బాక్సింగ్ శిక్షణకు మేటి

12 Oct, 2016 23:17 IST|Sakshi
బాక్సింగ్ శిక్షణకు మేటి

చదువు అంతంత మాత్రమే... పేదరికం అతన్ని చదువుల తల్లికి దూరం చేసింది. అదే సమయంలో జీవితంలో నిలదొక్కుకునేందుకు పడిన తపన... యుద్ధ క్రీడల్లో నిష్ణాతుడిగా మార్చింది. కరాటేతో మొదలైన ప్రస్థానం వివిధ క్రీడలతో కొనసాగుతూ... బాక్సింగ్‌ వరకు చేరుకుంది. తన అనుభవాలను పది మందికి పంచుతూ వారిలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు శ్రమిస్తున్నాడు. ఈ సుధీర్ఘ ప్రస్థానంలో ఎదురైన ఆటుపోట్లకు వెరవకుండా జిల్లాలో బాక్సింగ్‌ క్రీడాభివద్ధిలో తనవంతు పాత్ర పోషిస్తున్నాడు. పాలకులు, అధికారులు గుర్తించని అభివన ద్రోణాచార్యుడిగా మిగిలిన అతనే మహేష్‌ కుమార్‌ ఉరఫ్‌ మహేష్‌.


బాక్సింగ్‌లాంటి యుద్ధ కళను అభ్యసించడం సామాన్యులకు అందని ద్రాక్షే. ఖర్చుతో కూడుకున్న ఈ క్రీడను అభ్యసించేందుకు చాలా మంది వెనుకడుగు వేస్తుంటారు. అంతేకాక ప్రత్యర్థి ముష్టిఘాతాలను తట్టుకోలేకపోతే భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుండడంతో బాక్సింగ్‌ క్రీడ అంటే చాలా మంది భయపడుతుంటారు. ఇలాంటి తరుణంలో సాధారణ యుద్ధ విద్యలకంటే వ్యక్తిగత ఆత్మరక్షణకు బాక్సింగ్‌ చాలా ఉపయోగపడుతుందనే విషయాన్ని మహేష్‌  గుర్తించాడు. అప్పటి వరకు కరాటేకే పరిమితమైన అతను బాక్సింగ్‌ నేర్చుకునేందుకు ఈ క్రీడలో ద్రోణాచార్య అవార్డు పొందిన విశాఖపట్నంలోని వెంకటేశ్వరరావు వద్దకు చేరుకున్నాడు. అక్కడే ఈ క్రీడను అభ్యసించాడు.

ఉచిత శిక్షణతో..
విశాఖ పట్నం నుంచి తిరిగి వచ్చిన మహేష్‌... 2009 నుంచి వివిధ పాఠశాలల విద్యార్థులకు బాక్సింగ్‌ నేర్పిస్తూ వచ్చాడు. బాక్సింగ్‌ పట్ల చాలామందిలో ఉన్న అపోహలను తొలగిస్తూ క్రీడాభివద్ధికి కషి చేస్తూ వచ్చాడు. ప్రధానంగా బాలికల ఆత్మరక్షణలో బాక్సింగ్‌ ఎంత బాగా ఉపయోపడుతుందో తెలుసుకున్న చాలా మంది అమ్మాయిలు ప్రత్యేకంగా మహేష్‌ వద్ద శిక్షణ పొందుతున్నారు. తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికీ అతను ఉచితంగానే ఈ క్రీడను నేర్పిస్తూ వస్తున్నారు. చదువు లేకపోవడం... ఆర్థికంగా ఉన్నత స్థానంలో లేకపోవడంతో జిల్లా స్థాయి అధికారుల దష్టిని మహేష్‌ ఆకర్షించలేకపోతున్నాడు. అయితే అతని కషిని గుర్తిస్తూ జిల్లా బాక్సింగ్‌ అసోసియేషన్‌ కార్యదర్శిగా గుర్తింపును రాష్ట్ర బాక్సింగ్‌ అసోసియేషన్‌ ఇచ్చింది.

వందకు పైగా పతకాలు
జిల్లాలో బాక్సింగ్‌ క్రీడ నేర్పించడం మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు వందకు పైగా పతకాలను మహేష్‌ శిష్యులు సాధించారు. పైకా, ఏపీ స్కూల్‌ గేమ్స్‌తో పాటు అసోసియేషన్‌ క్రీడా పోటీలకు సైతం జిల్లా నుంచి చాలా మంది క్రీడాకారులు వెళ్తున్నారు. 2011లో జిల్లాలో బాక్సింగ్‌ క్రీడాభివద్ధి కోసం అప్పటి డీఎస్‌డీవో లక్ష్మినారాయణరెడ్డి కిట్‌లను సమకూర్చారు. 2015లో ఆర్డీటీ సహకారంతో రాస్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ ఛాపింయన్‌ షిప్‌ పోటీలను నిర్వహించారు. అదే ఏడాది జిల్లా క్రీడాకారులకు బాక్సింగ్‌ కిట్‌లను ఆర్డీటీ సంస్థ అందజేసి ప్రోత్సహించింది. ప్రభుత్వ ప్రోత్సహం ఉంటే ఈ క్రీడను మరింత అభివద్ధి చేస్తామంటూ ఈ సందర్భంగా మహేష్‌ పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు