెక్టర్ ఇస్తుండగా, రెన్యువల్ చేయించే అధికారం ఆర్‌డీఓకు ఉంది. అంతకు ముందే ఫైర్ సర్టిఫికెట్, ఆర్‌అండ్‌బీ, ఎలక్ట్రిసిటీ, మున్సిపాలిటీలు ఎటువంటి అభ్యంతరాలు పెట్టకూడదు. ఇక క్యాంటీన్‌కు సంబంధించి శానిటేషన్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ సర్టిఫై చేయాలి. కానీ, వీరిలో చాలా మంది అధికారులు థియేటర్ల దగ్గర మామూళ్లు వసూలు చేసి అంతా బాగున్నట్లుగా సర్టిఫై చేస్తున్నారు. ఇటీవల ఒంగోలుకు సంబంధించిన చాలా మంది సినిమా అభిమానులు బ్లాక్ టికెట్ల అమ్మకాలపై జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయినా బ్లాక్ టికెట్ల అమ్మకాలపై చర్యలు తీసుకున్న పాపానపోలేదు. ఫిర్యాదు ఇచ్చినప్పుడు రెవెన్యూ, పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు పంపిస్తున్నారు. వారు మామూళ్లు తీసుకుని మమ అనిపిస్తున్నారు. అడపాదడపా ఉన్నతాధికారులకు కూడా భారీగానే ముడుపులు అందుతున్నట్లు ఆరోపణలు ఉన్నారుు.
     
     
     క్యాంటీన్‌లో అధిక ధరలు...
     
     ఇక థియేటర్లలోని క్యాంటీన్లలోనూ తినుబండారాలు, కూల్‌డ్రింక్స్‌కు అధిక రేట్లు వసులు చేస్తున్నారు. కూల్‌డ్రింక్స్, పాప్‌కార్న్, చిప్స్ ప్యాకెట్లు, తదితర తినుబండారాలకు రూ.5 నుంచి రూ.10 వరకూ అధికంగా వసూలు చేస్తున్నారు. దీనికితోడు పేరుకు ఏసీ థియేటర్లు అని చెబుతున్నప్పటికీ సినిమా ప్రారంభమవగానే ఏసీలు ఆవేస్తున్నారు. థియేటర్లు కూడా ఏమాత్రం పరిశుభ్రంగా ఉండటం లేదు. అసలే తక్కువ సంఖ్యలో ఉండే మరుగుదొడ్లకు తోడు పరిశుభ్రత లోపించి కంపు కొడుతుండటంతో ప్రేక్షకులు ముక్కు మూసుకోక తప్పడం లేదు. కానీ, సంబంధిత రెవెన్యూ, పోలీసు అధికారులు మాత్రం పట్టించుకోకుండా మామూళ్ల మత్తులో జోగుతున్నారు.
     
     
     నిబంధనలకు పాతర...
     సినిమాటోగ్రఫీ యాక్టు జీవో నంబర్ 100 ప్రకారం టికెట్ ధరలు ఏసీ ఫస్ట్ క్లాస్ రూ.75, నాన్ ఏసీ ఫస్ట్ క్లాస్ రూ.70, లోయర్ క్లాస్ రూ.10 ఉండాలి. ఒంగోలు మల్టీప్లెక్స్‌లో ఫస్ట్ క్లాస్ ఏసీ రూ.120, సెకండ్ క్లాస్ రూ.80 వంతున విక్రయించాలి. అద్దంకిలో ఫస్ట్ క్లాస్ రూ.70 ఉండగా, రూరల్ ఏరియాల్లో ఏసీ ఫస్ట్ క్లాస్ రూ.45, నాన్ ఏసీ రూ.40, లోయర్ క్లాస్ రూ.10 చొప్పున విక్రయించాలి. కానీ, అందుకు మూడు రేట్లు ఎక్కువగా టికెట్లను బ్లాకులో అమ్ముతున్నారు. బ్లాక్ టికెట్లు అమ్మితే కేసులు పెడతామని అధికారులు పేరుకు హెచ్చరిస్తు న్నా.. ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదు.
     

మరిన్ని వార్తలు