జంతు సంరక్షణే బ్లూక్రాస్ లక్ష్యం

5 Mar, 2016 02:16 IST|Sakshi
జంతు సంరక్షణే బ్లూక్రాస్ లక్ష్యం

సొసైటీ వ్యవస్థాపకురాలు అక్కినేని అమల
కేజీరెడ్డి కళాశాలలో డాగ్స్ షెల్టర్ ప్రారంభం

 మొయినాబాద్: పశుపక్ష్యాదుల విషయంలో ప్రతిఒక్కరూ మాన వతా దృక్పథంతో వ్యవహరించాలని బ్లూక్రాస్ సొసైటీ వ్యవస్థాపకురాలు అక్కినేని అమల అన్నారు. చిలుకూరు రెవెన్యూ పరిధిలోని కేజీరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బ్లూక్రాస్, కళాశాల యాజమాన్యం సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాగ్స్ షెల్టర్‌ను శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా శునకాలను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. జంతు సంరక్షణే ధ్యేయంగా బ్లూక్రాస్ సొసైటీని స్థాపించామన్నారు.

రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన కుక్కలకు వైద్యం అందించాలని కోరారు. చాలా మంది ఇతర ప్రాంతాల నుంచి శునకాలను కొనుగోలు చేస్తారని.. అలా కాకుండా వీధి కుక్కలను దత్తత తీసుకుని పెంచితే అవి విశ్వాసంతోపాటు రక్షణగా ఉంటాయన్నారు. సృష్టిలోని జీవులన్నింటికీ బతికే హక్కుందన్నారు. కేజీ రెడ్డి కళాశాలలో డాగ్స్ షెల్టర్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సొసైటీ సభ్యులు ప్రవళిక, శృతి, జబీఖాన్, కళాశాల డెరైక్టర్ మధుసూదన్‌నాయర్, ప్రిన్సిపల్ కేవీ నర్సింహ్మరావు, అరిస్టాటిల్ పీజీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్‌రెడ్డి, ఏఓ రవికిరణ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు