గురుకుల విద్యార్థి అదృశ్యం

3 Jan, 2017 02:29 IST|Sakshi
గురుకుల విద్యార్థి అదృశ్యం

బోనకల్‌: మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఇంటర్‌ విద్యార్థి అదృశ్యమయ్యాడు.  ఆ విద్యార్థి తాను చనిపోతానంటూ లేఖ రాసి తోటి విద్యార్థులకు ఇచ్చివెళ్లడంతో కలకలం రేగింది. తల్లిదండ్రులు, తోటి విద్యార్థుల కథనం మేరకు.. ఏన్కూరు మండలం తూతూకలింగన్నపేట గ్రామానికి  చెందిన కేతినేని రామారావు కుమారుడు రవి కుమార్‌ మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాలలో 5వ తరగతినుంచి విద్యనభ్యసిస్తున్నాడు. ఈ ఏడాది ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ఎంపీసీ చదువుతున్నాడు.  జనవరి 1న మధ్యాహ్నం 3గంటల సమయంలో తోటి విద్యార్థులకు లేఖ ఇచ్చి కళాశాల నుంచి వెళ్లిపోయాడు. వెంటనే విద్యార్థులు ఆ లేఖను ప్రిన్సిపాల్‌ అంజలికి అందజేశారు. అదే రోజు సాయంత్రం 5 గం టలకు విద్యార్థి తల్లిదండ్రులకు ప్రిన్సిపాల్‌ సమాచారం ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు సోమవారం కళాశాల వద్దకు చేరుకున్నారు. తోటి విద్యార్థులను ఆరా తీసినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యార్థి లేఖపై తల్లిదండ్రులు ప్రశ్నించగా ప్రిన్సిపాల్‌ లెటర్‌ ఏమీ లేదని బుకాయించారు. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఏఎస్‌ఐ నారాయణరావు కళాశాలకు చేరుకుని విద్యార్థి అదృశ్యంపై విచారణ చేపట్టారు. ప్రిన్సిపాల్‌ను అడిగి వివరాలు సేకరించారు. అప్పటివరకు బుకాయించిన ప్రిన్సిపాల్‌ ఏఎస్‌ఐకి విద్యార్థి రాసిన లేఖ ఇచ్చారు. దీంతో తల్లిదండ్రులు ఆమెను నిలదీశారు. తాను చనిపోతానంటూ రవికుమార్‌ లేఖలో పేర్కొనడంతో చదివిన  తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తమ కుమారునికి ఏమైనా జరిగితే కళాశాల సిబ్బందే పూర్తిబాధ్యత వహించాలన్నారు.

అధ్యాపకుల వేధింపులు భరించలేక..
తనకు ఆరోగ్యం సరిగాలేదని, కళాశాలలో చదవడం ఇష్టంలేదని,  కొంతమంది గెస్ట్‌ అధ్యాపకులు తనను వేధిస్తున్నారని, ముఖ్యంగా సాంబ య్య అనే అధ్యాపకుడు వేధిపులు భరించలేకపోతున్నానని రవి కుమార్‌ రాసినæనోట్‌లో పేర్కొన్నాడు. ఇటీవల కళాశాలకు వచ్చిన ఉన్నతాధికారులకు కళాశాలలో భోజనం సక్రమంగాలేదని, తాను ఫిర్యాదుచేశానని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తనను సూటిపోటిమాటలతో వేధిస్తున్నారని రాశాడు. విద్యార్థితండ్రి రామారావు ఫిర్యాదుమేరకు ఏఎస్‌ఐ నారాయణరావు కేసు నమోదుచే శారు. విద్యార్థి అదృశ్యంపై కలెక్టర్‌ ఆదేశాలతో జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి రుషికేష్‌రెడ్డి సోమవారం కళాశాలకు వచ్చి విచారణ చేపట్టారు.  ప్రిన్సిపాల్‌ అంజలిని వివరాలడిగి తెలుసుకున్నారు. ఆమెనుంచి సరైన సమాధానాలు రాకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యార్థులపట్ల ఇంత నిర్లక్ష్యమైతే ఎలాఅని ప్రశ్నించారు. పూర్తిస్థాయి నివేదికను కలెక్టర్‌కు అందజేస్తానని తెలి పారు.  ప్రిన్సిపాల్‌ అంజలి, గెస్ట్‌ టీచర్లు కూడా రోజూ అప్‌ అండ్‌ డౌన్‌ చేస్తూ విధులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల బాగోగులను పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడంపై కళాశాల ఎస్‌ఎంసీ చైర్మన్‌ జిల్లా అధికారికి ఫిర్యాదుచేశారు. గతంలో ఒక విద్యార్థి కళాశాలనుంచి బయటకువచ్చి సమీపంలో ఉన్న రైల్వేస్టేషన్‌లో ఆగి ఉన్న రైలుఎక్కి విద్యుత్‌షాక్‌కు గురై మృతిచెందాడు. కళాశాల అధ్యాపకులతీరుపై మండలవాసులు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా