బాంబ్‌స్క్వాడ్‌ తనిఖీలు

5 Nov, 2016 22:22 IST|Sakshi
బాంబ్‌స్క్వాడ్‌ తనిఖీలు
జంగారెడ్డిగూడెం : ఆంధ్రా, ఒడిశా బోర్డర్‌లో ఇటీవల ఎన్‌కౌంటర్‌ జరగడం, మావోయిస్టులు ఈనెల3న బంద్‌కు పిలుపునివ్వడం తదితర పరిణామాల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లావ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టింది. బాంబ్‌ స్క్వాడ్‌తో ప్రధాన కూడళ్లు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌లు, దేవాలయాలు, పర్యాటక కేంద్రాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తోంది. నాలుగు రోజలుగా ఈ తనిఖీలు జరుగుతున్నాయి. బాంబ్‌స్క్వాడ్‌ సిబ్బంది ఏఆర్‌ ఎస్‌ఐ ఎబినేజర్, కానిస్టేబుళ్లు విజయ్‌కుమార్, అఖిల్, బాలకృష్ణ ఈ తనిఖీలు నిర్వహించారు. శనివారం జంగారెడ్డిగూడెం పోలీస్‌ సబ్‌డివిజన్‌ పరిధిలో జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్టాండ్, పారిజాతగిరి దేవాలయం, గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయం, చింతలపూడి బస్టాండ్‌లలో బాంబ్‌స్క్వాడ్‌ సిబ్బంది విస్తృతంగా తనిఖీలు చేశారు. ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో మావోయిస్టులు ప్రతికార చర్యకు పాల్పడే ఆస్కారం ఉన్నందున ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.  జిల్లాలోని ఏలూరు, కొవ్వూరు, నరసాపురం, జంగారెడ్డిగూడెం పోలీస్‌ సబ్‌డివిజన్ల పరిధిలోని  ప్రధానమైన, జనసమ్మర్ధం ఉండే సుమారు 75 ప్రాంతాలను గుర్తించి అణువణువూ తనిఖీలు చేశారు.  
 
 
మరిన్ని వార్తలు