మిషన్‌ చెరువుకు గండి

27 Sep, 2016 22:19 IST|Sakshi
మిషన్‌ చెరువుకు గండి
  • ‘మిషన్‌ కాకతీయ’లో నాణ్యతకు పాతర
  • గంటల్లో వెళ్లిపోయిన నీరు
  • విద్యుత్‌ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు ధ్వంసం
  • కొట్టుకుపోయిన గంగమ్మ ఆలయం
  • ఆందోళన చెందుతున్న రైతులు
  • ముస్తాబాద్‌: ముస్తాబాద్‌ పెద్దచెరువుకు మంగళవారం గండిపడింది. గంటల వ్యవధిలో చెరువులోని నీరంతా ఖాళీ అయింది. పొలాల్లో ఇసుకమేటలు వేశాయి. సుమారు 200 ఎకరాల్లోని వరిపొలాలు నీటిపాలయ్యాయి. విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు, పోత్గల్‌లోని గంగమ్మ ఆలయం కొట్టుకుపోయాయి. సిద్దిపేట–ముస్తాబాద్‌ వంతెన తెగిపోయింది. కట్టకవింద నిర్మిస్తున్న శ్మశానవాటిక ధ్వంసమైంది. గ్రామానికి చెందిన రాగం భిక్షపతి, నిమ్మ ప్రవీణ్‌కు చెందిన రెండు గేదెలు గల్లంతయ్యాయి. చెరువు అడుగున బండరాళ్లు ఉండడంతో కట్ట బలహీనంగా మారి గండిపడిందని ఈఈ చిరంజీవులు తెలిపారు.
     
    అన్నదాతల ఆశలకు గండి
    అన్నదాతల ఆశలు అడియాసలయ్యాయి. 24 ఏళ్ల తర్వాత నిండిన చెరువు చూస్తుండగానే ఖాళీ అయ్యింది. చాలా రోజుల తర్వాత జలకళ సంతరించుకున్న చెరువును చూసి మండలవాసులు ఆనందపడ్డారు. సాగు, తాగునీటికి ఢోకాలేదని నిశ్చింతంగా ఉన్నారు. కానీ.. వారి ఆనందం ఎంతో కాలం నిల్వలేదు. నిజాం కాలంనాటి చెరువు ఏనాడు చెక్కుచెరదలేదు. ఇటీవల మిషన్‌ కాకతీయ పథకంలో ఈ చెరువును చేర్చి మరమ్మతులు అంటూ పనులు చేపట్టారు. పనులు ఎలా చేపట్టారో దేవుడెరుగు. ఏళ్లతరబడి చెక్కుచెదరని చెరువు అలా నిండి ఇలా ఖాళీ అయింది. రబీకు ఇబ్బంది లేదనుకున్న రైతుల ఆశలు ఆవిరయ్యాయి. 
     
    రైతులు, నాయకుల ఆందోళన
    మిషన్‌ కాకతీయలో భాగంగా రూ.47 లక్షలు వెచ్చించి చేపట్టిన పనులు నాసిరకంగా ఉండడంతోనే పెద్దచెరువుకు గండిపడిందని రైతులు, నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరిగేషన్‌ ఇంజినీర్లు, కాంట్రాక్టర్‌ కక్కుర్తితో ఈ పరిస్థితి దాపురించిందని పేర్కొంటూ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. కట్టకు ఉన్న రివిట్‌మెంట్‌ను తొలగించారని.. కనీసం కట్టపై మట్టిపోసి రోలర్లతో తొక్కించలేదని ఆరోపించారు. ‘మిషన్‌ కాకతీయ’ కమీషన్ల పథకంగా మారిందని ఆరోపించారు. బాధ్యులైన అధికారులను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ శ్రీనివాస్‌రావు, ఎంపీటీసీ గజ్జెల రాజు, అఖిలపక్షం నాయకులు తిరుపతి, రాములు, రాంగోపాల్, చాకలి రమేశ్, చింతోజు బాలయ్య, కార్తీక్, మహేశ్‌రెడ్డి, రాజిరెడ్డి, సుధాకర్‌రెడ్డి, ఉపేంద్ర, రైతులు పాల్గొన్నారు. 
    ఎవరిదీ పాపం?
    రెండు దశాబ్దాల తర్వాత నిండిన చెరువును చూసి ముస్తాబాద్‌ వాసులు మురిసిపోయారు. మూడు రోజుల క్రితమే పెద్ద చెరువుకు పలుచోట్ల లీకేజీలు ఉన్నాయని పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. అయినా ఉన్నతాధికారులు స్పందించలేదు. చెరవుకు గండిపడేవరకు చూశారు. రైతులను నిండా ముంచారు. సకాలంలో అధికారులు స్పందించి ఉంటే ఇంత నష్టం జరిగి ఉండేదికాదని పలువురు పేర్కొంటున్నారు.
     
     
>
మరిన్ని వార్తలు