బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఎన్నికల కోలాహలం

30 Apr, 2016 11:10 IST|Sakshi

కర్నూలు: బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల జాతీయ స్థాయి సంఘాలకు ఎన్నికల తేదీ ప్రకటించడంతో కర్నూలులో కోలాహలం ప్రారంభమైంది. నాన్‌ ఎగ్జిక్యూటివ్స్‌ ఉద్యోగులు మెజారిటీ యూనియన్‌ను నిర్ణయించేందుకు మే నెల 10న ఏడో వెరిఫికేషన్‌ (ఎన్నికలు) నిర్వహించనున్నారు.

దేశ వ్యాప్తంగా 19 యూనియన్లుండగా ఈయూ, ఎన్‌ఎఫ్‌టీఈ మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది.  2002లో జరిగిన మొదటి ఎన్నికల్లో మాత్రమే ఎన్‌ఎఫ్‌టీఈ గెలిచింది. తర్వాత ఐదుసార్లు ఈయూ గెలుస్తూ వచ్చింది. 2013 ఏప్రిల్‌ 6 ఎన్నికల్లో ఈయూ 48.6 శాతం ఓట్లతో ప్రధాన గుర్తింపు యూనియన్‌గా ఎంపికైంది. ప్రస్తుతం ఈ రెండు సంఘాలకు వరుసగా అభిమన్యు, కామేశ్వరసింగ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా వ్యవహరిస్తున్నారు. వారం రోజులుగా ఇరు సంఘాల నేతలు ప్రచారం కొనసాగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 716 మంది ఓటర్లుండగా కర్నూలు పాత బస్టాండులోని టీఆర్‌ఏ కార్యాలయం, శ్రీనివాసనగర్‌లోని ఈ10బీ ఎక్సేంజీ, నంద్యాల, ఆదోని, డోన్‌ కేంద్రాల్లో పోలింగ్‌ నిర్వహిస్తారు. డీఈ రమేశ్‌ ఎన్నికల సహాయ అధికారిగా వ్యవహరిస్తారు. ప్రధాన యూనియన్ల  నాయకులు సమావేశాలతో తలమునకలై ఉన్నారు. జాతీయ నాయకులు కర్నూలు, ఆదోని కేంద్రాల్లో సుడిగాలి పర్యటన జరిపి బుధవారం రాత్రి పొద్దుపోయే దాకా ప్రచార సభలు నిర్వహించారు.

>
మరిన్ని వార్తలు