పేలుళ్ల కలకలం!

27 Sep, 2016 23:01 IST|Sakshi
పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో శిథిల క్వార్టర్స్‌లో జరిగిన పేలుళ్ల ప్రదేశం
కొత్తూరు : కొత్తూరు పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో మంగళవారం మధ్యాహ్నం పేలుళ్ల కలకలం రేగింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్టేషన్‌ ఆవరణలో ఒక్కసారిగా భారీ శబ్దాలు రావడంతో పరిసర ప్రజలతో పాటు విధుల్లో ఉన్న పోలీసులు పరుగులు తీశారు. దీంతో ఏం జరిగిందో ఎవరికీ తెలియని పరిస్థితుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పేలుళ్లతో దట్టమైన పొగలు కమ్మేయడం ఏం జరిగిందో తెలియక అందరూ భయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే...పోలీస్‌స్టేషన్‌కు ఆనుకొని ఉన్న పోలీసు క్వార్టర్స్‌లో పలు కేసులకు సంబంధించిన బాణాసంచా నిల్వలు పోలీసులు దాచిపెట్టారు. నిల్వలు బయటకు తీయకుండా ఇటీవల క్వార్టర్స్‌ భవనాలను తొలగించారు. వర్షాలు కురుస్తున్న సమయంలో గోడ శిథిలాలు చెదరడంతో బాణాసంచా ఒక్కసారి పేలినట్టు ఎస్‌ఐ విజయకుమార్‌ చెప్పారు.
 
స్టేషన్‌ నాలుగు రోడ్ల కూడలి వద్ద ఉన్నందున భారీ శబ్దం రావడంతో ప్రజలు ఒక్కసారి ఆందోళనకు గురయ్యారు. స్టేషన్‌ పరిసరాల్లో ఏం జరిగిందో తెలియక పరుగులు తీసిన స్థానికులు తరువాత ఏం జరిగిందో తెలుసుకునేందుకు వందలాదిగా చేరుకున్నారు. ఇదిలా ఉండగా పేలిన శబ్దం బాణాసంచా కంటే ఎక్కువ వచ్చినట్టు స్థానికులు తెలిపారు. జేసీబీతో శిథిల పోలీసు క్వార్టర్స్‌ను తొలగించినపుడు పేలని సామగ్రి వర్షాలు కురుస్తున్న సమయంలో పేలడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఏదిఏమైనా పేలుళ్ల వల్ల ఎటువంటి నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 
 
మరిన్ని వార్తలు