హిందూపురానికి బ్రాండ్‌ ఇమేజ్‌ను పెంచాలి

5 Aug, 2017 22:04 IST|Sakshi

హిందూపురం అర్బన్‌: హిందూపురం అంటే పారిశ్రామికాభివృద్ధికి పెట్టిందిపేరుగా బ్రాండ్‌ ఇమేజ్‌ను పెంచాల్సిన బాధ్యత ఇక్కడి ప్రజలపై ఉందని జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్‌ అన్నారు. వన్‌టౌన్‌ పోలీçసుస్టేషన్‌లో  శనివారం డీఎస్పీ కరీముల్లాషరీఫ్‌ అధ్యక్షతన శాంతికమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హిందూపురంలో అన్ని మతాల వారు కలిసిమెలిసి ఉన్నప్పుడే పట్టణాభివృద్ధి చెందుతుందన్నారు. హిందూముస్లింలు సోదరభావంతో ఐక్యతగా వినాయకచవితి, బక్రీద్‌లను శాంతియుత వాతావరణంలో సంతోషంగా జరుపుకుందామన్నారు. ఇందుకోసం శాంతికమిటీలను ఏర్పాటు చేశాం వాట్సాప్‌ గ్రూపులు కూడా కల్పించామన్నారు. డీఎస్పీ కరీముల్లా షరీఫ్, సీఐ ఇదురుబాషా మాట్లాడుతూ వినాయక విగ్రహాల ఏర్పాటు నిర్వాహకులు పోలీసుల సూచనల మేరకు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మైకు గట్టిగా పెట్టడం, ఊరేగింపులకు ఇబ్బందికరమైన ఎతైన విగ్రహాలు ఏర్పాటు చేయడం వంటివి వద్దన్నారు. కార్యక్రమంలో ముత్తవల్లి తల్హాఖాన్, కౌన్సిలర్‌ రోషన్‌వలి, నాయకులు భాస్కర్, రాయల్‌గోపాల్, కమిటీసభ్యులు కౌన్సిలర్‌ జబివుల్లా, రైల్వే శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం :  రోడ్డుప్రమాదాలను పూర్తిగా నియంత్రించడానికి తీవ్రంగా కృషిచేస్తున్నామని ఎస్పీ అశోక్‌కుమార్‌ అన్నారు. శనివారం హిందూపురం విచ్చేసిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రోడ్డుప్రమాదాల నియంత్రణకు అవగాహన కార్యక్రమాలు పెంచుతున్నామని చెప్పారు. ఇందులో భాగంగా అనంతపురం, హిందూపురం కేంద్రాల్లో అవగాహన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తర్వాత అన్ని ప్రధాన పట్టణాల్లో ప్రారంభిస్తామన్నారు. కొడికొండ, తూమకుంట సరిహద్దు ప్రాంతాల్లో అక్రమరవాణా అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా నివారణకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో రాజకీయహత్యలు పెరిగాయని చెప్పగా జరిగిన హత్యల్లో రాజకీయ కోణాలు లేవని మాదన్న హత్యపై పూర్తిస్థాయిలో విచారణ జరుగుతోందన్నారు. 

మరిన్ని వార్తలు