క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్‌

29 Aug, 2016 23:55 IST|Sakshi
క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్‌

కడప స్పోర్ట్స్‌ :
క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు మీ సొంతమవుతుందని జిల్లా కలెక్టర్‌ కె.వి.సత్యనారాయణ అన్నారు. ఆదివారం కడప నగరంలోని డీఎస్‌ఏ క్రీడామైదానంలో జాతీయ క్రీడాదినోత్సవం నిర్వహించారు.  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో క్రీడాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. క్రీడాకారులు అంకితభావం, పట్టుదలతో ఇష్టమైన క్రీడలో రాణించాలని సూచించారు. హాకీ దిగ్గజం మేజర్‌ ధ్యాన్‌చంద్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.  జిల్లా హాకీ అసోసియేషన్‌ కార్యదర్శి సుభాన్‌బాషా మాట్లాడుతూ క్రీడల పట్ట ఆసక్తి కలిగిన కలెక్టర్‌ జిల్లాకు రావడం శుభపరిణామమన్నారు. అనంతరం గత మూడురోజులుగా నిర్వహించిన క్రీడాపోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు జ్ఞాపికలు అందజేశారు. అనంతరం జాతీయస్థాయిలో రాణించిన జిల్లా క్రీడాకారులు బి. సుహాసిని (బీచ్‌ కబడ్డీ), ఎ. అపర్ణ (కబడ్డీ), డి. చిన్ని (హాకీ), ఉదయ్‌దీపు (హాకీ), పి. భరద్వాజ్‌లను కలెక్టర్‌ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీఎస్‌డీఓ లక్ష్మినారాయణశర్మ, కోచ్‌లు గౌస్‌బాషా, షఫీ, సిబ్బంది అక్బర్, రవి, క్రీడాకారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు