బ్రోకర్ల బరితెగింపు..

9 Oct, 2016 05:26 IST|Sakshi
బ్రోకర్ల బరితెగింపు..
– బహిరంగ మార్కెట్‌లో ఇళ్ల పట్టాలు
– రూ.5 వేల నుంచి రూ.50 వేలిస్తే చాలు
– తహసీల్దార్ల సంతకాలు ఫోర్జరీ!
– రెవెన్యూ పాత్రపైనా అనుమానాలు
 
 
సాక్షి ప్రతినిధి, ఏలూరు :మీకు ఇంటి స్థలం లేదా.. సొమ్ములిస్తే క్షణాల్లో మీ పేరిట ఇంటిస్థలం పట్టా వచ్చేస్తుంది. సాక్షాత్తు ప్రభుత్వం తరఫున అధికారులు గతంలోనే మీకు స్థలం కేటాయించినట్టు పట్టా పుట్టేస్తుంది. ప్రధాన సెంటర్‌లో ఇంటి పట్టా కావాలన్నా.. గ్రామీణ ప్రాంతంలో స్థలమైనా ఫర్వాలేదు. అయితే, మీరు కోరే స్థలాన్ని బట్టి రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు సొమ్ము చెల్లిస్తే చాలు. ఈ పరిస్థితి జిల్లా వ్యాప్తంగా వేళ్లూనుకుంది. ముఖ్యంగా జిల్లా కేంద్రమైన ఏలూరులోనూ ఈ దందా నడుస్తోంది. ఇంటిస్థల పట్టాలను సర్కారు రాజముద్ర, రెవెన్యూ శాఖ స్టాంపులతోపాటు అధికారుల సంతకాలు చేసి మరీ దొంగచాటుగా జారీ చేస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ స్థలాలను, గతంలో బినామీ పేర్లతో కేటాయించిన ఇంటి స్థలాల వివరాలను దళారులు సేకరించి.. వాటికి పట్టాలను సిద్ధం చేస్తున్నారు. 
 
ఏలూరులో ఇలా
జిల్లా కేంద్రమైన ఏలూరులో ఇలాంటి బాగోతం శుక్రవారం వెలుగు చూసింది. నగరంలోని మార్కండేయస్వామి ఆలయ సమీపంలో నివాసం ఉంటున్న నిరజంన్‌సింగ్‌ ఠాకూర్‌ ఇంట్లో సోదా చేయగా రెవెన్యూ అధికారులకు డాక్యుమెంట్లు లభించాయి. ఏలూరు తహసీల్దారుగా పనిచేసిన ఏజీ చిన్నికష్ణ సంతకంతో నాలుగు ఇంటి స్థల పట్టాలు కూడా బయటపడ్డాయి. రాష్ట్ర భూ పరిపాలన ముఖ్య కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) కార్యాలయంలో ఉండాల్సిన రెవెన్యూ రికార్డు ఒరిజనల్‌ ఫైల్‌ కూడా ఈ దాడుల్లో లభ్యమైంది. ఏలూరు మండలం సుంకర వారితోటలో లంకా నాగేశ్వరరావు ఇంటిపై దాడులు నిర్వహించగా నాలుగు ఖాళీ ఇంటిస్థల పట్టాలు లభించాయి. వీటిని పరిశీలించిన రెవెన్యూ అధికారులు ముక్కున వేలేసుకున్నారు. 
 
తహసీల్దార్ల సంతకాలను ఫోర్జరీ చేసి..
ఏలూరులో లభ్యమైన ఇంటి పట్టాలని పరిశీలిస్తే.. గతంలో పనిచేసిన తహసీల్దార్ల సంతకాలను ఫోర్జరీ చేసినట్టు వెల్లడైంది. సంబంధిత తహసీల్దార్‌ స్టాంపును, తహసీల్దార్‌ కార్యాలయం రాజముద్రను బ్రోకర్లు తయారు చేయించినట్టు సమాచారం. వీటికి తోడు నోటరీ అఫిడవిట్‌ను జారీ చేసేందుకు అవసరమైన న్యాయవాదులకు సంబంధించిన స్టాంపులను కూడా తయారు చేయించుకున్నారు. అసలుకు, నకిలీకి తేడా లేకుండా ఖాళీ పట్టాలను సిద్ధం చేసుకుంటున్నారు. పేదవాళ్ల అవసరాలను, నివాస స్థలాల కోసం తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరిగే వారిని గుర్తించి వారికి పట్టాలు మంజూరు చేయిస్తామంటూ నమ్మిస్తున్నారు. అధికారులకు రూ.వేలల్లో ముట్ట చెప్పాలంటూ వారి వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆ తరువాత ఒక పట్టాను రాసిచ్చేస్తున్నారు. తీరా స్థలంలోకి వెళ్లాక అధికారులు అభ్యంతరం పెట్టడం, అదే స్థలంలో వేరే వారు ఉండటంతో పట్టాలు పొందిన వారు లబోదిబోమంటున్నారు.

వీటిపై ఫిర్యాదు చేసేందు మీ కోసం కార్యక్రమాలకు, ఆర్డీవో కార్యాలయాలయాలకు బాధితులు వస్తున్నారు. తమకు పట్టా ఇచ్చారని, స్థలం చూపించడం లేదని బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ పట్టా అధికారికంగా జారీ చేసిందా లేక నకిలీదో ఉన్నతాధికారులే తేల్చుకోలేక దీనిపై విచారణ చేయిస్తామని చెబుతున్నారు. ఇలాంటి ఫిర్యాదుల నేపథ్యంలోనే ఏలూరులో నకిలీ పట్టాల బాగోతం వెలుగుచూసింది. అయితే వీటి వెనుక గతంలో పనిచేసిన రెవెన్యూ అధికారుల హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉంది.
 
అసై ్సన్‌మెంట్‌ పట్టా జారీ చేయాలంటే
సామాన్యుడికి ఎసైన్‌మెంట్‌ పట్టా జారీ చేయాలంటే సదరు స్థలానికి పంచాయతీ అనుమతి ఉండాలి. పూర్తిస్థాయిలో పంచాయతీ లేఅవుట్‌ అయి ఉండాలి. స్థానిక ఎమ్మెల్యే చైర్మన్‌గా, ఆర్డీవో కన్వీనర్‌గా, తహసీల్దార్‌ మెంబర్‌గా వ్యవహరించే కమిటీ ఈ స్థలానికి ముందుగా ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. ఈ విధంగా జారీ చేసిన పట్టాలపై ఏ1 నోటీసులు జారీ చేసి 15 రోజుల్లో అభ్యంతరాలు స్వీకరించాలి. ఎటువంటి అభ్యంతరాలు లేనప్పుడు మాత్రమే అసై ్సన్‌మెంట్‌ పట్టాను సంబంధిత తహసీల్దార్‌ జారీ చేస్తారు. కానీ ఎక్కడా ఈ విధంగా జరగడం లేదు.
 
మరిన్ని దాడులు చేస్తాం
జిల్లా వ్యాప్తంగా నకిలీ పట్టాల బాగోతంపై మరిన్ని దాడులు చేస్తాం. ఇటీవల రెవెన్యూ కార్యకలాపాలన్నీ ఆన్‌లైన్‌ చేయడం వల్ల ఈ బాగోతాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏలూరులో ఇటువంటి పట్టాలు కలిగి ఉన్నారని సమాచారం అందిస్తే తక్షణమే చర్యలు చేపడతాం. మరిన్ని నకిలీలను వెలుగులోకి తీసుకొస్తాం. ప్రస్తుతం లభించిన పట్టాలపై ఉన్న సంతకాలు అసలా, నకిలీవా అనే విషయాన్ని నిగ్గు తేల్చేందుకు విచారణ చేస్తున్నాం.
–నంబూరి తేజ్‌భరత్, ఆర్‌డీవో, ఏలూరు
>
మరిన్ని వార్తలు