టీనేజ్‌ స్పీడ్‌కు బ్రేక్‌

15 Jun, 2017 23:43 IST|Sakshi
టీనేజ్‌ స్పీడ్‌కు బ్రేక్‌

పిల్లలకు రహదారి భద్రతా పాఠాలు
స్కూళ్లు, కాలేజీల్లో ఆర్టీఏ రోడ్‌ సేఫ్టీ క్లబ్‌లు
1,450 విద్యా సంస్థల్లో ఏర్పాటుకు ప్రణాళికలు


సిటీబ్యూరో: అసలే కుర్రాళ్లు. ఆపైన టాప్‌గేర్‌లో  హైస్పీడ్‌. కళ్లు మూసి తెరిచేలోగా  మాయమైపోవాలనుకుంటారు.  మరోవైపు  బైక్, కార్‌ రేసింగ్‌లు. అయితే రోడ్డు  నిబంధనలపై అవగాహన ఉండదు. స్కూల్‌ దశల్లోనే  బైక్‌ రైడింగ్‌ చేయాలనే ఉత్సాహంతో ప్రాణాలు కోల్పోతున్న టీనేజ్‌ కుర్రాళ్లు. అలాంటి పిల్లల  వాహన  డ్రైవింగ్‌కు కళ్లెం వేసేందుకు రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన పెంపొందించేందుకు  ఆర్టీఏ  ప్రణాళికలను రూపొందిస్తోంది. నగర శివార్లలోని  స్కూళ్లు, కళాశాలలు, తదితర విద్యాసంస్థల్లో  వినూత్నంగా  రోడ్డు భద్రతా క్లబ్‌లను  ఏర్పాటు చేసేందుకు  సన్నాహాలు చేపట్టింది. సుమారు  1,450  విద్యాసంస్థలను లక్ష్యంగా  చేసుకొని  ఈ  క్లబ్‌లను  ఏర్పాటు  చేయనున్నారు.

ఇవి పూర్తిగా పిల్లల క్లబ్‌లు
∙ఈ రోడ్డు సేఫ్టీ క్లబ్బుల నిర్వహణలో పిల్లలే ప్రధాన భాగస్వాములు. ఒకరిద్దరు టీచర్లు, కొందరు పిల్లలతో కలిపి  క్లబ్‌లు  ఏర్పాటు చేస్తారు.  రోడ్డు భద్రతపై  స్కూల్లో చేపట్టవలసిన కార్యక్రమాలను  ఈ క్లబ్‌లే చేపడతాయి. ఈ క్లబ్‌లకు ఆర్టీఏ  శిక్షణనిస్తుంది. ∙ఉదయం ప్రార్థన సమయంలో  రోడ్డు భద్రత నిబంధనలను  గుర్తు చేసుకోవడంతో పాటు, రోడ్డు భద్రతపై  రూపొందించిన షార్ట్‌ఫిల్మ్‌లను ప్రదర్శిస్తారు.  ∙పిల్లలే పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చేలా ఆర్టీఏ  శిక్షణనిస్తుంది. అవసరమైన మెటీరియల్‌ను  ఆర్టీఏ అందజేస్తుంది.  ∙8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, కాలేజీల్లో ఇంటర్‌ స్టూడెంట్స్‌ను భాగస్వాములుగా చేస్తూ  ఈ క్లబ్‌లు ఏర్పాటు చేస్తారు. ∙కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, గండిమైసమ్మ, ఉప్పల్, బోడుప్పల్, అల్వాల్, మల్కాజిగిరి, బాలానగర్, షామీర్‌పేట్‌ తదితర ప్రాంతాల్లో  ఉదయం, సాయంత్రం  వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లోనే బ్లాక్‌స్పాట్‌లు కూడా అధికంగా  ఉన్నట్లు  రవాణా అధికారులు గుర్తించారు. ∙స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్‌డే  వంటి వేడుకల్లో  రోడ్డు భద్రతపై పిల్లలకు వివిధ రకాల పోటీలు నిర్వహించి  బహుమతులను అందజేస్తారు.

ప్రమాద రహిత జీవనమే లక్ష్యంగా..
ముందస్తుగానే పిల్లల్లో  అవగాహన కల్పించడం, ఉపాధ్యాయులను, స్కూళ్లను, తల్లిదండ్రులను కూడా  ఈ ఉద్యమంలో భాగస్వాములను చేయడం ద్వారా భవిష్యత్‌ తరాలు ప్రమాదరహిత జీవనం కొనసాగించాలన్నదే మా ఆకాంక్ష. అందుకే ట్రాఫిక్‌ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తాం.
–  డాక్టర్‌ పుప్పాల శ్రీనివాస్, ఉప రవాణా అధికారి, మేడ్చల్‌.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా