అధికారులూ శభాష్‌

25 Sep, 2016 00:56 IST|Sakshi
అధికారులూ శభాష్‌
  • వర్షాల్లో వారి సేవలు బాగున్నాయి
  • వరద నష్టం అంచనాలపై నివేదికలు రూపొందించాలి
  • అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి
  • రబీకి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి
  • డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
  • హన్మకొండ అర్బన్‌ : జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల్లో ప్రభుత్వం తరపున ప్రజలకు అధికారులు అందించిన సేవలు అభినందనీయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. రానున్న మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో విపత్కర పరిస్ధితులను ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

    హన్మకొండలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో గ్రేటర్‌ మేయర్‌ నన్నపునేని నరేందర్, కలెక్టర్‌ వాకాటి కరుణ, నగర పోలీస్‌ కమిషనర్‌ సుధీర్‌బాబు, రూరల్‌ ఎస్పీ అంబర్‌కిషోర్‌ ఝాతో కలిసి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు, సహాయక చర్యలపై ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం శ్రీహరి మాట్లాడుతూ పది రోజుల నుంచి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో చెరువులు, కుంటలు, చిన్న నీటి ప్రాజెక్టులు నీటితో నిండి ప్రవహిస్తున్నాయన్నారు. జిల్లా యంత్రాంగం , పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండి వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరుగకుండా చర్యలు తీసుకోవడం సంతోషకరమన్నారు.

    నగరంలోని గోపాలపురం చెరువుకట్టపై నుంచి వరదనీరు పోతుందని, చిన్న వడ్డేపల్లి చెరువు మత్తడి పోసి లోతట్టు ప్రాంతాలు జలమ యమయ్యాయన్నారు. సాటునీటి పారుదల, ఇంజనీరింగ్‌, నగర పాలక సంస్ధ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అక్కడి నుంచి నీటిని పంపించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాలు తగ్గేవరకు అధికారులు క్షేత్రస్థా«యిలో అందుబాటులో ఉండాలన్నారు. అలాగే ఎలాంటి సెలవులు మంజూరు చేయొద్దని కలెక్టర్‌కు సూచించారు.


    66 చెరువులకు బుంగలు
    జిల్లా›లో వర్షాలతో 5550 చెరువుల్లో  66 చెరువులు బుంగపడ్డాయని డిప్యూటీ సీఎం తెలిపారు. పంచాయతీరాజ్‌శాఖ పరిధిలోని 22 రహదార్లు తెగిపోగా, 6 చోట్ల అర్‌అండ్‌బీ రహదారులు దెబ్బతిన్నట్లు తెలిసిందన్నారు. పునారావాస సహాయక శిబిరాల్లో ఉంటున్న వారికి వసతి, భోజనం సదుపాయం కల్పించాలన్నారు.వ్యవసాయ అధికారులు వర్షం తగ్గిన వెంటనే పంట నష్టం వివరాలు పూర్తిస్థాయిలో అంచనా వేసి నివేదిక సమర్పించాలన్నారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు సర్‌ప్లస్‌ నీటిని రేపటిలోగా ఎల్‌ఎండీకి వదులుతున్నందున జిల్లాలో రెండో విస్తీర్ణం పెరుగుతుందన్నారు.

    రబీకి కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుని అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. విద్యుత్‌ అధికారులు అంతరాయం లేకుండా కరెంట్‌ సరఫరా చేయాలన్నారు. వైద్యఆరోగ్య శాఖ అధికారులు అంటువ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు చికిత్సలు అందించాలన్నారు. నగర మేయర్‌ నన్నపునేని నరేందర్‌ మాట్లాడుతూ నగరంలో 12 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు ఉన్నాయని తెలిపారు. ఐఎంఏ, ప్రైవేట్‌ నర్సింగ్‌హోంల సహకారంతో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సమీక్షలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

     

మరిన్ని వార్తలు