రూ.15 కోట్ల మోసగించిన బిల్డర్

11 Nov, 2015 12:05 IST|Sakshi
రూ.15 కోట్ల మోసగించిన బిల్డర్

విజయవాడ : తుక్కవ ధరలకే ఫ్లాట్లు ఇస్తానని విజయవాడకు చెందిన ఓ బిల్డరు కోట్లకు ఎగనామం పెట్టాడు. గుణదల ప్రాంతానికి చెందిన చలసాని శ్రీకృష్ణ సుమారు రూ. 15 కోట్ల మేర మోసగించాడంటూ బాధితులు ప్రసాదంపాడులో అతని కార్యాలయం వద్ద మంగళవారం ఆందోళన చేపట్టారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. 2002-03 సంవత్సరం నుంచి బిల్డరు అవతారమెత్తిన శ్రీకృష్ణ కోట్ల రూపాయల్లో అడ్వాన్సులు, అప్పులు తీసుకున్నాడు.

ప్రసాదంపాడులో అతనికి బంధువులు ఎక్కువగా ఉండడంతో ఈ గ్రామంలోనే రియల్ ఎస్టేట్ కార్యాలయం ప్రారంభించి కార్యకలాపాలు మొదలు పెట్టాడు. గ్రామంలోని కొందరు స్థల యాజమానుల వద్ద నుంచి డెవలప్‌మెంట్‌కు స్థలాలు తీసుకుని గ్రూప్ హౌస్‌లు, అపార్టుమెంట్‌ల నిర్మాణం ప్రారంభించాడు. తక్కువ ధరకే ఫ్లాట్లు ఇస్తానని నమ్మించి ముందుగానే అడ్వాన్సుల రూపంలో కోట్లలో సేకరించాడు.

ప్రసాదంపాడులో బంధువులు ఎక్కువగా ఉండటం, గ్రామ పెద్దలు, గ్రామ నాయకులను బంధు వరుసలతో పిలవడంతో అతనిపై నమ్మకం ఏర్పడి ఫైనాన్సర్లతో పాటు చిన్న వర్తకులు మొత్తం 150 మంది భారీ మొత్తంలో అప్పులు ఇచ్చారు. ఈ మొత్తం కలిపి రూ.15 కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం. చేసిన అప్పులు తిరిగి ఇవ్వకపోవడం, అడ్వాన్సులు తీసుకుని ఫ్లాట్లు ఇవ్వకపోవడంపై అనుమానం వచ్చిన బాధితులు శ్రీకృష్ణను నిలదీశారు.

తన బండారం బయట పడడంతో గత రెండు నెలలుగా మాయమయ్యాడు. బాధితులు గుణదలలోని అతని ఇంటి వద్దకు వెళ్లి విచారించగా అప్పటికే సొంత ఇంటిని అమ్మేసి కుటుంబ సభ్యులతో ఎక్కడికో వెళ్లిపోయాడని తెలుసుకున్నారు. బాధితులు చేస్తున్న ఆందోళనపై సమాచారం అందుకున్న పటమట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు