బోగస్‌ బీమా

23 Jul, 2016 22:29 IST|Sakshi
వెలుగులోకి వచ్చిన నకిలీ వాహన ఇన్సూ్యరెన్స్‌ కుంభకోణం 
పోలీసు అదుపులో ప్రధాన సూత్రధారి 
ఆర్టీవో కార్యాలయం కేంద్రంగా కార్యకలాపాలు  
 
నరసరావుపేట టౌన్‌ : పేటలో నకిలీల మకిలీ రోజురోజుకు పెరిగిపోతోంది. నేరాలను అదుపుచేసేందుకు ఎన్నో సాంకేతిక మార్గాలు అన్వేషిస్తున్నా నరసరావుపేట వ్యాపారులు వాటిని అధిగమించి తమ నకిలీ వ్యాపారాలు .. కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తూనే ఉన్నారు. నిన్నా మొన్నటి వరకు నూనె, పాలు, ఎరువులు, పురుగుమందుల్లో నకిలీలు హల్‌చల్‌ చేసిన వైనం విధితమే. ఇటీవల చోటుచేసుకొన్న మూడు కోట్ల వే బిల్లులు.. రూ.30 లక్షల మనియార్డర్ల కుంభకోణం మరువక ముందే తాజాగా నకిలీ బీమా పత్రాల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. వివరాల్లో కెళితే వాహన బీమాకు సంబంధించి ఓ వ్యక్తి సాంకేతిక పరంగా ఉన్న వెసులుబాటును ఉపయోగించుకొని నకిలీ ఇన్సూరెన్స్‌ పత్రాలను సష్టించి అనేక మందికి విక్రయించాడు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీవో) కార్యాలయాన్ని కేంద్రంగా చేసుకొని గత కొన్నేళ్ళుగా తన కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగించాడు. ఆర్టీవో కార్యాలయం వద్ద ఉండే ఏజెంట్ల వద్ద వాహనాలకు సంబంధించి ఇన్సూరెన్స్‌ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకొని నకిలీ బీమా పత్రాలను వారికి అందిస్తున్నాడు. వేలల్లో నకిలీ బీమా పత్రాలు వాహనదారులకు ఇప్పటికే చేరాయి. యజమానులు తమ వాహనాలకు బీమా కట్టామని మురిసిపోయారేకానీ ఏ మేరకు మోసపోయరన్నది గ్రహించలేకపోవడంతో ఈ తంతు కొనసాగింది. 
 
 బయట పడింది ఇలా..
నరసరావుపేట ఆర్టీవో కార్యాలయ ఏజెంట్‌ వద్ద విజయవాడకు చెందిన ఓ వ్యక్తి వాహనానికి సంబంధించి బీమా చేశాడు. ఇటీవల అధికారుల దాడుల్లో నకిలీ బీమాపత్రంగా దాన్ని గుర్తించారు. దీంతో కంగుతిన్న వాహన యజమాని విషయాన్ని ఏజెంట్‌కు తెలిపాడు. దీంతో ఏజెంట్‌ ఇచ్చిన సమాచారంతో నరసరావుపేట రూరల్‌ పోలీసులు రంగంలోకి దిగారు. నకిలీ బీమా కుంభకోణంలో ప్రధాన సూత్రధారి అయిన బరంపేట చాకిరాలమెట్టకు చెందిన శ్రీనివాస్‌ను శుక్రవారం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
 
 వేలల్లో బాధితులు.. లక్షల్లో మోసం..
 కొన్నేళ్ళుగా నరసరావుపేట, గుంటూరు, పిడుగురాళ్ళ, ఆర్టీవో కార్యాలయాల వద్దకు వెళ్లి వాహనాలకు సంబంధించి ఇన్సూరెన్స్‌లు చేస్తామని ఏజెంట్‌లతో ఒప్పందం కుదుర్చుకొని శ్రీనివాస్‌ తన కార్యకలాపాలను చక్కబెడుతున్నట్లు పోలీస్‌ విచారణలో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. అతను ఇచ్చిన సమాచారంతో బీమా పత్రాల తయారీకి ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఓ ప్రముఖ ఇన్సూరెన్స్‌ కంపెనీకి సంబంధించి లెటర్‌ ప్యాడ్లు, స్టాంపులు, పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటిలో ఉన్నాయి.  విషయం కొంతమంది వాహనదారులకు తెలియటంతో లబోదిబో మంటున్నారు. ఇప్పటివరకు నరసరావుపేట పరిధిలో 400 వాహనాల వరకు నకిలీ ఇన్సూ్యరెన్స్‌లు చేసినట్లు ప్రాథమికంగా తేలింది. 
>
మరిన్ని వార్తలు