బ్లాక్‌ స్పాట్ల వద్ద ప్రమాద సంకేతాలు

19 Jul, 2017 00:29 IST|Sakshi
  • రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో కలెక్టర్‌ మిశ్రా
  • కాకినాడ సిటీ :
    జిల్లాలోని జాతీయరహదారులు, ఇతర రహదారులలో ప్రమాదాలు సంభవించే అవకాశమున్న బ్లాక్‌ స్పాట్స్‌లో ప్రమాద సంకేతాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. కలెక్టరేట్‌ కోర్టు హాలులో మంగళవారం నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ  వీటి వద్ద వేగ నియంత్రణ ఉండేలా కూడా సంకేతాలు ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనచోదకులకు అర్ధమయ్యే రీతిలో ప్రమాద సంకేతాలను తెలుగులో కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ పనులు వచ్చే 20 రోజుల్లో పూర్తి చేయాలని నేషనల్‌ హైవేస్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ను ఆదేశించారు. మద్యం మత్తులో డ్రైవింగ్‌ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని ఎన్‌హెచ్‌–16, 216 రహదారిలో వాహనాలను నిలిపివేయడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని, వాహనాల పార్కింగ్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు అవసరమైన భూముల కోసం భూ సేకరణకు ప్రతిపాదనలు పంపాలని ఎన్‌హెచ్‌ అధికారులకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే క్వారీ లారీలపై కేసులు నమోదు చేసి వాటిని స్వాధీన పర్చుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. జిల్లా ఎస్పీ విశాల్‌ గున్నీ మాట్లాడుతూ రోడ్డు నిర్మాణ సమయంలో కాంట్రాక్టర్లతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం లైటింగ్, ఇతర రోడ్డు భద్రత చర్యలు కూడా చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో రాజమహేంద్రవరం అడిషనల్‌ ఎస్పీ రెడ్డి గంగాధర్‌రావు, ఇన్‌చార్జి డీటీసీ అశోక్‌కుమార్‌ ప్రసాద్, ఎన్‌హెచ్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ వెంకటరత్నం, కాకినాడ ట్రాఫిక్‌ డీఎస్పీ కె.సత్యనారాయణ, మున్సిపల్‌ కమిషనర్లు, ఆర్‌అండ్‌బీ డీఈలు, పోలీస్, ఎన్‌హెచ్, ఎక్సైజ్‌ శాఖల అధికారులు పాల్గొన్నారు.  
     
మరిన్ని వార్తలు