‘షో’భన్ బాబు

9 Mar, 2016 05:13 IST|Sakshi
‘షో’భన్ బాబు

పాటలు, డ్యాన్స్, మిమిక్రీ, యాంకరింగ్‌లో ప్రతిభ
రాష్ట్ర, జాతీయస్థాయిలో ప్రదర్శనలు.. పలువురి ప్రశంసలు

 పాటలు పాడటం.. పేరడీగా మలచడం.. ధ్వన్యనుకరణ చేయడం.. ఇతరుల డ్యాన్స్‌ను అనుకరించడం.. యాంకరింగ్‌తో ఆకట్టుకోవడం.. షార్ట్ ఫిలింస్‌లో నటనా కౌశలాన్ని ప్రదర్శించడం.. ఇలా వివిధ విభాగాల్లో ప్రతిభ చాటుతున్నాడు. రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో బహుమతులు దక్కించుకోవడంతోపాటు ప్రముఖుల మెప్పు పొందుతున్నాడు నగరానికి చెందిన శోభన్‌బాబు. వేదికలపై నిత్యం ప్రదర్శనలతో అలరించే ఆయన అందరి దృష్టిలో ‘షో’భన్‌బాబుగా మారాడు.  - ఖమ్మం కల్చరల్

నగరంలోని ఎన్నెస్పీ కాలనీకి చెందిన శోభన్‌బాబు ప్రైవేటు ఉద్యోగి. ప్రవృత్తిగా కళారంగాన్ని ఎంచుకున్నాడు. 1996లో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి నుంచి కళారంగంలో రాణిస్తున్నాడు. అప్పట్లోనే జిల్లాస్థాయి పాటల పోటీల్లో ప్రతిభ కనబరిచి.. ప్రథమ బహుమతి గెలుచుకున్నాడు. సినిమా పాటలకే ప్రాధాన్యత ఇవ్వడం కాకుండా జానపద పాటలు ఎక్కువగా పాడుతూ పల్లె సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించడం అలవర్చుకున్నాడు. క్రమక్రమంగా జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి ఎదిగాడు. అంతేకాక డ్యాన్స్‌లు చేస్తూ.. ఇతరులను అనుకరించడం అలవర్చుకున్నాడు.

డ్యాన్స్‌లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, రాజశేఖర్, బ్రహ్మానందం, ఆర్.నారాయణ మూర్తి, శోభన్‌బాబు తదితర హీరోలను అనుకరించడంలో నేర్పు సంపాదించాడు. ఖమ్మంకు చెందిన మొగిలి దర్శకుడిగా గతేడాది విడుదల అయిన ‘ఒక్కడితో మొదలైంది’ అనే సినిమాలో హీరో సుమన్ పక్కన ఓ పాత్రలో నటించాడు. వేదికలపై యాంకరింగ్ చేస్తూ అందరినీ కడుపుబ్బ నవ్విస్తుంటాడు. ఒకే వేదికపై యాంకరింగ్‌తోపాటు పాట పాడుతూ.. డ్యాన్స్ చేస్తూ.. మిమిక్రీ చేయడం ఇతడి అదనపు ప్రత్యేకతలు. పలు టీవీ సీరియల్స్, లఘు చిత్రాల్లో వివిధ పాత్రల్లో నటించిన అనుభవం ఉంది. అతడి ఉత్తమ నటనకు పలువురిచే ప్రశంసలు అందుకున్నాడు. సినిమా పాటలను యువతకు నచ్చేలా పేరడీ పాటలుగా మలిచి పాడటంలో సిద్ధహస్తుడు.

 అవార్డులు, ప్రశంసలు కొన్ని...
2001లో విజయవాడ రాష్ట్రస్థాయి నాటికల పోటీల్లో సిద్ధార్థ అకాడమీలో ‘పిచ్చి పెళ్లికొడుకుగా’ నవ్వించి..ప్రథమ బహుమతి పొందాడు. 2002లో హైదరాబాద్‌లో జరిగిన పాటల పోటీల్లో ప్రథమ బహుమతి
2002లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగిన యూత్ ఫెస్టివల్ పాటల పోటీల్లో పాల్గొన్నాడు
2006లో జోనా మెమోరియల్ రాష్ట్రస్థాయి పాటల పోటీల్లో ప్రథమ బహుమతి.
2007లో వరంగల్ రాష్ట్రస్థాయి యూత్ ఫెస్టివల్‌లో మిమిక్రీ విభాగంలో ద్వితీయ బహుమతి సాధించాడు.
2008లో తెలుగు భాషా దినోత్సవంలో వక్తృత్వ పోటీల్లో ద్వితీయ బహుమతి పొందాడు. వీటితోపాటు సినీ ప్రముఖులు రాజేంద్రప్రసాద్, సునీల్, సుమన్, రఘు కుంచె, డెరైక్టర్ బి.గోపాల్ చేతుల మీదుగా ప్రశంసలు అందుకున్నాడు.

మరిన్ని వార్తలు