బడ్జెట్‌తో సంబంధం లేకుండా వేతనాలు

27 Jul, 2016 00:35 IST|Sakshi
రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న ఎయిడెడ్, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్‌ ఉపాధ్యాయులకు బడ్జెట్‌తో సంబంధం లేకుండా మొదటి తేదీన జీతాలు చెల్లించేందుకు ఆర్థికశాఖ మార్గదర్శకాలు రూపొం దిస్తుందని యూటీఎఫ్‌ జిల్లా అసోసియేట్‌ అధ్యక్షుడు దాసరి నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో పని చేస్తున్న ఎయిడెడ్, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉపాధ్యాయులకు క్వార్టర్ల వారీగా బడ్జెట్‌ విడుదల చేయడం, ఇది జిల్లాలకు చేరి డీఈవో కార్యాలయాలు, ఖజాన శాఖల్లో ఆమోదం పొంది సంబంధిత ఉపాధ్యాయుల ఖాతాల్లో జమ అయ్యేందుకు రెండు, మూడు నెలలు సమయం పట్టేందన్నారు. ఈ సమస్యను ఉపాధ్యాయ సంఘాలు అనేక దఫాలు ప్రభుత్వం దష్టికి తీసుకువెళ్లాయన్నారు. సమస్య పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడమే తప్ప ఆచరణ జరగలేదన్నారు. దీనిపై సోమవారం యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన  కార్యదర్శులు ఐ.వెంకటేశ్వరరావు, పి.బాబురెడ్డి, పీడీఏ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు ఆర్థిక కార్యదర్శి రవిచంద్ర దష్టికి తీసుకువెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. ఇక నుంచి ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లించే విధంగా ఉత్తర్వులు జారీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారన్నారు. పదవీ విరమణ చేసిన  ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి పెన్షన్లు ఈ–పేమెంట్‌ ద్వారా చెల్లించే ప్రతిపాదనకు మార్గదర్శకాలు విడుదల అవుతాయని ఆయన తెలిపారు. 
 
 
మరిన్ని వార్తలు