బతికించండి!

15 Oct, 2016 23:02 IST|Sakshi
బతికించండి!

బ్రెయిన్‌ ట్యూమర్‌ బారినపడ్డ బాలుడు
ఆపరేషన్‌కు రూ.లక్షల్లో ఖర్చు
ఆర్థికసాయం కోసం ఎదురుచూపు


ఆ బాలుడిపై విధి చిన్నచూపు చూసింది. నాలుగేళ్ల వయసులోనే ఇబ్బందికరమైన వ్యాధి అయిన బ్రెయిన్‌ ట్యూమర్‌ (మెదడు కణితి) రావడంతో ఆ బాలుడి జీవితాన్ని కుంగదీసింది. పదేళ్లుగా ఈ వ్యాధితో నరకయాతన అనుభవిస్తున్నాడు. రోజూ బడిలో పాఠాలు శ్రద్ధగా విని.. ఇంటికొచ్చాక తల్లిదండ్రుల సపర్యలతో కాలం వెళ్లదీస్తున్నాడు. తన పని తాను కూడా చేసుకోలేక ఇబ్బంది పడుతున్నాడు. వైద్యం చేయించేందుకు ఆర్థిక స్థోమత లేక తల్లిదండ్రులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు.


సోమందేపల్లి మండలం కావేటినాగేపల్లికి చెందిన రైతు లక్ష్మీపతిరెడ్డి, మహేశ్వరి దంపతులకు ఇద్దరు సంతానం. చిన్న కుమారుడు ఉదయ్‌కిరణ్‌ (14) పాలసముద్రంలోని ఉన్నతపాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఇతను పదేళ్లుగా బ్రెయిన్‌ ట్యూమర్‌ వ్యాధితో బాధపడుతున్నాడు. తల్లిదండ్రులు బెంగళూరులో చికిత్స చేయిస్తున్నారు. దాదాపు 7 లక్షల దాకా ఇప్పటి వరకు ఖర్చు అయింది. పది రోజుల క్రితం మెదడుకు సంబంధించి ఆపరేషన్‌ చేశారు.

ఈ నెల 17న మరో శస్త్రచికిత్స అవసరమని వైద్యులు చెప్పారు. ఇప్పటికే వైద్యం కోసం రూ.5లక్షల దాకా అప్పులు చేసిన తండ్రి వద్ద అంత డబ్బు సమకూర్చుకోవడం కష్టమైపోయింది. మంచానికి పరిమితమై జీవచ్ఛవంలా ఉన్న తమ కుమారుడికి మెరుగైన వైద్యం చేయించి సాధారణ జీవితం గడిపేలా చేయడానికి దాతలు ముందుకు రావాలని వేడుకుంటున్నాడు. వైద్య పరీక్షల కోసం బెంగళూరు ఆస్పత్రికి వెళ్లిన ప్రతిసారి రూ.10వేల నుంచి రూ.15వేల దాకా ఖర్చవుతోందని, అదనపు వైద్య పరీక్షలకు సిఫార్సు చేస్తే బంగారు ఉంగరం, తన భార్య చెవికమ్మలు తాకట్టు పెట్టేశానని తెలిపాడు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, దయార్ధ్ర హదయులు స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.

దాతలు ఆర్థికసాయమందించదలిస్తే..
లక్ష్మీపతిరెడ్డి, అకౌంట్‌ నంబర్‌31472200009169,
సిండికేట్‌బ్యాంక్, పాలసముద్రం బ్రాంచ్‌.
ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ ఎస్‌వైఎన్‌బీ0003147
సెల్‌ నంబర్‌ : 99857 14315

మరిన్ని వార్తలు