బ్రాహ్మణ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

12 Dec, 2016 15:18 IST|Sakshi
బ్రాహ్మణ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
 • ఏపీ బ్రాహ్మణ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్, మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు
 • ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ బ్రాహ్మిన్స్‌ సెమినార్‌లో పాల్గొన్న ఏపీ స్పోర్ట్స్, యూత్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఎల్‌వి సుబ్రహ్మణ్యం 
 • ఒంగోలు కల్చరల్‌: 
  బ్రాహ్మణుల సంక్షేమానికి, అభివృద్ధికి, యువతకు ఉపాధి అవకాశాల కల్పన కోసం అందుబాటులో ఉన్న అవకాశాలను బ్రాహ్మణులు సద్వినియోగం చేసుకొని ఆర్థిక , రాజకీయ, పారిశ్రామిక, వృత్తిరంగాలలో రాణించేందుకు కృషి చేయాలని మాజీ సీఎస్, ఏపీ బ్రాహ్మణ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఐవైఆర్‌ కృష్ణారావు అన్నారు. స్థానిక స్వాతి కళ్యాణ మండపంలో శనివారం కంచి కామకోటి పీఠం ఆశీస్సులతో నిర్వహించిన ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ బ్రాహ్మిన్స్‌ సెమినార్‌లో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. కార్పొరేషన్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ఆయన వివరించారు. స్పోర్ట్స్, యూత్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్పెషల్‌  చీఫ్‌ సెక్రటరీ ఎల్‌వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ క్రీడలతోపాటు ఇతర అన్ని రంగాల్లో రాణించేందుకు బ్రాహ్మణ యువత కృషి చేయాలన్నారు.
   
  యువత కోసం అమలవుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యువతను ప్రోత్సహించడం ద్వారానే నిజమైన వికాసం సాధ్యమవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతోపాటు పలు ఇతర ప్రాంతాల నుంచి బ్రాహ్మణ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. స్వాతి గ్రానైట్‌ అధినేత గూడ రామ్మోహన్‌ సదస్సుకు అధ్యక్షత వహించడంతోపాటు కార్యక్రమ ఆశయాలను, సదస్సు ఏర్పాటు లక్ష్యాలను  వివరించారు. కార్యదర్శి ఓరుగంటి నరసింహ శాస్త్రి తదితరులు పర్యవేక్షించారు. మిత్రా ఏజన్సీస్‌ నిర్వాహకులు మాగంటి సుబ్రహ్మణ్యం, ధన్వంతరి ఫౌండేషన్‌ ఇంటర్నేషనల్‌ మేనేజింగ్‌ ట్రస్టీ డాక్టర్‌ పి.కమలాకర శర్మ , స్వరాజ్యలక్ష్మి, డాక్టర్‌ పివిఎల్‌ఎన్‌ మూర్తి , సోమరాజు సుశీల, డాక్టర్‌ దామరాజు సూర్యకుమార్, భీమరాజు వెంకట రమణ తదితరులు సదస్సులో పాల్గొని పలు సలహాలు, సూచనలు అందజేశారు.
   
  సదస్సు విజయవంతం కావడంపై నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. బ్రాహ్మణుల సంక్షేమానికి, యువతను ప్రోత్సహించేందుకు మరిన్ని కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. బ్రాహ్మణులకు సమాజంలో మరింత గుర్తింపు, గౌరవం, అవకాశాలు లభించేలా చూసే లక్ష్యంతో  సదస్సును నిర్వహించడంపై నిర్వాహకులను పలువురు అభినందించారు.   
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు