ప్రతి మండలంలో ఇటుకల తయారీ కేంద్రాలు

22 Oct, 2016 23:09 IST|Sakshi
ప్రతి మండలంలో ఇటుకల తయారీ కేంద్రాలు
– హౌసింగ్‌ శాఖ పరిధిలో 12 నిర్మిత కేంద్రాలు 
– డీఆర్‌డీఏ శాఖ పరిధిలో 42
– వచ్చే ఏడాది మార్చి ఆఖరుకు ఎన్టీఆర్‌ గృహాలు పూర్తి చేస్తాం
 – సమావేశంలో హౌసింగ్‌ పీడీ రాజశేఖర్‌
కోవెలకుంట్ల: ఎన్టీఆర్‌ గృహాల నిర్మాణాలకు కావాల్సిన సిమెంట్‌ ఇటుకల తయారీకి జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో నిర్మిత కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు హౌసింగ్‌  పీడీ రాజశేఖర్‌ చెప్పారు. శనివారం స్థానిక హౌసింగ్‌ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీడీ మాట్లాడుతూ  జిల్లాలో  హౌసింగ్‌ శాఖ ఆధ్వర్యంలో 12 నిర్మిత కేంద్రాలు ఉన్నాయన్నారు. డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 10 మండలాల్లో  స్థలాలు సేకరించామని, మిగిలిన 32 మండలాల్లో స్థలాల అన్వేషణ జరుగుతోందన్నారు. ఆయా కేంద్రాల్లో సిమెంట్‌ ఇటుకలు తయారు చేసి లబ్ధిదారులకు సరఫరా చేస్తామన్నారు.
 
   సిమెంట్‌ ఇటుకలే కాకుండా ఎర్ర ఇటుకలు, నాపరాళ్లతో ఇంటి నిర్మాణం చేపడతామని లబ్ధిదారులు ముందుకు వస్తే వాటిని సరఫరా చేస్తామన్నారు. 103, 114 జీఓల ప్రకారం జిల్లాకు 14750 ఎన్టీఆర్‌ గృహాలు, 104 జీఓ ప్రకారం 4246 గృహాలు ప్రధాన మంత్రి ఆవాస్‌యోజన పథకం కింద మంజూరయ్యాయని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ గృహాలను వచ్చే నెలలో ప్రారంభించి వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి 10600 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు. ఎన్టీఆర్‌ గృహాలకు రూ. 1.50 లక్షలు, ప్రధానమంత్రి అవాస్‌యోజన గృహాలకు రూ. 2 లక్షలు చెల్లిస్తామని చెప్పారు. ఎన్టీఆర్‌ గృహ నిర్మాణాలకు ఉపాధి పథకంతో అనుసంధానం చేశామనానరు. 90 పనిదినాలు, సిమెంట్‌ ఇటుకలు, వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి ఆ పథకం కింద రూ. 55వేలు, హౌసింగ్‌ పథకం కింద రూ. 95 వేలు చెల్లిస్తామన్నారు. ఎన్టీఆర్‌ గృహాలు మంజూరైన లబ్ధిదారులు ఉపాధి హామీ పథకంలో జాబ్‌కార్డు కలిగి ఉండాలని చెప్పారు. లబ్ధిదారులకు బేస్‌మెంట్, ఎల్‌ఎల్, ఆర్‌ఎల్, ఆర్సీ దశల్లో బిల్లులు చెల్లిస్తామని చెప్పారు. కార్యక్రమంలో హౌసింగ్‌ డీఈ కృష్ణారెడ్డి, ఏఈ రామసుబ్బన్న పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు