సారొస్తున్నారు.. సర్దుకోండి!

16 Aug, 2016 20:32 IST|Sakshi
సారొస్తున్నారు.. సర్దుకోండి!
* పోలీసుల హడావుడి 
* స్నానాలు చేసే వారిని ఘాట్‌ల నుంచి ఖాళీ చేయించిన వైనం
* పుణ్యం కోసం వచ్చిన భక్తులకు ఇబ్బందులు 
 
కృష్ణా పుష్కరాల కోసం అమరావతికి వచ్చిన భక్తులకు మంగళవారం చుక్కలు కనిపించాయి.. ముఖ్యమంత్రి అమరావతికి వస్తుండటంతో భక్తులను ఘాట్‌ వద్దకు అనుమతించే విషయంలో అటు పోలీసులు, ఇటు అధికారులు ఇబ్బందులకు గురిచేశారు.. తెల్లవారుజామున స్నానాలకు వచ్చిన వారిని సైతం పోలీసులు ఘాట్‌ల నుంచి బయటకు వెళ్లాలని ఆదేశాలు జారీచేసి ఘాట్‌లను ఖాళీ చేయించారు.. దీంతో స్నానాలకు వచ్చిన భక్తులు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకూ ఘాట్‌ వద్ద వేచి చూడాల్సిన పరిస్థితి.. ఈ సమయంలో భక్తుల అవస్థలు వర్ణనాతీతం.
 
అమరావతి (గుంటూరు రూరల్‌) : పుష్కరాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతికి వచ్చే సమయంలో పోలీసుల హడావుడి భక్తులను ఇబ్బందులకు గురిచేసింది. ముఖ్యమంత్రి ఉదయం 11.30కు ధరణికోట ఘాట్‌ వద్దకు వచ్చి సుమారు గంటపాటు మీటింగ్‌ చెప్పారు. ఆ సమయంలో భక్తులు స్నానాలు చేయకుండా పోలీసులు ధరణికోట ఘాట్‌ను ఖాళీ చేయించారు. దీంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. ముఖ్యమంత్రి ఎప్పుడు వెళతాడా అని భక్తులు ఎదురుచూశారు. 
 
ట్రాఫిక్‌ మళ్లింపు.. 
ముఖ్యమంత్రి పర్యటన ఉండటంతో అమరావతికి వచ్చే సత్తెనపల్లి, క్రోసూలు, విజయవాడ, గుంటూరు రహదారుల నుంచి వచ్చే భక్తులను రాకుండా నిలిపివేశారు. దీంతో ముఖ్యమంత్రి వెళ్లే వరకూ భక్తులు రోడ్లపై నరకయాతన పడ్డారు. దీనికితోడు ఘాట్‌ల వద్ద ఉన్న భక్తులను పోలీసులు స్నానాలు చేయకుండా నిలిపివేయటంతో ఇబ్బందులు పడ్డారు.
 
ఖాళీగా ఘాట్‌లు.. 
ముఖ్యమంత్రి అమరావతిలోని ధరణికోట ఘాట్లో మీటింగ్‌ చెప్పటం ప్రారంభించటంతో పోలీసులు అరకొరగా ఉన్న భక్తులను మీటింగ్‌ వద్దకు తరలించారు. పుణ్య స్నానాలకు వస్తే మీటింగ్‌లని తరలిస్తారేంటని భక్తులు పోలీసులను ప్రశ్నించగా పైస్థాయి అధికారుల ఆదేశాలని, ముఖ్యమంత్రి మీటింగ్‌లో జనాలు లేకుంటే బాగుండదని చెప్పి తరలిస్తున్నామని తెలపటం గమనార్హం. సీఎం తన ప్రసంగంలో ‘సాక్షి’ పత్రికపై అక్కసు వెళ్లగక్కారు. ‘సాక్షి’ పత్రికలో వస్తున్న కథనాలను విమర్శించారు.
మరిన్ని వార్తలు