జనతా గ్యారేజ్.. కాంబో ప్యాకేజ్ !

1 Sep, 2016 09:32 IST|Sakshi
జనతా గ్యారేజ్.. కాంబో ప్యాకేజ్ !

థియేటర్ల వద్ద బ్లాక్‌లో టికెట్ విక్రయాలు
విజయవాడలో మల్టీప్లెక్స్‌ల  మాయాజాలం
ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నా  అ‘ధనం’ తప్పనిసరి
స్నాక్స్ పేరిట అడ్డగోలు దోపిడీ
 
విజయవాడ : జూనియర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమా టికెట్లు బ్లాకులో హల్‌చల్ చేస్తున్నాయి. గురువారం విడుదల కానున్న ఈ చిత్రం టికెట్లకు బ్లాక్‌లో డిమాండ్ పెరిగింది. విజయవాడలో ఒక్కో టికెట్ ధర రూ. రెండున్నర వేలు పలుకుతోంది. జిల్లాలో గురువారం ఒక్క రోజే వంద థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మరుసటి రోజు నుంచి 25 థియేటర్లలో ఆడించేందుకు డిస్ట్రిబ్యూటర్లు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. విజయవాడలో మల్టీప్లెక్స్ థియేటర్లలో బుధవారం నుంచే ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకాలు ప్రారంభించారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్, అభిమానులు, పార్టీ నాయకులు ఇలా ఆన్‌లైన్‌లో ముందస్తు అమ్మకాలు సాగించారు.
 
అడ్వాన్స్ బుకింగ్‌లోనూ అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డారు. నగరంలో మల్టీప్లెక్స్ థియేటర్లలో  కాంబో ప్యాక్ పేరుతో అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. అధిక ధరనిర్ణయించి దోపిడీ చేస్తున్నారు. కాంబో ప్యాక్ పేరుతో రకరకాల తినుబండారాలు అంటగట్టేవిధంగా ప్యాకేజీ నిర్ణయించి అధిక ధరలు గుంజారు.

అన్‌లైన్‌లో బుక్ చేసుకున్న టికెట్లకూ అదనంగా మరో రూ. 130 వసూలు చేశారు. కాంబో ప్యాక్ ధర చెల్లిస్తేనే ఆన్‌లైన్ టికెట్లు ఇస్తామని బుకింగ్‌లలో సిబ్బంది తెగేసి చెప్పేశారు. కొత్త సినిమా చూడాలన్న తాపత్రయంతో ఉన్న ప్రేక్షకులు అధిక ధర చెల్లించి టికెట్లు కొనుగోలు చేశారు. ఇక సాధారణ థియేటర్ల వద్ద కూడా బ్లాకులో విక్రయాలు సాగించారు.
 
 థియేటర్ల వద్ద కోలాహలం .. : జనతా గ్యారేజీ చిత్రం విడుదల సందర్భంగా విజయవాడ నగరంతోపాటు, జిల్లాలోని పలు థియేటర్ల వద్ద బుధవారం నుంచే సందడి నెలకొంది. పెనమలూరు, గన్నవరం, గుడివాడ, మచిలీపట్నం, నూజివీడు, ప్రాంతాలలోని థియేటర్ల వద్ద టికెట్ల అమ్మకాల కోలాహలం కనిపించింది.

కొన్ని థియేటర్ల వద్ద ఆన్‌లైన్‌లో అమ్మకాలు జరుగుతుండగా, మరికొన్ని థియేటర్లలో బుకింగ్‌ల ద్వారా టికెట్లు విక్రయాలు జరుగుతున్నాయి. అభిమాన సంఘాల పేరుతో పార్టీ నాయకులు టికెట్లు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా సినిమా విడుదలను పురస్కరించుకుని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పలు ప్రాంతాలలో సేవా కార్యక్రమాలు చేపట్టారు.

>
మరిన్ని వార్తలు