పెళ్లి కుమార్తెపై అకృత్యం

30 May, 2017 09:51 IST|Sakshi
పెళ్లి కుమార్తెపై అకృత్యం
నిడదవోలు/నిడదవోలు రూరల్‌: తెల్లవారితే ఆ యువతికి పెళ్లి. బంధుమిత్రులకు శుభలేఖలు పంచివచ్చారు. ఇంటివద్ద పందిళ్లు వేశారు. వేదికను ప్రత్యేకంగా అలంకరించారు. వివాహ వేళ గీతాలు ఆలపించే బృందాలు సైతం వేదిక వద్దకు చేరుకున్నాయి. ఆ ఇల్లంతా బంధుమిత్రుల సందడితో కళకళలాడుతోంది. ఎవరికి వారు పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో పెళ్లికుమార్తె ఇంటికి సమీపాన బహిర్భూమికి వెళ్లింది. ఎంతసేపటికీ తిరిగిరాకపోవడంతో తల్లిదండ్రులు, బంధువుల్లో ఆందోళన మొదలైంది. ఊరంతా వెతికారు. ఇంటింటికీ వెళ్లి ఆరా తీశారు. తెల్లారినా పెళ్లికుమార్తె ఆచూకీ తెలియరాలేదు. ఏమైందో తెలియని పరిస్థితుల్లో చుట్టపక్కల వాళ్లంతా ఏవేవో మాట్లాడుకుంటున్నారు. వివాహ సమయం మించిపోయింది. పెళ్లికొచ్చిన బంధువులు, మిత్రులు అక్కడే వేచివున్నారు. వారిలో ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. కుటుంబ సభ్యులు చెట్టుపుట్టా తిరుగుతూ వెతుకుతూనే ఉన్నారు.

మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో గ్రామ శివారులోని చెరకు తోటలో పెళ్లి కుమార్తె తీవ్ర గాయాలతో.. అపస్మారక స్థితిలో పడివుంది. వెంటనే నిడదవోలులోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. ప్రాథమిక చికిత్స అందించారు. కొద్దిగా స్పృహలోకి వచ్చిన యువతి నోరు పెగల్చుకుని జరిగిన విషయం చెప్పింది. మృగాడి ఘాతుకానికి బలైందని తెలిసి ఆమె తల్లిదండ్రులు, బంధువులు బావురుమన్నారు. వివాహ వేదిక వద్ద వేచివున్న జనమంతా ఆసుపత్రికి చేరుకుని ఆవేదనకు గురయ్యారు. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో చివరకు పెళ్లిని నిలిపివేశారు. ఈ దురాగతం పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో చోటుచేసుకుంది. ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
 
పైసాపైసా కూడబెట్టుకుని..
ఊరూరా తిరుగుతూ సూదులు, పిన్నీసులు, బుడగలు అమ్ముకుని జీవనం సాగించే బడుగు జీవులు వారు. తెల్లవారగానే భుజాన సంచి తగిలించుకుని.. నెత్తిపై బుట్టలు పెట్టుకుని బతుకు సమరం సాగిస్తుంటారు. ఆ తల్లిదండ్రులు పైసాపైసా కూడబెట్టుకుని నాలుగు రాళ్లు వెనకేశారు. ఆ సొమ్ముతో కుమార్తె వివాహాన్ని ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు యువతి ఇంటివద్ద వివాహం జరగాల్సి ఉంది. మేలి ముసుగు వేసి.. మూడుముళ్ల బంధంతో వివాహ తంతు జరిపించే ఘడియ సమీపిస్తున్న తరుణంలో పెళ్లికుమార్తె మృగాడి ఘాతుకానికి బలికావడం ప్రజలను తీవ్రంగా కలచివేసింది. వివాహ వేదిక వద్దకు వందలాదిగా తరలివచ్చిన బంధువులు, స్నేహితులకు ఏం చెప్పుకోవాలో తెలియక ఆ తల్లిదండ్రులు నరక యాతన అనుభవించారు. అర్ధాంతరంగా పెళ్లి నిలిచిపోవడంతో అంతా ఆవేదనకు గురయ్యారు.
 
ఆశలు ఆవిరి
నిడదవోలు మండలంలోని ఓ ఊరి శివారున చెరకు తోటలో 18 ఏళ్ల యువతి అత్యాచారానికి గురైన ఘటన అందరినీ కలచివేసింది. మూడుముళ్లు పడాల్సిన వేళ ఈ విషయం తెలిసి కుమిలిపోయారు. ఎన్నో ఆశలతో మెట్టినింట అడుగు పెట్టాలి్సన ఆ యువతి ఆశలను ఆవిరి చేసిన ఆ మృగాడికి శాపనార్థాలు పెట్టారు. ఆదివారం రాత్రి బహిర్భూమికి వెళ్లిన యువతిని అదే గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు ఎత్తుకెళ్లగా.. వారిలో ఓ యువకుడు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆమె తీవ్రంగా గాయపడినా వదలకుండా పశువాంఛ తీర్చుకోవడంతో అపస్మారక స్థితికి చేరింది. 14 గంటలపాటు ఆమె ఆ తోటలోనే నరకయాతన అనుభవించింది.

సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో యువతి ఆచూకీ గుర్తించారు. హుటాహుటిన నిడదవోలులోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. ప్రాథమిక చికిత్స అనంతరం ఆమె స్పృహలోకి వచ్చింది. బాగా నీరసించిపోవడంతో నోరు పెగలటం లేదు. మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం తరలించారు. ఆమె నుంచి పోలీసులు ప్రాథమిక వాంగ్మూలం సేకరించారు. ఆమె పూర్తిగా కోలుకుంటే తప్ప మరిన్ని వివరాలు వెలుగులోకి రావని పోలీసులు చెబుతున్నారు. నిడదవోలు టౌన్‌ ఎస్సై డి.భగవాన్‌ప్రసాద్, సమిశ్రగూడెం ఎస్సై డి.ఈశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వార్తలు