వేటకు బ్రేక్‌

12 Apr, 2017 22:27 IST|Sakshi
వేటకు బ్రేక్‌

► 14 అర్ధరాత్రి నుంచి చేపల వేటకు విరామం
► ఉల్లంఘిస్తే కఠిన చర్యలు అంటున్న అధికారులు
► 61 రోజులపాటు జీవనం ఎలా...?


పాతపోస్టాఫీసు (విశాఖ దక్షిణం) : తూర్పు తీరంలో శుక్రవారం అర్ధరాత్రి (ఈనెల 14వ తేదీ) నుంచి చేపల వేట నిలిచిపోనుంది. మొత్తం 61 రోజుల పాటు  వేటను నిలిపేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మళ్లీ జూన్‌ 14వ తేదీ అర్ధరాత్రి నుంచి చేపల వేట మొదలు కానుంది.  2014 వరకూ నిషేధం 47 రోజులుగా పరిగణించేవారు. అయితే మత్స్యకార సంఘాలు, బోట్ల ఆపరేటర్ల విజ్ఞప్తి మేరకు గడువును 2015 నుంచి 61 రోజులకు పొడిగించారు. గడువు సమీపించడంతో బోట్లు రేవుకు చేరుకున్నాయి.

వేట కాలంలో 683 మెకనైజ్డ్‌ బోట్లు (మరపడవలు), 2,500 పైచిలుకు ఇంజిను పడవలు, 1100 తెప్పలు చేపలు, రొయ్యలు వేట సాగిస్తాయి. వేట నిషేధకాలంలొ తెప్పలు మాత్రం చేపలు వేటాడొచ్చు. ఎందుకంటే అవి తీరానికి అతి చేరువలోనే ప్రయాణిస్తూ వేటను సాగిస్తాయి. మరపడవలు, డాల్ఫిన్‌ బోట్లు ఒకసారి వేటకు సముద్రంలోకి వెళ్తే కనీసం పదిహేను రోజుల నుంచి 20 రోజుల పాటు సముద్రంలోనే ఉండిపోతాయి. నిషేధ సమయంలో సింగిల్‌ ఇంజన్లతో నడిచే బోట్లను కూడా వేటకు అనుమతించరు.

తగ్గిన దిగుబడులు
2014 అక్టోబర్‌లో సంభవించిన హుద్‌హుద్‌ తుపాను బోటు యజమానులను దెబ్బతీసింది. 66 బోట్లు మునిగిపోగా, మరొ 200 బోట్లకు నష్టం వాటిల్లింది. సుమారు 3 వారాల పాటు వేట నిలిచిపోయింది. 2015–16 సీజన్‌ కన్నా 2016–17 సీజన్‌లో చేప, రొయ్యల దిగుబడి కొంతమేరకు తగ్గింది. తీరానికి అతిచేరువలో ఏర్పాటు చేసిన రసాయన కర్మాగారాల వల్ల చేపలు గుడ్లు, పిల్లల దశలోనే నశించిపోవడం వల్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయిందని బోట్ల యజమానులు చెబుతున్నారు.

ఈ ఏడాది జనవరి నుంచి దిగుబడులు తగ్గిపోయాయి. నెల రోజుల నుంచి 80 శాతం బోట్లు రేవుకే పరిమితం అయ్యాయి. ఎండలు తీవ్రంగా ఉండడం, వేట ఆశాజనకంగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన 20 శాతం బోట్లు వేటనిషేధం ప్రకటించిన నేపథ్యంలో ఒడ్డుకు చేరుకుంటున్నాయి. వేట నిషేధాన్ని మత్స్యశాఖ పర్యవేక్షిస్తుంది. ఒకవేళ నిబంధనలకు వ్యతిరేకంగా వేటకు వెళ్లిన ఈ తరహా బోట్లను మత్స్యశాఖ అధికారులు పట్టుకొని సీజ్‌ చేసి, భారీ జరిమానాలు విధిస్తారు.

మత్స్య క్రమబద్ధీకరణ చట్టం
చేపలు పునరుత్పత్తి (గుడ్లు పొదిగి పిల్లలు తయారయ్యే సమయం) జరిపే సమయంలో చేపల వేట సాగిస్తే మత్స్య సంపదకు ముప్పు వాటిల్లుతుందని, ఆ సమయంలో చేపల వేట నిషేధం ద్వారా మత్స్య సంపద పెంపునకు అవకాశం ఉంటుందని నిపుణుల సూచనల ప్రకారం ఈ చట్టం రూపొందించారు. ఈ చట్ట ప్రకారం నిషేధ సమయంలో ఎవరైనా చేపల వేట సాగిస్తే వారికి రూ.2,500 వరకు జరిమానా విధించడంతోపాటు బోట్లను సీజ్‌ చేస్తారు. వేటాడిన మత్స్య సంపదను స్వాధీనం చేసుకుంటారు. కన్యాకుమారి నుంచి కోల్‌కతా వరకు ఈ నిషేధం అమలులో ఉంటుండగా ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోడానికి మత్స్యశాఖతోపాటు పోలీస్, మెరైన్, నేవీ అధికారులతో బృందాలు ఏర్పాటు చేసి గస్తీకి ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రత్యామ్నాయ సంగతేంటి...?
ఏటా వేట నిషేధం క్రమంతప్ప కుండా అమలు చేస్తున్నారు. 61 రోజులపాటు వేట ఆగిపోవడం వల్ల తమ జీవనోపాధి దెబ్బతిని పస్తులుండాల్సి వస్తుందని మత్స్యకారులు వాపోతున్నారు. పరిహా రంగా బియ్యం పంపిణీ చేస్తున్నా అది సమయానికి అందజేయకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నష్టాలు చవిచూశాం
గత సీజన్‌ మాదిరిగానే ప్రస్తుత సీజన్‌లో కూడా చేపలు, రొయ్యల వేట ఆశాజనకంగా లేకపోవడంతో చాలావరకు నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. ప్రభుత్వం బోటు యజమానులను ఆదుకోవాలి. రసాయన కర్మాగారాల వల్ల సముద్ర ఉత్పత్తులు నష్టపోకుండా తగిన చర్యలు చేపట్టాలి. – బర్రి కొండబాబు, విశాఖ కోస్టల్‌ బోటు ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడు

రూ.15 వేలు ఇవ్వాలి
చేపల వేట విరామ సయంలో మత్స్యకార్మికులు తమ కుటుంబాలను పోషించుకునేందుకు ఒక్కొక్కరికి రూ.15వేలు చొప్పున భృతి చెల్లించాలి. గత సీజన్‌లో ప్రభుత్వం ప్రకటించిన రూ.4వేలు చాలా మంది మత్స్యకార కార్మికులకు అందలేదు. మత్స్యకారులను ప్రభుత్వం మోసం చేయడం మానుకోవాలి. –  చంద్రశేఖర్, ఏపీ మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక సంఘ సభ్యుడు

సకాలంలో పరిహారం చెల్లించాలి
మత్స్యకారులకు వేట విరామ సమయంలో రూ.4 వేలు చెల్లిస్తున్నారు. గత ఏడాది పరిహారం కొంతమందికి నేటికీ అందలేదు. ఈ ఏడాదైనా పరిహారం మొత్తం సకాలంలో చెల్లించాలి. వేట ముగిసే సమయానికి అందిస్తే వారికి మేలు జరుగుతుంది. మూడు నెలలుగా వేట పెద్దగా సాగలేదు. – పి.సి.అప్పారావు, ఏపీ బోటు ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడు

పరిహారం కోసం ప్రతిపాదనలు
చేపల వేట విరామ సమయంలో బోట్లపై ఆధారపడిన మత్స్యకారులను ఆదుకొనేందుకు ప్రభుత్వం గత సీజన్‌లో 16,800 మంది కార్మికులను గుర్తించి ఒక్కొక్క కార్మికునికి రూ.4వేల చొప్పున ప్రభుత్వం పంపిణీ చేసింది. ప్రస్తుత సీజన్‌లో కూడా అదే మొత్తం పంపిణీ చేసే అవకాశం ఉంది. బోట్లలో పనిచేసే కార్మికుల జాబితా సిద్ధం చేయమని బోట్ల యజమానులకు, సంఘాలకు చెప్పడం జరిగింది.      – వెంకటేశ్వరరావు, మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు

మరిన్ని వార్తలు