తెల్లదొరలూ.. శ్రీవారి సేవకులే

15 Aug, 2016 12:42 IST|Sakshi
కొండపైనుంచి కాలిబాట సర్వే చేస్తున్న బ్రటీష్ అధికారుల బృందం(ఫైల్)
 టీటీడీ పాలనకు ఐదు మార్గదర్శకాలు
 1. దిట్టం
 2. కైంకర్యపట్టీ 1801-1820
 3. బ్రూస్‌కోడ్ 1821
 4. సవాల్-ఇ- జవాబ్ 1819
 5. పైమేయిషి అకౌంట్ 
 
సాక్షి, తిరుమల: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తిరుమలలో బ్రిటీష్ పాలనపై సవివరమైన కథనం... 1801 నుంచి 1843 వరకు 43 ఏళ్లపాటు తిరుమల ఆలయ పాలన బ్రిటీష్ ఈస్టిం డియా కోర్ట్ ఆఫ్ డెరైక్టర్స్ నార్త్ ఆర్కాట్ జిల్లా కలెక్టర్ నేతృత్వంలో సాగింది. అప్పటికే ఆలయంలో అంతర్గత కలహాలు ఉండేవి. ఆలయ సిబ్బంది, అర్చకులు, జీయర్ల మధ్య సఖ్యత కొరవడిందని చరిత్ర. దీంతో బ్రిటీష్ పాలకులు కఠిన నిబంధనలు అమలు చేశారు. క్రమశిక్షణతో ఆలయ పాలన గాడిలో పెట్టారట. ఆనాడు నార్త్ ఆర్కాట్ జిల్లా తొలి బ్రిటీష్ కలెక్టర్ స్టాటన్ దొర. తిరుమల విస్తీర్ణం, ఆలయ సిబ్బంది, వారి హోదా, జీత భత్యాలు, ఆలయ నిర్వహణ వ్యయం, నైవేద్యం, ఆర్జిత సేవల నిర్వహణపై ఆయన క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. 1803 జనవరి 31న తొలిసారిగా మద్రాసు ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వానికి కలెక్టర్ స్టాటన్ దొర నివేదికను సమర్పించారు. ఆయన తర్వాత తిరుమల ఆలయ పాలన జరిగిన అవకతవకలపై  విచారణాధికారిగా పి.బ్రూస్ నియమితులయ్యారు. 
 
దిట్టం
శ్రీవారికి నిత్యం సమర్పించే నైవేద్యం తయారీలో ముడిసరుకులు ఏయే పరిమాణంలో వినియోగించాలన్నదే దీని ముఖ్య ఉద్దేశం. ఇప్పటికీ ఆలయంలో లడ్డూలు, ప్రసాదాలు తయారీతోపాటు స్వామికి సమర్పించే పుష్పాలు కూడా దిట్టం ఆధారంగానే సరఫరా చేసి పుష్పకైంకర్యం నిర్వహిస్తున్నారు. కొండ లడ్డూ ఇప్పటికీ రుచిగా ఉండడానికి ప్రధాన కారణంగా దిట్టంలో పేర్కొన్న ప్రమాణాలే. ఆ ప్రకారమే సరుకులు సరఫరా చేసి నిత్యం లడ్డూలు, ప్రసాదాలు తయారు చేస్తారు. 
 
కైంకర్యపట్టీ 
తిరుమల ఆలయ సిబ్బంది, పరిచారకులు, మిరాశీదారులు, జీయ్యర్ సిబ్బంది విధులపై 1801, 1820 రెండుసార్లు కైంకర్యపట్టీ తయారు చేశారు. దీని ప్రకాారం సిబ్బంది హోదా, విధులు, పూర్తి వివరాలు ఉంటాయి. ఈ పట్టీ రికార్డులు నార్త్ ఆర్కాట్ జిల్లా కలెక్టర్, తిరుపతి తహశీల్దార్, తిరుమల ఆలయ పారుపత్తేదారు వద్ద ఉంటాయి. 
 
బ్రూస్‌కోడ్
దేవస్థానం పాలనకు మార్గదర్శంగా బ్రూస్‌కోడ్ ఉంది. బ్రిటీష్ ప్రావిన్సియల్ జడ్జి పి.బ్రూస్ ఈస్టిండియా కోడ్ ఆఫ్ డెరైక్టర్ ఉత్తర్వుల ప్రకారం ఆలయ పాలన సక్రమంగా సాగించేందుకు 1821, జూన్ 25న ప్రత్యేకంగా కోడ్ రూపొందించారు. ఈ కోడ్ లోని మార్గదర్శక సూత్రాల ప్రకారమే పాలన సాగాలని మద్రాసు బ్రిటీషు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాటి నుంచి ధార్మిక సంస్థలో బ్రూస్‌కోడ్ అమలైంది. 
 
సవాల్-ఇ-జవాబు
శ్రీవారి ఆలయంలో సేవలు, సిబ్బంది విధులు, ఆలయ ఖర్చులు, ఆదాయం, తిరుమల ఇతిహాసం, చరిత్రను నిర్వహించేందుకు ఈస్టిండియా కంపెనీ ప్రయత్నం చేసింది. 1819లో  14 ప్రశ్నలు వేసి వాటికి సమాధానాలు రూపొందించారు. దీన్నే  సవాల్-ఇ-జవాబు పట్టీగా పిలుస్తారు. 
 
పైమేయిషి అకౌంట్
ఆలయ స్థిర, చరాస్తులు, దేవతా విగ్రహాల వివరాలు, చిత్రాలు, తిరుమల, తిరుపతి, ఇతర పరిసర ప్రాంతాల్లోని ఆలయాల వివరాలు, విస్తీర్ణం, ఇనాం గ్రామాల వివరాలు రికార్డు చేశారు. 1819లో రూపొందించిన ఈ పద్ధతిని ‘పైమేయిషి అకౌంట్’ అని పిలుస్తారు. ధార్మిక సంస్థ పరిపాలనలో రికార్డులు, విధి విధానాలు రూపొందించడం, బ్రహ్మోత్సవాలు, ఇతర ప్రత్యేక ఉత్సవాలకు కలెక్టర్లను పర్యవేక్షకులుగా నియమించడం వీరి హయాంలోనే సాగింది. 1843లో ఆలయ ధర్మకర్త (విచారణకర్త)గా శ్రీహథీరాం మఠం మహంతు దేవాదాస్‌ను నియమిస్తూ పరిపాలన బాధ్యతలు అప్పగించడంతో తిరుమల ధార్మిక సంస్థలో ఈస్టిండియా పాలన ముగిసింది. 
 
శేషాచలం హద్దుల ఖరారు  
ప్రభుత్వ జీవో నెంబరు 713, తేదీ 18.11.1876 ప్రకారం 4.5 చదరపు మైళ్లు అంటే 12.5 చదరపు కిలోమీటర్లు అటవీ భూమిని నార్త్ ఆర్కాట్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి షెఫిల్ తిరుమల ఆలయానికి కేటాయించారు. ఆ మేరకు తిరుమల  ఆలయ పరిపాలనాధికారి హథీరాంమఠం మహంతు ధర్మదాస్‌కు అప్పగించారు. జీవో ఎంఎస్ నెంబరు 4429 తేదీ 23.09.1940,  జీవో ఎంఎస్ 659,  తేదీ 16.06.1941 ప్రభుత్వ గెజిట్ ఉత్తర్వుల ప్రకారం తిరుమల ఆలయానికి 27.5 కిలోమీటర్ల విస్తీర్ణంలో చుట్టూ అటవీ ప్రాంతం టీటీడీ పరిధిలోకి వచ్చింది. ఈ 27.5 చ.కి స్థల విస్తీర్ణ పరిధిలో మాత్రమే సాగే  టీటీడీ కార్యకలాపాలకు ఆనాడు బ్రిటీషు పాలకులు నిర్ణయించిన సరిహద్దులపైనే నేటికీ టీటీడీ ఆధారపడుతుండడం వారి పరిపాలన దక్షతకు నిదర్శనం. 
 
స్వామి సేవలో తరించిన తెల్లదొరలు 
పదహారు వందల సంవత్సరం తర్వాత ఆంగ్లేయులు, ఆ తర్వాత ఈస్టిం డియా కంపెనీ, వీరి నేతృత్వంలో మద్రాసు రాష్ట్ర రెవెన్యూ బోర్డు ఆధ్వర్యంలో ఉత్తర ఆర్కాటు జిల్లా కలెక్టర్ (1817 నాటి ఏడో మద్రాసు శాసనం ఆధారంగా) 1843 వరకు ఆలయ పరిపాలన సాగింది. 1843 ఏప్రిల్ 21వ తేదీ అప్పటి కలెక్టర్ ‘సనద్’ నివేదిక ప్రకారం ఆలయ పాలన హథీరాంజీ మఠం మహంతుల చేతుల్లోకి వెళ్లింది. 1843 జూలై 10 తేదీ నుంచి ఆలయానికి తొలి విచారణకర్త/ ధర్మకర్తగా మహంత్ సేవాదాస్  బాధ్యతలు చేపట్టారు. శ్రీవారికి నైవేద్యంగా సమర్పించే అన్న ప్రసాదాలు పెట్టే  రాగి గంగాళాన్ని ‘మన్రో గంగాళం’ అంటారు. ఒకప్పుడు దత్తత మండలం (నేటి రాయలసీమ) కలెక్టర్‌గా పనిచేసిన సర్ థామస్ మన్రో అనే బ్రిటీష్ అధికారి స్వామిని దర్శించుకోవాలని తపించేవాడట. కారణం తెలియదు కాని ఆయన కోరిక మాత్రం తీరలేదని చరిత్ర. కానీ ఆయన బహూకరించిన రాగి గంగాళంలోనే నేటికి శ్రీనివాసుడికి  నైవేద్య ప్రసాదం అందుతోంది. 
 
కింగ్‌జార్జ్, విక్టోరియా రాణి చిత్రాలు ఉన్న 492 నాణేలతో స్వామికి హారా న్ని తెల్లదొరలు తయారు చేయించారు. ఆలయంలో మూలమూర్తికి 1972 ముందు ఈ హారాలనే వినియోగించేవారు. ప్రస్తుతం కుప్పలు తెప్పలుగా ఆభరణాలు విరాళంగా అందుతుండడంతో పురాతన ఆభరణాలను టీటీడీ ఖజానాలో భద్ర పరిచింది. మరికొన్నింటిని కరిగించి బంగారు బార్లుగా మార్పిడి చేసి జాతీయ బ్యాంకుల్లో  ఆస్తుల రూపంలో భద్ర పరిచారు. 
 
భక్తులు కానుకలు సమర్పించే హుండీ/కొప్పెర కూడా  ఈస్టిండియా కం పెనీ పాలన కాలంలో 1821, జూలై 25న ఏర్పాటు చేశారని ఆలయ పరి పాలనా విధానాలను నిర్ధేశించే  చట్టం బ్రూస్‌కోడ్-12 ఆధారంగా ఉంది. 
 
స్వామి ప్రసాదంగా లడ్డూ అన్నది తాళ్లపాక అన్నమాచార్యుల కీర్తనల్లో ఉండగా, ఆ తర్వాత అమల్లేదన్నది ప్రచారం. 1803లో అప్పటి బ్రిటీషు  ఉమ్మడి మద్రాసు ప్రభుత్వంలోని తెల్లదొరలే  తిరుమల ఆలయంలో  బూందీని ప్రసాదంగా పంచడం మొదలు పెట్టించారట. 1940 తర్వాత క్రమంగా బూందీ లడ్డూగా స్థిరపడింది. 
 
కాలినడక తప్ప మరొక మార్గంలేని శేషాచలం అడవిలో తొలిసారిగా 1944 ఏప్రిల్ 10వ తేదీ తిరుమలకు తొలి ఘాట్‌రోడ్డు ఏర్పాైటై నల్లరంగు చిన్న బస్సులు నడిచాయి. అప్పటి మద్రాసు ఉమ్మడి బ్రిటీషు గవర్నర్ ఆర్థర్ హూప్ నేతృత్వంలో భారతీయ ప్రముఖ ఇంజినీరు  మోక్షగుండం విశ్వేశ్వరయ్య నేతృత్వంలో మొదటి ఘాట్‌రోడ్డు రూప కల్పన చేశారు. ఆ తర్వాత టీటీడీ ఆవిర్భవించిన నలభై ఏళ్లనాటికి అంటే 1973లో రెండో ఘాట్‌రోడ్డు నిర్మించి భక్తులకు ప్రయాణ సౌకర్యాలు పెంచారు. 
 
1970 కి ముందు మొదటి ఘాట్ రోడ్డులో నడిచిన బస్సులు.
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా