వలస కుటుంబంలో విషాదం

11 May, 2017 23:02 IST|Sakshi
వలస కుటుంబంలో విషాదం

– కేఎస్‌ ఆర్టీసీ బస్సు ఢీకొని బాలుడి మృతి

వలస కుటుంబంలో బస్సు ప్రమాదం విషాదం నింపింది. అంతవరకూ తమ ముందే ఆడుకుంటున్న ఏడేళ్ల పిల్లాడు అంగడికి వెళుతూ రోడ్డు దాటుతుండగా కేఎస్‌ఆర్టీసీ బస్సు ఢీ కొంది. ప్రమాదంలో పిల్లాడు అక్కడికక్కడే మృతిచెందడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు.

బెళుగుప్ప : మండలంలోని నారింజగుండ్లపల్లి గ్రామం చెక్‌పోస్టు సమీపంలో గురువారం రోడ్డు దాటుతున్న సాయినాథ్‌(7)అనే బాలుడిని కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు.  ఏఎస్‌ఐ విజయనాయక్‌ తెలిపిన వివరాల మేరకు.. గుంతకల్లు పట్టణానికి చెందిన మారెన్న, గంగమ్మల కుటుంబం చిన్న పిల్లల దుస్తులు విక్రయిస్తూ సంచార జీవనం సాగించేవారు. అందులో భాగంగా గురువారం ఉదయమే గుండ్లపల్లికి  వచ్చి  ప్రధాన రహదారికి  కొంతదూరంలో గుడిసె వేసుకున్నారు. వారి రెండవ కుమారుడు సాయినాథ్‌  ప్రదాన రహదారి అటువైపు వున్న  కిరాణాకొట్టులో  తినే వస్తువులను  కొనుక్కోవడానికి రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగింది.

రాయదుర్గం నియోజకవర్గంలోని  కణేకల్‌ మండలం ఎర్రగుంట  గ్రామం నుంచి బెంగళూరులో ఓ వివాహవేడుకకు గుండ్లపల్లి మీదుగా వెళ్తూ  కర్ణాటకకు చెంది ఆర్టీసీ బస్సు అతివేగంగా బాలుడిని ఢీకొంది. ముందుచక్రం కింద పడ్డ బాలుడిని కొన్ని అడుగులు ఈడ్చుకుంటూ వెళ్లిది. దీంతో బాలుడు అక్కడిక్కడే మృతి చెందాడు. బాలుడి తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. వారికి మరో నలుగురు పిల్లలున్నారు. బస్సు డ్రైవర్‌ పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు  చేసి మృతదేహాన్ని కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించి దర్యాప్తు చేపట్టామని ఏఎస్‌ఐ విజయనాయక్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు