రవాణా శాఖలో దళారుల దందా

26 Feb, 2017 03:38 IST|Sakshi
రవాణా శాఖలో దళారుల దందా

వాహనదారుల్ని బ్రోకర్ల వద్దకు పంపుతున్న కార్యాలయ సిబ్బంది
నేరుగా కార్యాలయాల్లో బేర సారాలు సాగిస్తున్న వైనం


నగరంపాలెం (గుంటూరు):
గుంటూరు రవాణాశాఖ కార్యాలయం దళారుల కనుసన్నల్లో నడుస్తోంది. బ్రోకర్లు కిందిస్థాయి సిబ్బంది మిలాఖత్‌ అయి దందా నడిపిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వాహనదారుడు కొత్త వాహనం కొన్నదగ్గర్నుండి రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, రోడ్‌ ట్యాక్స్‌.. ఇలా అన్ని పనులకు ఒక రేటు నిర్ణయించి సొమ్ము చేసుకుంటున్నారు. సదరు అధికారులే  దళారుల్ని పిలిపించి బేరసారాలు చేస్తున్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అందుకు చక్కటి ఉదాహరణ శనివారం జరిగిన సంఘటనే. పాత గుంటూరుకు చెందిన ఓ వ్యక్తి టాక్సు చెల్లించడానికి రాగా  సిబ్బంది చుక్కలు చూపించి మూడు చెరువుల నీళ్లు తాగించారు. చివరకు కొంత డబ్బు ఇవ్వాలని పీడించి వసూలు చేసి పని చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.

సరాసరి దళారుల వద్దకే..
పాతగుంటూరుకు చెందిన ఓ వ్యక్తి ఇటీవల కారు కొనుగోలు చేశాడు. సదరు వాహనం రిజిస్ట్రేషన్‌ ట్యాక్సీ పేరుతో ఉండటంతో నాన్‌ట్రాన్స్‌పోర్టు వాహనంగా మార్చుకోవడానికి ఫిబ్రవరి 1న గుంటురు ఉప రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లాడు. వివరాలు ఎవరిని అడగాలో తెలియక గంటల పాటు ఇబ్బంది పడ్డాడు. చివరికి ట్యాక్సీ క్యాబ్‌లో సెక్షన్‌ సిబ్బందిని విచారించగా సదరు వ్యక్తులు సరాసరి దళారుల వద్దకు వెళితే పని అవుతుందని సూచించగా వాహనదారుడు అవాక్కయ్యాడు.

హెల్ప్‌ డెస్క్‌ నుంచే దందా షురూ..
రవాణా శాఖ కార్యాలయం సమాచారం కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌ అధికారులే బ్రోకర్లను ఆశ్రయించాలని సూచిస్తున్నారు.
వాహనం కొనుగోలు చేసేటప్పుడు అవగాహన లేక ఎంతో మంది ఇలా మోసపోతూనే ఉన్నారు. గట్టిగా నిలదీస్తే చేయాల్సిన పనిని ఆపి నెలల పాటు కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారు. ఇప్పటికైనా ఆ శాఖ ఉన్నతాధికారులు స్పందించి అవినీతికి అడ్డుకట్ట వేయాలని వాహనదారులు కోరుతున్నారు.

ప్రతి పనీ సెప‘రేటు’..
కార్యాలయంలో ఓ దళారి తాను ఎంవీఐ డ్రైవర్‌నని పరిచయం చేసుకొని లైఫ్‌ టాక్స్‌ రూ.23 వేలతో పాటు మరో రూ.5 వేలు లంచం ఇవ్వాలని సూచించాడు. సదరు వాహనదారుడు చేసేందేంలేక అందుకు ఒప్పుకున్నాడు. వాహనాన్ని బ్రేక్‌ వద్దకు తీసుకెళ్లి దళారే కార్యాలయంలో గుమస్తాలతో దరఖాస్తు పత్రాలపై సంతకాలు చేయించాడు. ఇతర దళారులకు ఇదే పని నెల రోజులు పడుతుందని, తాను మూడు రోజుల్లోనే చెప్పి లైఫ్‌ ట్యాక్స్‌ కాక అదనంగా అడిగిన నగదు తీసుకున్నాడు. అప్పటి నుంచి పనిని వాయిదా వేస్తూ 24వ తేదీన ఫోన్‌లో సంప్రదించగా లైఫ్‌ టాక్స్‌ రూ.28 వేలు అని, మరో రూ. 5 వేలు ఇస్తే తప్ప పని జరగదని చెప్పాడని బాధితుడు వాపోయాడు. చివరికి చేసేదేంలేక ఉసూరుమంటూ నగదు చెల్లించాడు. ఇలాంటి ఘటనలు రోజుకు ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. కానీ బయటకు వచ్చేవి మాత్రం కొన్నే..!

మరిన్ని వార్తలు