వికటించిన అల్పాహారం

25 Jun, 2017 23:11 IST|Sakshi
వికటించిన అల్పాహారం
9 మంది ఎన్‌సీసీ క్యాడెట్లకు అస్వస్థత  
మందులు లేవన్న ప్రభుత్వాస్పత్రి సిబ్బందిపై ఆర్డీవో ఆగ్రహం  
పెద్దాపురం :  కాకినాడ 18 ఆంధ్రా బెటాలియన్‌ ఎన్‌సీసీ శిక్షణ శిబిరంలో ఆదివారం ఉదయం 9 మంది ఎన్‌సీసీ మహిళా క్యాడెట్లు అస్వస్థతకు గురయ్యారు. శిబిరం వద్దకు ఉదయాన్నే వండిన అల్పాహారం వికటించడంతో  వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఎన్‌సిసి అధికారులు మనీష్‌గౌర్, యు.మాచిరాజు, కృష్ణారావు, సతీష్‌లు హుటాహుటీన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయంలో తెలుసుకున్న పెద్దాపురం ఆర్డీవో వి.విశ్వేశ్వరరావు, మున్సిపల్‌ చైర్మన్‌ రాజా సూరిబాబురాజు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌ బొడ్డు బంగారుబాబులు క్యాడెట్ల ఆరోగ్య సమస్యపై ఆరా తీశారు. ఆస్పత్రిలో సిబ్బంది మందులు బయట నుంచి తీసుకు రమ్మన్నంటున్నారని క్యాడెట్లు ఫిర్యాదు చేయడంతో సిబ్బందిని పిలిచి వారిపై ఆర్డీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. మందుల కొరత లేదంటూనే మందులు లేవని సమాధానం చెప్పడమేమిటని మండిపడ్డారు. అవసరమైతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలి గానీ రోగులపై సమాధానం చెప్పడం బాగోలేదని, ఇలా అయితే చర్యలు తీసకుంటామని హెచ్చరించారు. వెంటనే వైద్యులను రప్పించి క్యాడెట్లకు అవసరమైన మెరుగైన వైద్యాన్ని అందించాలని ఆర్డీవో ఆదేశించారు.
 మంత్రి రాజప్ప ఆరా 
 ఎన్‌సీసీ క్యాడెట్లు అస్వస్థతకు గురైన సమాచారం అందిన వెంటనే రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప క్యాడెట్లకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రికి వెళ్లి పరిస్థితిని చక్కదిద్దాలని ఆర్డీవో విశ్వేశ్వరరావు, వైద్యాధికారులకు సూచించారు. క్యాడెట్లకు మెరుగైన వైద్యాన్ని అందించాలని ఆదేశాలు జారీ చేశారు.
మరిన్ని వార్తలు