నిర్వాసితులపై దళారుల పంజా

26 May, 2017 01:38 IST|Sakshi
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఒక రైతు తనకున్న 40 ఎకరాల భూమిని పోలవరం నిర్వాసితుల కోసం ప్రభుత్వానికి ఇచ్చాడు. ఇంతలో ఓ దళారి రంగప్రవేశం చేశాడు. సొమ్ములు ఇస్తేనే ఆ భూమికి సంబంధించిన నష్టపరిహారం అందుతుందని.. లేదంటే నీ సంగతి అంతేనంటూ భయపెట్టాడు. రూ.100 స్టాంప్‌ పేపర్‌పై ఆ రైతుతో సంతకం చేయించుకున్నాడు. మూడు ఖాళీ చెక్కులు సైతం తీసుకున్నాడు. భూసేకరణ జరిపిన ఐటీడీఏ పీఓ షణ్మోహ¯ŒS నేరుగా ఆ రైతు ఖాతాలో పరిహారం సొమ్ము జమ చేయించారు. అయినా.. దళారి ఊరుకోలేదు. తనవల్లే ఆ పని అయ్యిందని, ఎకరానికి రూ.50 వేల చొప్పున 40 ఎకరాలకు రూ.20 లక్షలు చెల్లించాలని పట్టుబట్టాడు. లేదంటే తనవద్ద ఉన్న స్టాంప్‌ పేపర్, బ్యాంకు చెక్కులను వినియోగించి రకరకాల కేసులు వేయిస్తానని బెదిరించాడు. దిక్కులేని పరిస్థితిలో ఆ దళారికి రైతు రూ.20 లక్షలు ముట్టజెప్పాడు. ఈ విషయం బయటపడితే తనను ఎలాంటి ఇబ్బందులకు గురి చేస్తాడోననే భయంతో నోరు మెదపటం లేదు. ఇదిలావుంటే.. దర్భగూడెం గ్రామానికి చెందిన మరో రైతుకు అదే గ్రామంలో 7 ఎకరాల భూమి ఉంది. 30 ఏళ్లుగా ఆ భూమిని మరొకరు అనధికారికంగా సాగు చేసుకుంటున్నారు. అప్పట్లో 
ఏజెన్సీలో తలెత్తిన ఘర్షణల కారణంగా ఆ రైతు ఊరొదిలి వెళ్లిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఆ భూమిని రెవెన్యూ అధికారులు సేకరించారు. రికార్డులన్నీ సక్రమంగా ఉండటంతో ఆ రైతు ఖాతాలో పరిహారం సొమ్ము జమ చేశారు. అంతకుముందే దళారులు అతని నుంచి చెక్కులు తీసుకున్నారు. అతనికి అందిన పరిహారంలో సగం సొమ్ము తీసుకున్నారు. అందులో కొంత సొమ్మును అనుభవదారుకు ఇచ్చారు. దీంతో లబోదిబోమనడం అటు రైతు, ఇటు భూమి అనుభవదారుల వంతయ్యింది.
 
పెచ్చుమీరిన పర్సంటేజీల దందా
పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం వల్ల నిర్వాసితులయ్యే వారి కోసం సేకరిస్తున్న భూముల విషయంలో దళారుల దందా పెచ్చుమీరింది. భూములిచ్చిన రైతులకు చెల్లించే పరిహారం వారికి అందాలంటే తాము అడిగినంత సొమ్ము ఇవ్వాల్సిందేనంటూ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ వల్ల ముంపుబారిన పడే వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని నిర్వాసిత గిరిజనులకు భూమికి భూమి ఇచ్చేందుకు జీలుగుమిల్లి మండలం లోని దర్భగూడెం, ములగలంపల్లి, స్వర్ణవారిగూడెం, పి.అంకంపాలెం, పి.నారాయణపురం, రాచన్నగూడెం, బుట్టాయగూడెం, దొరమామిడి గ్రామాల్లో 4,035 ఎకరాల భూమిని అధికారులు సేకరించారు. భూములిచ్చిన రైతులకు పరిహారం సొమ్మును వారి ఖాతాల్లో జమ చేశారు. అప్పటికే వారినుంచి ఖాళీ చెక్కులు, స్టాంప్‌ పేపర్లపై సంతకాలు తీసుకున్న దళారులు తాము అడిగినంత సొమ్ములు ఇవ్వకపోతే పరిహారం సొమ్ము వెనక్కి వెళ్లిపోయేలా చేస్తామని బెదిరిస్తూ వసూళ్ల పర్వానికి తెగబడుతున్నారు. ఎకరానికి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. దర్భగూడెంలో 230 ఎకరాలు సేకరించగా.. ఒక చోటా నాయకుడు రైతుల నుంచి పెద్దఎత్తున వసూళ్లకు పాల్పడినట్టు సమాచారం. 
 
కేసులు తప్పవు
పరిహారం అందిన రైతుల నుంచి ఎవరైనా కమీషన్ల రూపంలో సొమ్ములు వసూలు చేస్తే కేసులు నమోదు చేస్తామని భూసేకరణ అధికారి షణ్మోహన్‌ తెలిపారు. బాధితులు తనకు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని కోరారు. 
 
మరిన్ని వార్తలు