స్నేహానికి ప్రతిరూపం ఇందూ-సీత

7 Aug, 2016 09:03 IST|Sakshi
సీత, ఇందిర

38 ఏళ్లుగా ఒకే ఇంటిలో జీవనం
వృద్ధాప్యంలోనూ చెదరని చెలిమి
అనారోగ్యంతో ఉన్న ఇందూకు సీత సపర్యలు
నేడు ఫ్రెండ్‌షిప్‌ డే


ఖమ్మం: ‘ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. ఇక్కడే కలిశాం.. చదువులమ్మ చెట్టు నీడలో.. వీడిపోమంటు..వీడలేమంటు.. ఒక్కటై ఉన్నాం.. చివరి ఆశ.. చివరి శ్వాసతో..’ అనే పాట రూపంగా ఓ ఇద్దరు నిజ జీవితంలోనూ మిత్రులుగా కలిసిమెలిసి జీవిస్తున్నారు. ఒకే ఇంటిలో ఉంటూ.. ఒకే బడిలో పాఠాలు బోధించి.. ఒక్కటిగా జీవిస్తున్నారు. అద్దంకి ఇందిర బీఏ, ఎంఈపీ, వేంపాటి సీతామహాలక్ష్మి ఎంఏ, ఎంఏ, బీఈడీ, డీబీహెచ్, పీహెచ్‌డీ ఈ ఇద్దరు ఖమ్మంలోని సెయింట్‌ జోసెఫ్‌ పాఠశాలలో కలుసుకున్నారు. 38 ఏళ్ల క్రితం వీరి మధ్య ఏర్పడిన చెలిమి వృద్ధాప్యంలోనూ తోడుగా ఉంటోంది. శ్రీనివాసనగర్‌లో ఒకే ఇంటిలో ఉంటున్న ఈ ఇద్దరి స్నేహం గురించి..

స్నేహం చిగురించిందిలా..
గుంటూరు జిల్లా నర్సారావుపేటలో జన్మించి అక్కడే విద్యనభ్యసించిన ఇందిర చదువు పూర్తయ్యాక 1968లో ఖమ్మంలోని సెయింట్‌ జోసెఫ్‌ హైస్కూల్‌లో గణితం ఉపాధ్యాయురాలుగా చేరారు. సీతామహాలక్ష్మి కృష్ణా జిల్లా విజయవాడలో జన్మించి అక్కడే విద్యనభ్యసించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వోకల్‌ అండ్‌ వాయిలెన్‌ (మ్యూజిక్‌)లో పీహెచ్‌డీ చేశారు. హిందీలో పట్టా ఉండటంతో ఈమె కూడా ఖమ్మంలోని సెయింట్‌ జోసెఫ్‌ పాఠశాలలోనే 1978లో హిందీ ఉపాధ్యాయురాలిగా చేరారు. అలా వీరి మధ్య స్నేహం చిగురించింది. నాటి నుంచి ఇద్దరూ ఒకే ఇంటిలో ఉంటూ కలిసి స్కూల్‌కు వెళ్లి విధులు నిర్వహించేవారు. పాఠశాలలో ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా వీరిద్దరే కీలకంగా వ్యవహరించేవారు.

తల్లిదండ్రులకు వీరిద్దరూ ఒకే ఒక సంతానం. తల్లిదండ్రుల వద్దకు వెళ్లాలన్నా వీరిద్దరు కలిసే వెళ్లేవారు. ఇద్దరూ పెళ్లికి దూరంగా ఉన్నారు. ఇందిర 1999లో, సీతామహాలక్ష్మి 2013లో పదవీవిరమణ చేశారు. ఇందిర తల్లితండ్రులిద్దరూ మరణించారు. సీతకు తల్లి మాత్రమే ఉంది. 75 ఏళ్లు ఉన్న ఇందిర ఆరోగ్యం క్షీణిస్తోంది. ఇటీవల పక్షవాతం వచ్చింది. లేవలేని స్థితిలో ఉన్న ఆమెకు 62 ఏళ్ల సీత సపర్యలు చేస్తోంది. వైద్యశాలలో చికిత్స, ఇంటి వద్ద ఫిజియోథెరఫీ చేయించి తిరగగలిగే విధంగా చేశారు. ఈ ఇద్దరు ప్రియమిత్రులను ‘సాక్షి’ కలువగా..‘స్నేహం గొప్పది. మా స్నేహం విడదీయలేనిది. ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. వృద్ధాప్యంలోనూ మా స్నేహం చిరస్మరణీయమైనది’ అన్నారు.
 

మరిన్ని వార్తలు