విషం కలిపిన నీరు తాగి గేదెలు మృతి

13 Aug, 2016 18:40 IST|Sakshi
విషం కలిపిన నీరు తాగి గేదెలు మృతి
ఆత్మకూర్‌(ఎస్‌) : ఆకతాయిల పనో, గిట్టనివారి పనోగాని నీటిలో విషం కలపడంతో మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. ఈ ఈ సంఘటన మండల పరిధిలోని కోటపహడ్‌ ఆవాసం తెట్టెకుంటతండాలో శనివారం చోటుచేసుకుంది. బాధితుడు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన భానోత్‌ లింగ్యా వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. కాగా గుర్తుతెలియని వ్యక్తులు పశువులు నీళ్లు తాగే తొట్టెలో పురుగుల మందు కలిపారు. ఇది గమనించని లింగ్యా ఉదయం 8 గంటల సమయంలో కోడెకు నీళ్లు తాగించడంతో కొద్దిసేపటికే సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో విషపు ముట్టిందనుకొని చికిత్సనిమిత్తం కోడెను గ్రామానికి తీసుకురాగా అప్పటికే చనిపోయింది. అనంతరం కోడెను బొందపెట్టేందుకు గుంతతీసుకుంటూ ఉండడంతో ఇంట్లో వాళ్లు మేకకు, గేదెలకు నీళ్లు తాపడంతో అవికూడా వెంటనే సొమ్మసిల్లి పడిపోయాయి. దాంతో వెంటనే పశువైద్యుడికి సమాచారం అందించడంతో చికిత్స అందిస్తుండగానే మృత్యువాత పడ్డాయి.  ఈ ఘటనలో 2 గేదెలు, 1 కోడె, 1 మేక మృత్యువాత పడ్డాయి. విషం కలిపిన నీరు తాగడంతోనే మృత్యువాత పడ్డాయని అసిస్టెంట్‌ పశువైద్యాధికారి సైదులు తెలిపారు. వాటి విలువ దాదాపు లక్ష రూపాయలు ఉంటుందని బాధితుడు రోదిస్తూ తెలిపాడు. ఈ విషయమై పలువురిపై అనుమానితులుగా పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.
 
మరిన్ని వార్తలు