5 నుంచి నవ్యాంధ్ర ప్రస్తక సంబరాలు

28 Oct, 2016 00:41 IST|Sakshi
5 నుంచి నవ్యాంధ్ర ప్రస్తక సంబరాలు
  • తొలిసారిగా నెల్లూరులోని వీఆర్‌సీ గ్రౌండ్‌లో ఏర్పాటు 
  •  నెల్లూరు(అర్బన్‌):
    గత 50 ఏళ్ల చరిత్రలో లేని విధంగా తొలిసారిగా నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించిన నవ్యాంధ్ర పుస్తక సంబరాలు స్థానిక వీఆర్‌సీ గ్రౌండ్‌లో వచ్చే నెల 5 నుంచి 13వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని ప్రముఖ ఎమెస్కో పుస్తక పబ్లిషర్స్‌ అధినేత విజయకుమార్‌ అన్నారు. స్థానిక దర్గామిట్టలోని హోటల్‌ మినర్వాలో గురువారం పుస్తక ప్రదర్శనకు చెందిన వాల్‌పోస్టర్లు, బ్రోచర్లను ఆవిష్కరించారు. విజయవాడ బుక్స్‌ సొసైటీ, ఎన్టీఆర్‌ ట్రస్ట్, ఏపీ సాంస్కృతిక శాఖ లాంటి సంస్థల సహకారంతో సంబరాలు 9 రోజుల పాటు నిర్వహించనున్నామన్నారు. విద్యార్థులకు ప్రతి రోజూ వక్తృత్వ, పద్యాలు, క్విజ్‌పై పోటీలు నిర్వహించి పెద్ద ఎత్తున బహుమతులు అందచేస్తామన్నారు. నెల్లూరు, ఒంగోలు ప్రాంత కవులు రాసిన పుస్తకాలను తమకు డిపాజిట్‌ చేస్తే వారి కోసం ప్రత్యేకంగా కేటాయించిన రెండు స్టాల్స్‌లో ప్రజలకు విక్రయించి ఆడబ్బును కవులకు అందచేస్తామన్నారు. ఉచితంగానే స్టాల్స్‌ నిర్వహిస్తామన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలుంటాయన్నారు. దువ్వూరి రామిరెడ్డి, పొణకా కనకమ్మ లాంటి వారిని స్మరణకు తెచ్చుకుంటూ వర్దమాన కవులకు స్ఫూర్తినిస్తామన్నారు. ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నెల్లూరు జిల్లా సాహిత్య, సాంస్కృతిక వారసత్వ సంపదకు నిలయమన్నారు. సంబరాల విజయవంతానికి జనవిజ్ఞాన వేదిక, యుటీఎఫ్, విద్యావికాస సంస్థలు పూర్తిస్థాయిలో పాల్గొనేవిధంగా కృషి చేస్తామన్నారు. ఎన్‌టీఆర్‌ ట్రస్టు ప్రతినిధి రామకృష్ణ మాట్లాడుతూ సాహిత్య కార్యక్రమాలతో పాటు ట్రస్ట్‌ తరుపున ఉచిత వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామన్నారు. వచ్చే నెల 8న బుక్స్‌ ఫర్‌ వాక్‌ పేరుతో వైవీఎం గ్రౌండ్‌ నుంచి ట్రంçకురోడ్డు, ఎసీ బొమ్మ, ఎబీఎం కాంపౌండ్, గాంధీబొమ్మ  మీదుగా వీఆర్‌సీ గ్రౌండ్‌లో పుస్తక సంబరాలు జరిగే ప్రదేశం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. సంబరాలను మేథావులు జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రముఖ కవి పెరుగు రామకృష్ణ  ప్రసంగించారు. 
     
     
మరిన్ని వార్తలు