రక్త కన్నీరు..!

22 Jan, 2017 00:10 IST|Sakshi
రక్త కన్నీరు..!
పెద్దాస్పత్రిలో కిడ్నీ రోగుల వెతలు
- ఏ పనీ చేయలేకపోతున్న బాధితులు 
- అత్తెసరు సౌకర్యాలతో దినదిన గండం
- శాశ్వత పరిష్కారానికి డిమాండ్‌
- కలెక్టరేట్‌ ఎదుట బాధితుల ఆందోళన
 
కర్నూలు(హాస్పిటల్‌): ఒకటి కాదు.. రెండు కాదు.. వారానికి మూడు సార్లు డయాలసిస్‌(రక్తశుద్ధి) చేయించుకోవాలి. ఇలా నెలకు 12 సార్లు, సంవత్సరానికి 144 సార్లు.. ప్రతిసారీ రక్తం తగ్గిపోవడమో, ఐరన్‌లోపం ఏర్పడమో జరుగుతుంది. దీనివల్ల వారికి ఏ పనీ చేతకాదు. జీవితం మంచానికే పరిమితం. కర్నూలు పెద్దాసుపత్రికి వచ్చి డయాలసిస్‌ చేయించుకోవాలంటే నరకయాతన అనుభవిస్తున్నారు. ఉద్దానం, సింగోటం, మార్కాపురం, కనిగిరి ప్రాంతాలే కాదు.. కర్నూలు జిల్లాలోని కిడ్నీ బాధితులనూ ప్రభుత్వం ఆదుకోవాలనే డిమాండ్‌ తెరపైకి వచ్చింది. ఈ మేరకు శనివారం కలెక్టరేట్‌ వద్ద బాధితులు ఆందోళన చేపట్టారు. గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేసి జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌కు సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు.
 
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు జిల్లాలోని నలుమూలలతో పాటు పక్కనున్న అనంతపురం, వైఎస్‌ఆర్‌ కడప జిల్లా, మహబూబ్‌నగర్, రాయచూరు, బళ్లారి ప్రాంతాల నుంచి కూడా కిడ్నీ బాధితులు చికిత్స కోసం వస్తారు. వారికి ఆసుపత్రిలోని నెఫ్రాలజి విభాగం సేవలందిస్తుంది. ఆసుపత్రిలో కిడ్నీ బాధితులకు డయాలసిస్‌ చేసేందుకు బీ బ్రాన్‌ సంస్థ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తోంది. ఇందులో 20 డయాలసిస్‌ మిషన్లు ఉన్నాయి. కొత్తగా ఆసుపత్రికి 6 మిషన్లు వచ్చాయి. ప్రస్తుతం 25 మిషన్లు రోగులకు మూడు షిఫ్ట్‌లలో డయాలసిస్‌ చేస్తున్నాయి. రోజుకు ఇక్కడ 30 నుంచి 40 మందికి డయాలసిస్‌ చేస్తారు. ప్రస్తుతం స్టేజ్‌–5లో 104 మంది రిజిస్టర్‌ అయ్యారు.
 
పెద్దాసుపత్రిలో ఆరేళ్లుగా కిడ్నీ బాధితుల వివరాలు
సంవత్సరం ఓపీ ఐపీ డయాలసిస్‌ చేయించుకుంటున్న వారు
 
2011 4,095 978 13,371
2012 5,380 992 12,939
2013 8,621 1228 15,893
2014 9,821 1240 17721
2015 5,036 1,224 16,675
2016 4,472 1,403 14,858
 
 
కిడ్నీ బాధితుల డిమాండ్లు ఇవీ...!
1. డయాలసిస్‌ కోసం పెద్దాస్పత్రిక వచ్చే ప్రతిసారీ రోగితో పాటు సహాయకునికి ఉచిత బస్సు పాస్‌ ఇవ్వాలి.
2. ప్రతి రెవెన్యూ డివిజన్‌ కేంద్రంలో డయాలసిస్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలి. 
3. కిడ్నీ రోగులకు చేసే ఫిస్టులా ఆపరేషన్లు ఒకసారి ఫెయిలైనా రెండోసారి కూడా ఎన్‌టీఆర్‌ వైద్యసేవలో ఉచితంగా చేయాలి. 
4. రోగి అవసరాన్ని బట్టి ప్రతి డయాలసిస్‌కు ఒకసారి బ్లడ్‌ ఇంజెక‌్షన్, ఐరన్‌ ఇంజెక‌్షన్లు ఉచితంగా ఇవ్వాలి. 
5. డయాలసిస్‌కు వచ్చిన రోజు రోగితో పాటు సహాయకునికి ఆహారం ఉచితంగా ఇవ్వాలి. 
6. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పాత డయాలసిస్‌ మిషన్లు మార్చి కొత్తవి ఏర్పాటు చేయాలి. అక్కడ సిబ్బంది కొరత లేకుండా చూడాలి. రోగులకు మంచినీటి సౌకర్యం కల్పించాలి. ఆయాసంతో బాధపడే డయాలసిస్‌ రోగులకు ఉచితంగా నెబిలైజేషన్‌ పరికరాలు అందించాలి. 
7. ప్రభుత్వమే దాతల ద్వారా మూత్రపిండాలు సేకరించి రోగులకు ఉచితంగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఆపరేషన్లు చేయాలి.
 
ప్రయాణ ఖర్చులకే నెలకు రూ.4వేలు
–రాజానందబాబు, ఎమ్మిగనూరు
కిడ్నీ ఫెయిలై నేను నాలుగు సంవత్సరాలుగా బాధపడుతున్నా. నేనో ప్రైవేటు సంస్థలో పని చేస్తుండగా.. వ్యాధి వచ్చిన తర్వాత మానేశా. నా భార్య ప్రైవేటు పాఠశాలలో టీచర్‌ఽ. ఆమె సంపాదనతోనే కుటుంబం గడుస్తుంది. నేను, నాతో పాటు ఒకరు డయాలసిస్‌కు కర్నూలు రావాలంటే నెలకు రూ.4వేలు ప్రయాణ చార్జీలకే అవుతుంది. వైద్యసేవ కింద 10 సార్లు వస్తే ఒక్కసారే టీఏ ఇస్తున్నారు.
 
ఫిస్టులా ఆపరేషన్‌ ఉచితంగా చేయాలి
–శ్రీనివాస్, కర్నూలు
నేను గతంలో అపోలో సంస్థలో హెచ్‌ఆర్‌ మేనేజర్‌గా పనిచేసేవాన్ని. కిడ్నీ ఫెయిల్‌ కావడంతో ఉద్యోగం మానేశా. నాకు వైద్యసేవ కార్డు లేదు. సీఎంసీఓ ద్వారా డయాలసిస్‌ చేయించుకుంటున్నా. కానీ ప్రతి 10 డయాలసిస్‌లకు ఒకసారి సీఎంసీఓ లెటర్‌ను రెన్యూవల్‌ చేయించుకోవాలి. వైద్యసేవ కింద కిడ్నీ రోగులకు ఒకసారి ఫిస్టులా ఆపరేషన్‌ ఫెయిలైతే రెండోసారి ఉచితంగా చేయరు. దీనికి మళ్లీ రోగికి రూ.40వేలు ఖర్చు అవుతుంది. అలా కాకుండా ప్రభుత్వమే ఉచితంగా చేయాలి.
 
ఏ పనీ చేయలేకపోతున్నా...!
–జి.నరేష్, పోదొడ్డి, ప్యాపిలి మండలం
మాది వ్యవసాయ కుటుంబం. నాకు 21 ఏళ్లు. రెండేళ్ల నుంచి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నా. చిన్న వయస్సులోనే రావడంతో ఏ పనీ చేయలేకపోతున్నా. ఆసుపత్రిలో ఎరిట్‌ప్రొటీన్‌(బ్లడ్‌ ఇంజెక్షన్‌), ఐరన్‌ ఇంజక‌్షన్లు రోగి అవసరం మేరకు ప్రతిసారీ ఇవ్వాలి. వైద్య పరీక్షలన్నీ ఉచితంగా చేయాలి. ఏ పనీ చేయకపోతున్న మాకు నెలకు రూ.5వేల భృతి ఇవ్వాలి.
 
ఉచిత బస్‌పాస్‌ ఇవ్వాలి
–ప్రకాశం, సి.బెళగల్‌
మాది సి.బెళగల్‌ మండం కొండాపురం. నాకు ఒక ఎకరం పొలం ఉంది. వ్యవసాయంతో పాటు కూలీ పనిచేసుకునేవాన్ని. సంవత్సరం కిందట కిడ్నీ ఫెయిలైంది. అప్పటి నుంచి వారంలో మూడు రోజులు పెద్దాసుపత్రికి వచ్చి డయాలసిస్‌ చేయించుకోవాలి. వచ్చిన ప్రతిసారీ ప్రయాణ ఖర్చులు రూ.200 అవుతోంది. ప్రభుత్వం ఉచిత బస్సు పాస్‌ను కిడ్నీ బాధితులకు ఇస్తే కొంత సాంత్వన కలుగుతుంది.
మరిన్ని వార్తలు